అటకెక్కిన ఓటుకు నోటు?

revant11
ఏడాది దాటిపోయింది తెలంగాణను అట్టుడికించిన ఓటుకు నోటు కేసు బయిటకు వచ్చి.. తెలుగుదేశం నాయకుడు రేవంత్‌ రెడ్డి అరెస్టు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడియో విడుదల, సండ్రవెంకట వీరయ్య అరెస్టు, జెరూసలెం మత్తయ్య కోసం వేట వంటివన్నీ నాటకీయంగా సాగాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల స్థాయిలో మాటల యుద్ధమే నడిచింది. ట్యాపింగ్‌ ఆరోపణలు టాప్‌ గేర్‌లో మార్మోగాయి. ఈ నేపథ్యంలో పదేళ్ల ఉమ్మడి రాజధాని పదినెలలకు కుదించుకుపోయింది. చంద్రబాబు దాదాపు విజయవాడకే మకాం మార్చేశారు.రాజధాని తరలింపు వేగవంతం చేశారు. ఇదంతా తెలిసిందే. ఇప్పుడు ఓటుకు నోటు కేసు పూర్తిగా అటకెక్కేసింది. సాక్షి తప్ప మరెవరూ దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆ కేసు ముగిసిన అధ్యాయమేనన్నట్టు టిఆర్‌ఎస్‌ నేతలే మాట్లాడుతున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా అంతేనని తేల్చిపారేస్తున్నారు. ఈ కేసులో చిక్కుకున్న నేతలు కూడా అలాటి భావనలోనే వున్నారు. కెసిఆర్‌ ప్రభుత్వం కోరుకున్నా కూడా ఈ కేసులో చేయగలిగింది లేదని తెలుగుదేశం ప్రముఖులు కొందరు వ్యాఖ్యానించారు. జెరూసలెం మత్తయ్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే చాలా కీలకమైందని వారంటున్నారు. కేవలం రాజకీయ కక్షతో ఆఘమేఘాల మీద అరెస్టులు ఇంటరాగేషన్లు జరిపినంత మాత్రాన కుదరని కోర్టు అక్షింతలు వేసింది. ఎఫ్‌ఐఆర్‌ కూడా లేకుండానే ఎలా రంగంలోకి వస్తారని ప్రశ్నించింది. మత్తయ్యకు స్వేచ్చనిచ్చింది. కేసులో కీలకపాత్రధారినే వదలిపెట్టిన తర్వాత ఇతరులకు ఇబ్బందేముంటుందని కొందరు నిపుణులు ప్రశ్నించారు. నిజానికి కేసును ముందుకు తేవడంలో ముఖ్యపాత్ర వహించిన ఐపిఎస్‌ ఎకెఖాన్‌కు ఈ మధ్యన ఇతర బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు. పైగా ఈ కేసులో రెండవ సూత్రధారి అంటున్న సండ్ర వెంకట వీరయ్యను చేర్చుకోవడానికి సిద్ధమయ్యామంటేనే కథ అయిపోయిందని అర్థమవుతుంది.సండ్ర రావడం ఖాయమైనా ఎప్పుడు ఎలా అన్నది జిల్లా టిఆర్‌ఎస్‌ బాస్‌ మంత్రి తుమ్మల నిర్ణయం మేరకు జరుగుతుందని సీనియర్‌ నాయకుల సమాచారం. ఓటుకు నోటు కారణంగానే చంద్రబాబు కేంద్రంతో మెతగ్గా వుంటున్నారని, లేదా హైదరాబాదు నుంచి వెళ్లిపోయారని చెప్పే మాటలు నిజంకాదంటున్నారు తెలుగుదేశంనేతలు. మరో ప్రభుత్వ భూభాగంలో వుండటం రాజకీయంగా హానికరమని గుర్తించడం వల్లనే చంద్రబాబు వెళ్లిపోయారు. మాకు సమయం ఇచ్చి మాట్లాడుతున్నారు. ఇబ్బందేముంది? అని టిటిడిపి నాయకులొకరు వ్యాఖ్యానించారు. జాతీయపార్టీల తరహాలోనే రెండు చోట్ల విభాగాలను ఎలా నడపాలన్నదానిపై తమకు స్పష్టత వుందని వారంటున్నారు. వచ్చేసారికి ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదుగనక మాకు హడావుడి కూడా లేదని తేల్చిచెబుతున్నారు.ఇప్పుడు రేవంత్‌ నిరాహారదీక్షకు సమాధానంగానే కెసిఆర్‌ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారంటే తనకు ప్రాధాన్యతనిచ్చినట్టేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *