ప్రత్యేక ఓటింగ్‌కు రానివ్వరు

కాంగ్రెస్ ఎంపికు కెవిపి రామచంద్రరావు ఆంధ్ర ప్రదేశ్ ప్ర త్యేక హౌదాపై రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లు రేపు చర్చకు రావలసి వుంది. మామూలుగా మంత్రులు మినహా మరెవరు ప్రవేశపెట్టిన బిల్లులైనా ప్రైవేటు కిందనే లెక్క. ప్రత్యేక హౌదా సాధించింది తామేనని ప్రచారం చేసుకుని ప్రభుత్వంలోకి వచ్చిన బిజెపి-టిడిపి ద్వయం దాన్ని అమలులోకి తేకపోగా నెమ్మదిగా అటకెక్కించారు. ప్రదాన బాధ్యత బిజెపిది( అందులోనూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుది) కాగా నీరుగార్చడంలో తెలుగుదేశం(అందులోనూ ముక్యమంత్రి చంద్రబాబు నాయుడు) పాత్ర తక్కువేమీ కాదు. విభజన జరిగింది కాంగ్రెస్ హయాంలోనైనా బిజెపిది సగభాగం కాగా లేఖఇచ్చామని చెప్పుకునేది(తెలంగాణలో మాత్రమే) తెలుగుదేశం. కనుక ఎవరూ తక్కువ తినలేదు. విభజన బిల్లులో లేదు గనక ప్రత్యేక హౌదా ఇవ్వలేకపోతున్నామనే కేంద్రం రాజ్యసభలో ప్రధాని హామీ ఇచ్చారని తర్వాత యుపిఎ క్యాబినెట్ దానిపై తీర్మానం చేసిందని మర్చిపోతుంటారు. నీటి ఆయోగ్ వచ్చిందంటారు గాని వాస్తవానికి దాన్ని తెచ్చిందీ వారే. హౌదాను మించిన ప్యాకేజీ అన్నవారు ఆచరణలో హళ్లికి హళ్లి సున్నకు సున్న చేశారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే చెబుతారు. కేంద్ర రాష్ట్రాల్లో రెండు పార్టీలూ వున్నాయిగనక ఏం జరిగినా జరక్కపోయినా ఉభయులదీ బాధ్యత అవుతుంది. ఇద్దరి మధ్య ప్రశంసలు విమర్శల ప్రహసనాలు చాలా చూశాం.కనుక ఏ రాజ్యసభ సాక్షిగా హామీనిచ్చారో అక్కడే తేల్చుకోవదం ఉత్తమం. ఆ రీత్యా కెవిపి బిల్లు ఆహ్వానించదగింది. దీన్ని టిడిపి తీసుకువచ్చి వుండాలి. గత్యంతరం లేని స్థితిలో ఇప్పుడు దానికి మద్దతు నిస్తామని చెబుతున్నా విమర్శ ప్రస్తుత బిజెపిపై గాక కూలబడిన గుర్రం లాటి కాంగ్రెస్‌పైనే కేంద్రీకరిస్తుంటారు. ప్రైవేటు బిల్లు ఆమోదం పొందినా అమలులోకి రాదని వెంకయ్య నాయుడే ప్రకటించారు కూడా. ఇప్పటి వరకూ 14 ప్రైవేటు బిల్లులు మాత్రమే తుదిరూపం తీసుకోగా ఒక్క ట్రాన్స్జెండర్ల బిల్లు చట్టరూపం తీసుకుంది. అయితే ఇక్కడ ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రత్యేక హౌదా ఇచ్చే ఉద్దేశం బిజెపికి లేదు గనక ఈ చర్చను ఓటింగు దాకా తీసుకెళ్లడమే జరగదు. దానివల్ల టిడిపి బిజెపి రెండూ ఇరకాటంలో పడతాయి.లేదు మరీ బరితెగిస్తేబిల్లును ఓడించి గత హామీకి విలువ లేదని చెప్పొచ్చు. అయితే రాజ్యసభలో ఇప్పటికీ బిజెపికి అంత బలం లేదు గనక అది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో మూజువాణితో తోసిపుచ్చడం లేదంటే అసలు చర్చ కొద్దిసేపు నడిపించి వాయిదా వేయించడం జరగొచ్చు. కాబట్టి ఏ విధంగా చూసినా ప్రత్యేక ఓటింగుపై పెద్దగా తలపగల గొట్టుకోవడం అవసరం లేదనిపిస్తుంది. కాకపోతే బిజెపిని ఇరకాటంలో పడేయడం అనివార్యం.