నరసింహుడా? అరసింహుడా?..

manmohan-singh-narasimha-rao_79d33b4a-3c9f-11e6-86cd-639e2418d1d4
మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు పాలనపైన వ్యక్తిత్వంపైన కొంతమంది అదేపనిగా అతిశయోక్తులు ప్రచారంలోకి తెస్తున్న సమయంలో ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ వాస్తవాలు నిర్మోహమాటంగా చెప్పేశారు. ఆయనపై జర్నలిస్టు వినరు సీతాపతి రాసిన హాప్‌లయన్‌(అరసింహుడు లేదా సగం సింహం) పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఆయన మాజీ ప్రధాని చేసిన మంచిపనులు ఆయన తర్వాత కూడా ప్రభావం చూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఆ హయాంలో జరిగిన ప్రతికూల పరిణామాలు ఇప్పటికీ తీవ్రమైన సష్టం కలిగిస్తూనే వున్నాయని స్పష్టం చేశారు. పివి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను సానుకూల పరిణామాలుగా ఆయన అభివర్ణించారు.సభలో ఆదిక్యత లేని ప్రధాని మతవాద అనుకూల బిజెపికి వామపక్ష అనుకూల నేషనల్‌ ఫ్రంట్‌కూ మధ్యన బలహీనుడిగా భావించుకున్నారు. పార్లమెంటు నిర్వహణలో అనైతిక పద్దతులు, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఫిరాయింపులను ప్రోత్సహించడం పెద్ద పొరబాట్లన్నారు. ఏ విధంగా చూసినా అది వెంటాడే పీడకల అని అభివర్ణించారు. బాబరీ మసీదు విధ్వంసానికి అవకాశమివ్వడం కేవలం రాజకీయ కారణాల వల్ల జరిగిందే తప్ప రాజ్యాంగ కొలబద్దలతో సరిపోదన్నారు. తన హిందూ విశ్వాసాలను నిలబెట్టుకోవడం, హిందువుల కాంగ్రెస్‌కు దూరం కాకుండా కాపాడుకోవడం, మసీదును కాపాడ్డం అనేవి లక్ష్యాలుగా పెట్టుకున్నారు. చివరకు మసీదు ధ్వంసమైంది, హిందువులు దూరమైనారు. కాంగ్రెస్‌ ప్రతిష్ట మంటగలసింది అని సీతాపతి ఇచ్చిన తీర్పుతో అన్సారీ ఏకీభవించారు. అయితే ఈ కూల్చివేత దానికి దారి తీసిన పరిస్తితులు ఆయనను దెబ్బతీయడానికి జరిగిన పెద్ద కుట్ర అని సీతాపతి చేసిన విశ్లేషణతో ఈ కార్యక్రమానికి అద్యక్షత వహించిన మణిశంకర్‌ అయ్యర్‌ ఏకీభవించలేదు. విధ్వంసాని నివారించడానికి తామంతా ఎన్నో సూచనలు చేసినా పివి వినిపించుకోలేదని ఆయన చెప్పారు. తెలుగు పత్రికలలో పివి పుస్తకంపై వరుసగా వస్తున్న భాగాలు గమనిస్తే తెలంగాణ బిడ్డ కనుక, నెహ్రూ కుటుంబేతరుడు గనక కావాలనే ఆయన స్థానాన్ని తగ్గించి చూపుతున్నారనే వాదనకు పెద్ద పీట వేస్తున్నారు.దీనికి బోలెడు సెంటిమెంటు కూడా జోడిస్తున్నారు. సోనియా గాందీకి ఆయనకూ మధ్యన వైరుధ్యాలు వ్యక్తిగత అన్నాయాలు వేరే సంగతి.అవన్నీ నిజమే కావచ్చు. ఆ మాటకొస్తే ఆయన ప్రధాని కావడం వెనక కూడా ఆ కుటుంబం పట్ల విధేయత ఉపయోగపడిందని కూడా ఒప్పుకోవలసిందే. మరణించిన తర్వాత భౌతిక కాయాన్ని ఎఐసిసి ఆఫీసులోకి రానివ్వకపోవడం, హైదరాబాదులో అంత్యక్రియలు జరిపించడం ఇవన్నీ దారుణమే గాక నాటకీయ పరిణామాలుగానూ కనిపిస్తాయి. సోనియాపై విమర్శ గనక బిజెపికి, తెలంగాణ కోణం టిఆర్‌ఎస్‌ తదితర శక్తులకు ఉపయోగపడతాయి. కొంతమంది జర్నలిస్టులదీ అదే కోవ. పివి పాండిత్యం, అనుభవం వంటివాటిని గౌరవిస్తూనే ఆయన పాలనలో అన్ని పార్శ్యాలనూ చూస్తేనే తప్ప సరైన అంచనాకు రాలేము. తెలుగు మీడియాలో కొన్ని పత్రికలు అందుకు భిన్నంగా ఏకపక్ష వాదనలే చేస్తున్నాయి.
ఆర్థిక సంస్కరణల విషయంలోనూ రెండు అభిప్రాయాలున్నాయి.వామపక్షాల విమర్శలు లెక్కచేయనవసరం లేదనుకునేవారు వాటిని పూర్తిగా పొగిడేస్తుంటారు. కాని భిన్న మతాలున్న ఈ దేశంలో బాబరీ విధ్వంసానికి అవకాశమిచ్చిన ఆయన చర్యను కూడా మరెరవో చేసిన కుట్రగా లేక అద్వానీ మోసంగా తీసి పారేస్తే అంత గొప్ప ప్రధానికి బాధ్యత లేకుండా పోతుందా? ఈ పుస్తకం కూడా పివి ద్వంద్వత్వాన్ని కళ్లకు కట్టినట్టు చెబుతుంటే దాన్ని దాటేసి మరేదో చెప్పడమెందుకు? ఎన్‌ఐసి సమావేశమే ఆయనకు సర్వాధికారాలుఇచ్చిన తర్వాత కూడా అయోధ్యలో కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు? కళ్యాణ్‌సింగ్‌ ప్రభుత్వాన్ని కాదని పరిస్థితిని ఎందుకు తన చేతుల్లోకి తీసుకోలేదు? ఆ సమయంలో ఆయన నిద్ర పోయారనీ టివీ చూస్తున్నారని రకరకాల కథులంటే అవన్నీ నిజం కాదని ఈ పుస్తకం చెప్పడం వాస్తవాలతో పొసుగుతుందా? ఆయన వైద్యుడైన డా.శ్రీనాథరెడ్ది చెప్పింది నిజమే అనుకున్నా ఆ డాక్టర్‌ కూడా బిజెపి నేతలను నమ్మడం పొరబాటని భావిస్తున్నారే? హిందూత్వ నేతలను నమ్మడానికి తన హిందూత్వం కారణమైందా? మసీదు విద్వంసానికి రెండు మూడు రోజుల ముందు విజయవాడ ప్రెస్‌క్లబ్‌ అద్యక్షుడుగా విహెచ్‌పి అద్యక్షుడు అశోక్‌ సింఘాల్‌తో మీట్‌ ద ప్రెస్‌ నిర్వహించాము. అప్పుడు నేను మీరు తలపెట్టిన కరసేవ మరో మత ప్రళయానికి దారితీసే ప్రమాదముందని చాలా మంది ఆందోళన చెందుతున్నారని అన్నాను. దానికాయన ఏదో సమర్థనగా మాట్లాడారు. అప్పటికి పివి ఏవో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వున్నాయి. ఒక విలేకరి ప్రశ్నకు సమాధానంగా సింఘాల్‌ పివి మంచి హిందువు అని కితాబిచ్చారు. డా.శ్రీనాథరెడ్డి, సీతాపతి, మణిశంకర్‌ అయ్యర్‌ మాటలే గాక ఆ రోజున ఆయన వ్యవహరించిన తీరు గురించి హౌంమంత్రిగా వున్న ఎస్‌బిచవాన్‌ వంటివారు రాసింది చూసినా పివి ఉపేక్ష స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కూల్చివేత కుట్రకు సహకరించలేదని ఆ రోజున పరీక్షలు చేసిన వైద్యుడిగా తాను చెప్పగలనని శ్రీనాథరెడ్డి అంటున్నారు. కాని మరోవైపున పివిని అప్రతిష్ట పాలు చేసేందుకే ఈ కుట్ర జరిగిందని ఆయన వీరాభిమానులు వాదిస్తున్నారు. ఇవన్నీ ఏదో విధంగా ఆయనను వెనకేసుకువచ్చే ప్రయత్నాలు ప్రయాసలు తప్ప చరిత్ర వాస్తవాలు కాదు. అప్పట్లో సిబిఐ డైరెక్టర్‌గా వున్న విజయరామారావు కూడా తరచూ బాబరీ కూల్చివేతకు శిక్షణ పొందారన్న సమాచారం తమకు ఆలస్యంగా తెలిసిందని అంటుంటారు గాని అది హాస్యాస్పదమే. చివరగా చెప్పేదేమంటే పివి కాంగ్రెస్‌ అద్యక్షుడు, ప్రధాని. కాంగ్రెస్‌ను అందులోనూ సోనియాగాంధీని మాత్రమే విమర్శించి ఆయనను సమర్థించాలనుకోవడం కుదిరేపని కాదు. అదంతా ఒకే వ్యవస్థ. ఒక క్రమం.బిజెపి టిఆర్‌ఎస్‌ టిడిపి లేదా సామాజిక కోణంలో ఆ పనిచేయాలనుకునే వారు అనేక సమాధానాలు చెప్పాల్సి వుంటుంది. అరసింహుడు అని ఇంగ్లీషు టైటిల్‌ అయితే నరసింహుడు అనితెలుగులో ఇవ్వడంలోనే ఈ సమర్థనాపేక్ష తెలిసిపోతుంది. ఏదిఏమైనా ఆయన ఆరసింహుడేనన్నది ఉపరాష్ట్రపతి వ్యాఖ్యల్లోనూ అర్థమయ్యే విషయం. పాండిత్యాన్ని పొగడొచ్చు గాని పాలనలో దారుణాలను కూడా కీర్తించాలనుకోవడం విజ్ఞత అనిపించుకోదు. అన్సారీ అన్నట్టు ఆ కాలంలోజరిగిన పీడకలల వంటి తప్పిదాలకు జాతి ఇంకా మూల్యం చెల్లిస్తూనే వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *