మీకో మొక్కుంది.. దానికో తిక్కుంది!
దేశంలోనూ ప్రపంచంలోనూ పర్యావరణం దెబ్బతిని ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కనుక మొక్కల పెంపకం ఆహ్వానించదగింది. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం రెండవ విడత హరితహారం పేరిట కోట్ల మొక్కలు నాటడం ప్రతిష్టాత్మకంగా చెబుతున్నారు. ప్రచారాత్మకం అయినా సరే దాన్ని స్వాగతించవచ్చు. అయితే మొక్కల పెంపకాన్ని మించి తిక్కలు( బాధపడేవారు క్షమించాలి ఈ పదానికి) పెంచడానికి ప్రభుత్వమే సంధానకర్త కావడం అర్థరఠహితం. రాశి జన్మనక్షత్రాలను బట్టి మొక్కల పంపంకం చేస్తామని చెప్పడం అక్షరాలా శాస్త్రీయ స్పూర్తికి అంటే రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమైన విషయం. ఈ విషయమై అధికారిక జాబితాలే ప్రచురించడం చాదస్తానికి పరాకాష్ట. వ్యక్తులకు ఏమైనా విశ్వాసాలు వుండొచ్చు. కాని వాటిని ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు నెత్తినెత్తుకోవడం పొరబాటు. ఇప్పుడు హైదరాబాదులోనే ఒక సంప్రదాయ కుటంబీకుడు తన ఇంటిముందున్న వేపచెట్టును కొట్టివేయించారట. ఏమంటే ప్రభుత్వం ప్రకటించిన జాబితాకు అది భిన్నంగా వుంది. అంటే ఇక్కడ హరితహారం రివర్స్ అవుతుందన్న మాట. ఎప్పుడో కందుకూరి వీరేశలింగం వంటివారే మొక్కలకు సంబంధించిన మూఢనమ్మకాలపై పోరాటం చేశారు. 21 వ శతాబ్దంలో అధికారికంగా వాటిని ప్రచారం చేయడం నిజంగా హాస్యాస్పదం. వ్యక్తిగతంగా పూజలు పురస్కారాలు యజ్ఞయాగాలు వాస్తు విన్యాసాలు ఏవైనా చేయొచ్చు కాని వాటిపై అధికార ముద్ర వేయడమే అశాస్త్రీయం.
మరో వైపున అడవుల నరికివేతకూ దోపిడీకి కారకులైన వారిని వదలిపెట్టి దాన్ని నమ్ముకుని బతికే గిరిజనులపై పడటం మరో దారుణం. గిరిజనులు ఆదివాసులు ఈ హరితహారం దెబ్బకు హతాశులై పోతున్నారు. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారిని వెళ్లగొడుతున్నారు, ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా గాంధారి నేరల్తాండాల మధ్యన గల 787 నెంబర్ లోని అరవైఎకరాల పై బడిన భూమిలో అధికారులు మొక్కలు నాటడం రైతుల నిరసనకు దారితీసింది. అయినా సరే వారు వినలేదు.స్థానిక ఎమ్మెల్యే యాభై ఎకరాల అటవీ భూమిని కబ్జాచేసినా పట్టించుకోకుండా తమ భూమిని లాక్కుంటున్నారని రైతులు విమర్శించారు. ఇలాటి ఘటనలు చాలా వున్నాయి.
మూడవది మొన్న హైదరాబాదులో కొన్ని గంటల వర్షానికే భారీ వృక్షాలు కూడా నేలకూలడం చాలా పాఠాలు నేర్పించింది.వాటిని శాస్త్రీయంగా నాటడం పెంచడం జరగలేదని తేలింది. అసలు మొక్కలు నాటడం ప్రచారంతో ముగిసిపోతే ప్రయోజనం లేదు. వాటిని పెంచి పెద్దవి చేసేవరకూ బాధ్యత వహించాలి. శాఖల మధ్య సమన్వయం వుండాలి.మొదటి దశ హారం ఫలితాలను సమీక్షించి దిద్దుబాట్లు చేయాలి. లేకపోతే ప్రతిష్టాత్మకం కాస్తా ప్రచారాత్మకమే అవుతుంది.