మరోసారి ప్రత్యేక ధోకా

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రయివేటు బిల్లు చర్చకు రాకుండా పోవడం ఆశ్చర్యం కాదు. ఇది ఇలాగే జరుగుతుందని మనం ముందుగానే చెప్పుకున్నాం. చర్చ జరిగి ఓటింగ్ దాకా రాకుండా ముజువాణితో సరిపెడతారా? లేక పూర్తిగా దాటవేస్తారా? అన్నదే సందేహంగా ఉండింది. ఆప్ ఎంపీ భగవత్‌మాన్ వివాదాన్ని సాకుగా చేసుకుని రభస సాగిస్తారని ఈ రోజు ఉదయం లోక్‌సభ తీరు చూశాక స్పష్టం అయ్యింది. మీడియా పరిశీలకులు ఆ మేరకు అభిప్రాయానికి కూడా వచ్చారు. అయితే వారు ఊహించినదానికన్నా విడ్డూరంగానే పాలకపక్ష బిజెపి వ్యవహరించింది. వివాదగ్రస్థ సభ్యుడు ఉన్న లోక్‌సభ స్పీకర్ ఆయనను విచారించారు. అన్ని పార్టీలు విమర్శించాయి. ఇంకా దీనిపై యాగి చేయవలిసిన అవసరమే లేదు. కేవలం కెవిపి బిల్లును వెనక్కు కొట్టడానికే కేంద్రం ఈ ఎత్తుగడను అనుసరించింది. బిల్లుకు మద్దతు అంటూనే పరిపరివిధాల మాట్లాడిన తెలుగుదేశం పార్టీకి కూడా దీనివల్ల ఉపశమనం లభించింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి పూర్తి అవకాశం అధికారం ఉండి కూడా కేంద్రం నిరాకరించింది. ఆ విషయం సూటిగా చెప్పడానికి బిజెపి గట్టిగా అడగడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. ఇప్పటికే కుప్పకూలిన కాంగ్రెస్ పై అదే పనిగా దాడికి కేంద్రీకరిస్తూ ఇరకాటం నుంచి బయటపడేందుకు ఈ వాయిదా పద్దతిని అనుసరించారు. అయితే ఈ మాత్రం అర్థం చేసుకోగల శక్తి ప్రజలకు ఉండదని అనుకోవడమే విచిత్రం. ఇలాంటి చవకబారు వ్యూహాలకు ఆయా పార్టీలు మూల్యం చెల్లించవలసే ఉంటుంది.