ప్ప్రైవేటు కంపెనీల వలయంలో అమరావతి..

cap1

అమరావతి.. ఆంధ్ర ప్రదేశ్‌ నూతన రాజధాని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజూ పున:పున:పునురుద్ఘాటిస్తుంటారు. ఆ సంగతి ఎలా వున్నా రాజధాని కోసం ఏర్పాటు చేస్తున్న ప్రైవేటు కంపెనీల సంఖ్య మాత్రం ప్రపంచంలోకెల్లా ఎక్కువగా వుండొచ్చు. క్రిడాతో పాటు ఇప్పటికే అమరావతి బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ మెయింటెనెన్సు కంపెనీ(ఎబిసిసి) ఏర్పాటు చేశారు. అది చాలనట్టు ఇంకా కింది కంపెనీలన్నీ వచ్చేశాయి.
.అమరావతి డెవలప్‌మెంట్‌ కంపెనీ
అమరావతి ఇండిస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ
అమరావతి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కంపెనీ
అమరావతి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ
అమరావతి గ్రోత్‌ కారిడర్‌ కంపెనీ
అమరావతి యుటిలిటీస్‌ కంపెనీ
అమరావతి పవర్‌ కంపెనీ
అసెండాస్‌ సింగ్‌ బ్రిడ్జి సెంబ్‌కార్ప్‌తో రాజధాని అభివృద్ది సంస్థ ఒప్పందం చేసుకున్నాక ఇన్ని కంపెనీలు ఏం చేస్తాయి? నిజానికి ఈ ఒప్పందం 2014 ఆగష్టు 8నే కుదిరింది. అప్పట్లో ప్రభుత్వం తరపున డి.సాంబశివరావు, ఇంటర్నేషన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ తరపున సిఈవో తొఎంగ్‌ చియాంగ్‌ సంతకాలు చేసిన ఒప్పందంలోనే నిర్మాణం సింగపూర్‌కు అప్పగించాలని వుంది.పైగా వారు ఏ భాగస్వాములను తీసుకొచ్చినా ఎపి ప్రభుత్వం ఆమోదించాలని కూడా వుంది. కనుక ఇప్పుడేదో స్విస్‌ చాలెంజి పద్దతి వగైరా ప్రహసనం వుత్తుత్తి వ్యవహారమే.
ఇక పోతే కంపెనీలు ఏర్పాటు చేయడం తప్ప కాసులకు సంబంధించి ఇప్పటికీ స్పష్టత లేదు.రాజధాని నిర్మాణానికి కనీసం రు.43,772వేల కోట్లు అవసరమని అంచనా వేశారు.కేంద్రం చూస్తే గింజుకున్నాసరే 2500 కోట్లకు మించి ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. విదేశీ కంపెనీలు మన భూమి తీసుకుని వాణిజ్య విలువ పెంచేలా భవనాలు నిర్మించి తర్వాత తమ ఖర్చు లాభం కలిపి రాబట్టుకుంటాయన్నది ప్రాథమిక అవగాహన. అలాటప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి? మౌలిక సదుపాయాలు మనం కల్పిస్తే వారు వాటిని ఉపయోగించుకుని హాయిగా లాభాలు పోగుపోసుకుంటారా? తమ ఖర్చులను ఎక్కువగా చూపించి ప్రజలపై రకరకాల భారాలు మోపకుండా వుంటారా? భద్రతకు పెద్దపీట వేయాల్సినరాజధానిలో విదేశీ శక్తులు ఇంతగా పట్టుపెంచుకోవడం మంచిదేనా? ఇన్నివేటు కంపెనీలు వచ్చాక దేనికది విడివిడిగా కొన్ని సార్లు ఒకరితో సంబంధం లేకుండా మరొకటి ప్రజలపై భారాలు రుద్దితే ఏంచేయాలి? నేరుగా ప్రభుత్వం వుండకుండా కంపెనీల పేరిట గుంజడానికే ఈ ఉపాయమా? అసలు ప్రజారాజధాని అంటూ ప్రైవేటు వారికి అన్నీ కట్టబెట్టాక ప్రభుత్వ పాత్రే మృగ్యమై పోతుంటే ప్రజలకు చోటెక్కడీ ఇది చాలదన్నట్టు పులిమీద పుట్రలా ప్రపంచ బ్యాంకు రుణం కూడా తీసుకుంటే వారి షరతులు కూడా భరించాల్సిందే కదా..ఇన్ని కంపెనీలు ఇంత హంగామా పెట్టుకుని తాత్కాలిక సచివాలయం కోసం ఇన్ని గుంజీళ్లు ఇన్నివాయిదాలు ఎందుకు అవసరమైనాయి? ఆదాయం రాదు గనక వారు కట్టరా? పైగా ఏ కంపెనీ ఎవరిని బినామీగా పెట్టుకుంటుందో భాగం కల్పిస్తుందో తె లుసుకోవడం ఎలా? ఈ మధ్య ఒక ఛానెల్‌ రాజధానిపై చర్చకు రమ్మంటే అమరావతి ప్రాంత టిడిపి ఎంఎల్‌ఎనే రాజకీయాలు మాట్లాడతాగాని రాజధాని సంగతి నాకేం తెలియదు అన్నారట.. అమర లింగేశ్వరా! అక్కడేం జరుగుతుందో మీకైనా తెలుస్తున్నదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *