ఏడుకొండలకు ఎసరు పెట్టిన బిజెపి స్వామి

.రక్తపాతం వచ్చేంత విషయాలు ఆయన దగ్గర ఏమున్నాయి? ఉంటే ఎందుకు దాస్తున్నారు? అని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలపై నిన్న వేసిన ప్రశ్నలకు వీక్షకులు బాగానే స్పందించారు. ఇలాగే అన్నిచోట్ల దీనిపై ౖ దుమారం రేగిన తర్వాత బ్లడ్‌బాత్ అన్న తన మాటలు అపార్థం చేసుకున్నారని తప్పించుకునే ప్రయత్నం చేశారు.. అయితే తన ధోరణి మార్చుకోకపోగా ఎగిరిఎగిరి ఇప్పుడు ఏడుకొండలపైన పడ్డారు. తిరుమల తిరుపతి దేవస్తానంకూడా వివాదాల్లోకి తీసుకొచ్చారు. దాన్ని ఎవరైనా స్వాములకు పీఠాదిపతులకు ఇవ్వాలి తప్ప ప్రభుత్వాలు నిర్వహించరాదన్నట్టు మాట్లాడారు. దేవాలయాల పాలనా నిర్వహణ పూర్తిగా ప్రభుత్వాల లేదా ప్రభుత్వ సంస్థల బాధ్యత కాకపోతే రక్షణ ఏముంటుంది?వీటిని స్వాములకు పీఠాధిపతులకు అప్పగించాలని స్వామి అంటున్నారు గాని ఏ పీఠం తీసుకోవాలి? వాటిపైన ఎన్ని ఆరోపణలున్నాయి?దేవాలయాల భూములు సంపదలు శాంతిభద్రతలు పారిశుధ్యం వంటి లౌకిక వ్యవహారాలు ప్రభుత్వం లేకుండా నడుస్తాయా? పైగా ఈ విమర్శలో రాజకీయాలు జోడించి తెలుగుదేశంపై విమర్శలు గుప్పించారు. ఏ పార్టీ అధికారంలో వుంటే వారే టిటిడిపైనా అధికారం చలాయిస్తుంటారు. ఇప్పటికే టిటిడి హిందూ ధర్మపరిరక్షణ పేరిట విశ్వహిందూపరిషత్ వంటి సంస్థల కార్యకలాపాలకు ఆరెస్సెస్ ప్రేరిత సాధుసమాగమాలకు సహాయం చేస్తుంటుంది.పూర్తిగా వారికే ధారాదత్తం చేయాలని స్వామి మనోగతమా? ఇంతటి బ్లాక్‌మెయిలింగ్ స్వామికి బ్యాకింగ్ ఇస్తున్న ప్రధాని కూడా ఈ వికృత వివాదాలకు కారకులు కాదా? ఇంత జరిగాక రఘురాం రాజన్ కూడా దేశభక్తిలో ఏ ఒక్కరి కన్నా తక్కువ కాదని ఆయన సన్నాయి నొక్కులు నొక్కారే గాని ఈ తరహా దుర్భాషలు మంచివి కాదని నిశితంగా ఖండించేందుకు మందలించేందుకు సిద్ధ: కావడం లేదు. అసలు టిటిడిపై స్వామి వ్యాఖ్యలను కూడా బిజెపి నేతలు సుతిమెత్తగా దాటేయడం పరోక్షంగా సమర్థించడం చూస్తుంటే అవి వారి రాజకీయ భావానికి సంకేతాలుగానే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు స్వామి మాటలు తీవ్రంగా తీసుకోనవసరం లేదని టిటిడి బోర్డు సభ్యుడైన బిజెపి నేత భాను ప్రకాశ్ మోడీ తరహాలో దాటేశారు. మరో ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి మాత్రం ఆయన మాటల్లో వివాదం వున్నా ఆలోచించాల్సిన అంశాలున్నాయంటూ వెనకేసుకొస్తున్నారు. టిటిడి నిధులను విద్యా వైద్య సంస్థలు పట్టణాభివృద్ధి వంటి వాటికి మళ్లించాలని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేయడం తప్పయినట్టు మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవ అన్న మాట నిజమైతే మాధవుడి నిధులు మానవ సంక్షేమానికి వెచ్చించడం ఎలా పొరబాటవుతుంది? పైగా టిటిడి నిబంధనలే అందుకు అవకాశం కల్పిస్తున్నాయని స్వతహాగా చిత్తూరు జిల్లా వారైన టిడిపి అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ సోదాహరణంగా వివరించారు. అయినా సరే తెలుగుదేశం స్వామికి సమాధానం ఇవ్వడం తప్ప ఈ మొత్తం వ్యవహారాన్ని సమగ్రంగా సక్రమంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి లేదు. ఏమంటే అధికారంలో వున్న పార్టీ గనక వారి రాజకీయ ప్రయోజనాలు వారికి వుంటాయి. ఎవరి రాజకీయాలు ఏమైనా సరే ప్రజలు భక్తితో ఇచ్చే కానుకలు విరాళాలు ప్రజా సౌకర్యాలకు సంక్షేమానికి వినియోగించడం సక్రమంగా నిర్వహించడం ప్రభుత్వాల బాధ్యత.వాటిని సాధుసంతులకు అప్పగించి ఏడుకొండలపై ఎవరికో ఆధిపత్యం అప్పగించాలని చెప్పడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే.ఇప్పటికే ప్రైవేటీకరణ పోకడలపై కార్మికులు ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యస్వామికి ఓపిక వుంటే వాటిని బలపర్చడం మంచిది తప్ప టిటిడిని కైవశం చేసుకోవాలనుకోవడం దుస్సాహసం. ఆయనను ముందుకు నెట్టడం రాజకీయ దుస్తంత్రం. అది దైవభక్తి కాదు, రాజకీయ కుయుక్తి.