హిందూత్వ వీర శైవులకే స్థాన భ్రంశం!

ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గంలో చేసిన మార్పులు ప్రమోషన్లా డిమోషన్లా తెలియని విధంగా కొందరు మాట్లాడుతున్నారు. . తనకు గతంలో సమవుజ్జీలుగా లేక పోటీ అభ్యర్థులుగా భావించబడిన సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలకు మోడీ కొంత తడాఖా చూపించారు. ఎంజెఅక్బర్‌ను విదేశాంగ శాఖ సహాయమంత్రిగా తీసుకోవడం సుష్మకు రుచించని విషయం. అరుణ్‌జైట్లీనుంచి ఆకర్షణీయమైన సమాచార శాఖను తీసుకోవడం కూడా ఓ విధమైన కోతలాటిదే. అయితే వెంకయ్యనా యుడు నుంచి పార్లమెంటరీ వ్యవహారాలుతీసుకుని ఈ ఆ శాఖను ఇవ్వడం కూడా పెద్ద ప్రమోషనేమీ కాదు. అలా ప్రచారం చేస్తున్నారు గాని పార్లమెంటరీ వ్యవహారాలతో పోలిస్తే అది ప్రచార ప్రధానమైంది మాత్రమే. బిజెపి ఆరెస్సెస్ భావజాలాన్ని అదేపనిగా చెప్పడంలో వెంకయ్య నాయుడు అందెవేసినచేయి. అయితే సరిగ్గా అలాగే రెచ్చిపోయిన సృతి ఇరానీని మానవ వనరుల శాఖ నుంచి తప్పించడం ఆమెకే గాక అలాటివారందరికీ పెద్ద హెచ్చరికే. గతంలో ఆమె పార్లమెంటు ప్రసంగం గానీ,ఇతర వివాదాలు గాని దారితప్పుతున్నాయని నేను రాసినందుకు చాలామంది తిట్టిపోశారు. మోడీ కూడా ఆమెను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. మరి ఇప్పుడెందుకు తప్పించారు? అంటే అవసరమైనప్పుడు ఉసిగొల్పి ఉపయోగించుకోవడం తర్వాత ఉద్వాసన పలకడం ఆయన నైజం అని తేలిపోయింది. అయితే అంతమాత్రాన సృతి ఇరానీ బాధ్యత తక్కువేమీ కాదు. దేశ చరిత్రలోనే ఒక కేంద్ర మంత్రి అంత దారుణంగా మాట్లాడిన సందర్భం లేదు. ఇక కన్నయ్య కుమార్‌పై దాడిలో గాని హెచ్‌సియు విషయంలో గాని సృతితో సమానంగా నోరుపారేసుకున్న వ్యక్తి వెంకయ్య నాయుడే గనక ఆయనకు కూడా కొంత ప్రభావం తప్పలేదు. పైగా పార్లమెంటులో పదే పదే మోడీని ఆదుకున్న వ్యక్తిగా వెంకయ్య పేరు రావడం కూడా మోడీ భరించలేని విషయం. పైగా ఈ మార్పుల సమయంలో టాప్ నాలుగు శాఖలు అంటుకోలేదని ఒకటికి రెండు సార్లు వచ్చిన పేర్లలో వెంకయ్య పేరు లేకపోవడం ఆయన టాప్‌లో లేరని సంకేతం ఇవ్వడం లాటిదే. మాజీ సైనాధిపతిగా వుండి మంత్రి పదవి పొందిన వికెసింగ్‌ను స్వతంత్ర బాధ్యతల నుంచి తప్పించి సహాయ హౌదాకు పరిమితం చేయడం మరీ పెద్ద డిమోషన్.హర్యానాలో దళితులను చంపినప్పుడు కుక్కలతో పోలుస్తూ మాట్లాడిన వికెసింగ్ వంటివారిని కావాలనే తగ్గించారు. మీడియాపై ఆయన దుర్భాషలకు కూడా ఇది గుణపాఠమే. మరో మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఏడు పర్యాయాలు గెలిచిన ఎంపి.వాజ్‌పేయి హయాంలోనే స్వతంత్ర హౌదాలో పనిచేశారు. కాని ఇప్పుడు ఆయనను తగ్గించి సహాయమంత్రిని చేశారు. అంతే స్వతంత్ర మంత్రికింద పనిచేయాలన్న మాట. ఈ దఫా మార్పులలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలతో పాటు వివాదాలకు కారణమైన వారిని తగ్గించాలని మోడీ భావించినట్టు కనిపిస్తుంది. . అయితే ఇంకా వివాదాస్పదమైన మతతత్వ వ్యాఖ్యలు చేసిన కొందరిని వదిలేశారంటే ఇదంతా ఎన్నికల ఎత్తుగడేనని అర్థమవుతుంది. అంతేగాని నిజంగా బిజెపి ప్రభుత్వ ఆలోచనా ధోరణి మారిందని భావిస్తే పప్పులో కాలేసినట్టే. అవసరమైనప్పుడు ఇమేజి కల్పిస్తాం, తర్వాత డామేజి తగ్గించే చర్యలు తీసుకుంటాం అని బిజెపి నాయకులొకరు అన్నారు. ఈ పాత్రధారులు మారుతుంటారు గాని పాత్రలు కొనసాగుతుంటాయన్నమాట.