అసెండాస్‌కు అమరావతి అప్పగింత

అమరావతి నిర్మాణం అనుకున్న ప్రకారమే సింగపూర్ కంపెనీలకు అప్పగించాలని ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం అధికారికంగా నిర్ణయించడంతో ఒక ఘట్టం ముగిసింది. స్విస్ చాలెంజి పద్ధతిని ఎంచుకోవడం వల్ల అనివార్యంగా ఇది మొదట అనుకున్న వారికే వెళుతుందని అందరికీ తెలుసు. అసెండాస్ సింగ్ బ్రిడ్జి, సెమ్కార్ట్లు రాజధాని అభివృద్ధి కంపెనీ కలసి నిర్మాణం చేబడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇందుకోసం కంపెనీకి 1691 ఎకరాల భూమి అప్పగిస్తారు.మొదటి విడతగా 200 ఎకరాలు స్వాధీనం చేస్తారు. అసెండాష్ సింగ్‌బ్రిడ్జి సింగపూర్ ప్రభుత్వ కంపెనీలని ముఖ్యమంత్రి చెప్పారు గాని నిజానికి అసెండాస్ సింగ్ బ్రిడ్జి ప్రైవేటు కంపెనీనే. కాకపోతే దాని యాజమాన్యంలో సింగపూర్ ప్రభుత్వ సంస్థ జెటిసి కార్పొరేషన్‌కు 49 శాతం వాటా వుంటుంది. జెటిసి తమ దేశ సంస్థల వ్యాపారాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కార్పొరేషన్ తప్ప ప్రత్యక్షంగా ప్రభుత్వ సంస్థ కాదు. అసెండాస్‌లో 51 శాతం టీమ్సెక్ హౌల్డింగ్స్ అనే ప్రైవేటు సంస్థకే వుంటుంది. అంటే ఆధిక్యత ప్రైవేటు కంపెనీది తప్ప ప్రభుత్వ కార్పొరేషన్‌ది కాదు. ఒక విధంగా ఇది మన ఎమ్మార్ ఎంజిఎఫ్ తరహాలో ఏపిఐఐసి సాగించిన తతంగాల తరహాలోనే వుంటుందన్నమాట. అయినా గొప్పగా పనిచేయిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు గనక చూడవలసిందే. అసెండాస్ ప్రపంచంలో కొన్ని పట్టణ ప్రాంత నిర్మాణాలు చేసిన మాట నిజమే గాని రాజధాని వంటి ప్రతిష్టాత్మక బృహత్తర వ్యవస్థలను నిర్మించినట్టు దాని బ్రోచర్లో లేదు. పైగా సమస్య సబ్ కాంట్రాక్టుల దగ్గర వస్తుందని పరిశీలకులు అంటున్నారు. అవన్నీ కూడా త్వరలోనే ప్రారంభం కావచ్చు . ఈలోగా ప్రపంచ రియల్ ఎస్టేట్ సంస్థల మాయాజాలం అమరావతిలో ప్రత్యక్షంగా చూడగలమన్నమాట.