తెలుగుదేశం భూలాభం
ఎపి నూతన రాజధాని అమరావతిలోనూ ఇతర జిల్లా కేంద్రాల్లోనూ రాజకీయ పార్టీలకు స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒక్క ఎకరాకు వెయ్యి రూపాయల చొప్పున 33 ఏళ్ల పాటు ఈ స్థలాలు వాటికి అప్పగిస్తారు. ఆ పార్టీ రంగంలో ఉంటే 99 ఏళ్ల వరకైనా లీజు పొడగిస్తామంటున్నారు. గతంలోనూ కూడా దేశ రాజధాని ఢిల్లీలోనూ, రాష్ట్రాల్లోనూ స్థలాలు పార్టీలకు కేటాయించిన సందర్భాలున్నాయి. అయితే అప్పుడు అనుసరించిన కొలబద్దలకు ఇప్పుడు తెలుగుదేశ ప్రభుత్వ ఫర్మానాకు బొత్తిగా పొంతనలేదు. గుర్తింపు పొందిన పార్టీలకు సమాన ప్రాతిపదికన స్థలాల కేటాయింపు గతంలో జరిగింది. శాసనసభలో సంఖ్యా బలాన్ని బట్టి స్థలాల ధారాదత్తం ఇప్పుడు జరుగుతున్నది. అసెంబ్లీలో 50శాతం పైగా స్థానాలు కలిగిన పార్టీకి రాజధానిలో నాలుగు ఎకరాలు, జిల్లా కేంద్రాల్లో రెండు ఎకరాల వరకు భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 25నుంచి 50 శాతం సీట్లు గల పార్టీకి రాజధానిలో అర ఎకరం, జిల్లా కేంద్రాల్లో 1000 చదరపు గజాలు ఇవ్వాలని పేర్కొంటున్నది. సభలో ఒక్క సభ్యుడు మాత్రమే ఉంటే ఇంకా చాలా తక్కువ లభిస్తుంది. భూమిని ఉద్దేశిత ప్రయోజనం కోసం వాడాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా భవన నిర్మాణం జరుపకపోతే ప్రభుత్వం ఇచ్చిన భూమిని తిరిగి తీసుకోవాలంటూ ఆ అధికారం కలెక్టర్లకు కట్టబెట్టారు.
పైపైన చూస్తే హేతుబద్ధంగా అనిపించే ఈ నిబంధనలు లోపభూయిష్టంగా, అవాస్తవికంగా ఉన్నాయి. 50 శాతం పైన స్థానాలు అంటే మెజారిటీ కలిగిన పాలకపార్టీకే అత్యధిక ప్రయోజనం కలుగుతుంది. 25 నుంచి 49.9 శాతం వరకు స్థానాలున్నా ఇచ్చే భూమి మాత్రం ఎనిమిదవ వంతుకు తగ్గిపోతుంది. అంటే తెలుగుదేశం నాలుగు ఎకరాలు, వైఎస్ఆర్ పార్టీకి అర ఎకరా మాత్రమే దక్కుతుంది. ఇక సభలో ప్రస్తుతం సభ్యత్వం లేని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు అంగుళం కూడా రాదు. వివిధ పార్టీలు ఈ స్థలాలను తీసుకుంటాయా లేదా అన్నది వాటి నిర్ణయం.కానీ నిబంధనలు సమానంగా వాస్తవికంగా ఉండాలి కదా. ఎన్నికల్లో బలాబలాలు మారుతుంటాయి కానీ పార్టీలు శాశ్వతంగా ఉంటాయి. ప్రస్తుత సభలో పాలకపక్షం మరోసారి ప్రతిపక్షం కావచ్చు. రెండు సీట్ల బిజెపి దేశానికే పాలకపక్షం కావచ్చు. అలాంటప్పుడు ఒక సభలో సంఖ్యా బలాన్ని బట్టి ఇచ్చిన స్థలాలు తరువాత మార్పిడి చేస్తారా? ఇప్పుడు కేటాయింపుల తతంగం పూర్తయిపోతే మళ్లీ మార్చడానికి అవకాశం ఎలా వస్తుంది? జిల్లా కేంద్రాల్లో కూడా 2 ఎకరాల భూమి ఎందుకు అవసరమవుతుంది? ఇలాంటి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ పార్టీ లకు చట్టసభల్లో ఉన్న సీట్లను బట్టి గుర్తింపు వస్తుందనేది నిజమే. కానీ అదికూడ మార్పులకు అతీతం కాదు. అలాంటప్పుడు ప్రస్తుత సభలో ప్రాతినిథ్యం లేని పార్టీలను విస్మరించడం, నిర్లక్ష్యం చేయడం ఏ విధంగా న్యాయం?
