హైకోర్టు హైవోల్లేజి తగ్టినట్టేనా?

high-court-of-telangana
ఎపి తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విషయంలో ఉధృత స్తాయికి చేరిన వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నాయి. దేశ ప్రధాన న్యాయమూర్తి సిజెఠాగూర్‌ చొరవ ఇందుకు దోహదం చేస్తున్నది. అసలు వివాదాన్ని ఇంతవరకూ తీసుకురాకుండా వుంటే బావుండేది. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ ఆలస్యం, తెలంగాణ న్యాయసమాజం ఆవేశం కలిసి మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి.వృత్తిపరంగానో వ్యక్తిగతంగానో ఆవేశాలు ఆవేదనలు వుండొచ్చు గాని హైకోర్టు తరలింపు విషయం తక్షణం పరిష్కరించే అవకాశమేమీ లేదు. మాకు శక్తి లేదు సమయం కావాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నప్పుడు విమర్శకులు ఉద్దేశాలు ఆపాదించవచ్చు గాని విశ్లేషణగా రాజ్యాంగ హక్కును కాదనడానికి లేదు. కేంద్రం నిధులు ఇవ్వడంలోనూ నిర్ణయాన్ని వేగవంతంచేయడంలోనూ తన పాత్ర నిర్వహించలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇతర ఉద్యమాల నుంచి దృష్టిమరల్చేందుకు దీన్ని పెంచే ప్రయత్నం చేసింది. ఎపి వైపు నుంచి క్రియాత్మక స్పందన కరువైంది.ఇక తెలంగాణ ఆంధ్ర న్యాయవాదుల మధ్య న్యాయ మూర్తుల మధ్య కూడా దశాబ్దాలుగా పేరుకుపోయిన స్పర్థలు, అపనమ్మకాలు ఈ సమయంలో మరోసారి ప్రకోపించాయి. డాక్టర్లు ఉద్యోగులు కూడా ఇలాటి సమస్యలు ఎదుర్కొన్నా తమ వరకే పోరాడి పరిష్కరించుకున్నారు గాని విభజన పూర్వ పరిస్థితిని తీసుకురావడానికి ప్రయత్నించలేదు.హైకోర్టు ఉమ్మడిగా వున్నప్పుడే దిగువ స్థాయి విభజన జరగాలనే వాదన ఒకటి చెబుతున్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు వాస్తవికంగా వ్యవహరించాల్సింది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఈ జాబితా వచ్చినప్పుడే చర్చలకు చొరవ తీసుకోవలసింది. అవేవీ జరగలేదు గనకే ఆవేశాలు శ్రుతి మించాయి. సస్పెన్షన్లు మరింత వేడిపెంచాయి. అపనమ్మకాలు ఎన్నివున్నా రాజ్యాంగాన్ని న్యాయవ్యవస్థ సమర్థతను కూడా నమ్మాలి. రేపైనా సరే ఉన్నత ా్యయమూర్తులు అటూ ఇటూ రాకుండా వుండరు. స్థానికత నియమం వుండకుండా పోదు. అన్నదమ్ముల్లా విడిపోదామన్న సూత్రానికి న్యాయమూర్తులే అన్నాయం చేయడం అవాంఛనీయం. సుప్రీం కోర్టు చొరవ గవర్నర్‌ ముఖ్యమంత్రుల చర్చలతో సమస్యకు ఒక రోడ్‌మ్యాప్‌ రూపొందించాలి. తక్షణ ఉద్రిక్తతలు పరిష్కరించాలి. సమ్మె విరమణపై తెలంగాణ న్యాయసమాజం చర్చకు సిద్ధమవడం ఆ దిశలో సానుకూల పరిణామం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *