సమీక్ష తప్ప సంక్షోభం లేని సిపిఎం

BL31YECHURY_2603289f
అనైక్యతకు అభిప్రాయ భేడాలకు తేడా తెలియని వ్యాఖ్యాతలు, రాజకీయ వ్యతిరేకులు శాసనసభ ఎన్నికల సమీక్ష సందర్భంలో సిపిఎం నిట్టనిలువునా చీలిపోతుందని వూహాగానాలు చేశారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, గతంలో బాధ్యతలు నిర్వహించిన ప్రకాశ్‌ కరత్‌లను రెండు శిబిరాలకు ప్రతినిధులుగా చేసి ఈ ఉభయులూ కేంద్ర కమిటీ సమావేశంలో కుమ్ములాడుకోనున్నట్టు జోస్యం చెప్పాయి. ఇదే తరహాలో కేరళ బెంగాల్‌ విభాగాలను పరస్పర వ్యతిరేకమైనవిగా చూపించాయి. మొన్నటి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో అవగాహన కుదర్చుకోవడం పార్టీ రాజకీయ ఎత్తుగడల విధానానికి అనుగుణంగా లేదని గతంలోనే పొలిట్‌బ్యూరో బహిరంగంగా ప్రకటించింది. తర్వాత బెంగాల్‌తో సహా ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాలలోనూ సంబంధిత కమిటీలు సమీక్షలు నిర్వహించి నివేదికలు పంపించాయి. వాటిని పరిశీలించి చర్చించిన కేంద్ర కమిటీ కాంగ్రెస్‌తో అవగాహన సరికాదన్న గత ప్రకటనను పునరుద్ఘాటించింది. ఈ లోపాన్ని సరిదిద్దడానికి పొలిట్‌బ్యూరో బెంగాల్‌ రాష్ట్ర కమిటీ సహకారంతో కృషి చేయాలని నిర్దేశించింది. అదే సమయంలో బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ నిరంకుశ పాలన నిర్బంధంపై విశాల పోరాటాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. కేరళలో ఘన విజయాన్ని హర్షిస్తూనే తమిళనాడు, అస్సాంలలో కూడా సిపిఎం వామపక్షాలు ఒక్కసీటు కూడా తెచ్చుకోలేకపోయిన పరిస్థితిపై నిరుత్సాహం వ్యక్తం చేసింది. అదే సమయంలో మోడీ ప్రభుత్వ మతతత్వ ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రాలపైన ప్రజాస్వామ్యంపైన దాడులను నిశితంగా విమర్శిస్తూ వాటిపై పోరాటానికి పిలుపునిచ్చింది.జిఎస్‌టికి సంబంధించి సరైన విధానాన్ని చేపట్టడం కోసం అఖిలపక్ష సమావేశం జరపాలని సూచించింది.ధరల పెరుగుదలపై ప్రజాఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ తరుణంలోనే ప్రభుత్వం రక్షణతో సహా సమస్త రంగాల్లోకి వంద శాతం ఎఫ్‌డిఐలను అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా సిపిఎం విధాన స్పష్టతనూ సానుకూల కార్యాచరణనూ తెలియజేసే పరినామం. ఇదే కొంతమందికి బొత్తిగా మింగుడుపడటం లేదు.
ఈ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి బడా మీడియా మొత్తం సిపిఎం కథ ముగిసిపోతుందని దారుణంగా దెబ్బతింటుందని అంచనాలు ప్రకటిస్తూ వచ్చింది కేరళలో బిజెపి బలం ఒక్కసారిగా పెరిగిపోతుందని కనీసం దానివల్ల యుడిఎఫ్‌ మరోసారి గెలిచే అవకాశం వుంటుందని కూడా లెక్కలు వేసింది.ఇవేవీ జరక్కపోగా ఎల్‌డిఎప్‌ ఎన్నడూ లేనంత గొప్ప ఆధిక్యత సాధించింది.బిజెపి ఓటింగు పెరిగినా ఒక్కసీటుకే పరిమితమైంది.యుడిఎప్‌ తుత్తునియలై పోయింది. ఈ ఘన విజయాన్ని గుర్తించేందుకు మనసొప్పక పోగా ా మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరాయి విజయన్‌ల మధ్య విభేడాలు ప్రజ్వరిల్లుతాయని ఆశపెట్టుకుని కూచుంది.ఈ జోస్యాలన్ని వమ్ము చేస్తూ పినరాయి విజయన్‌ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి గట్టి పాలనా చర్యలు మొదలుపెట్టారు. అచ్చుతానందన్‌నుంచి ఏదో రాబట్టాలని ఎంత ప్రయత్నించినా పలితం లేకపోయింది. ు.
ఈ సమావేశాలకు ముందు నుంచి పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలపైనే దృష్టి కేంద్రీకృతమైంది. 294 సీట్లలో 211 గెలుచుకుని తృణమూల్‌ మళ్లీ అధికారంలోకి వచ్చింది.సిపిఎం బలం గత శాసనసభలో కన్నా తగ్గింది. 2015 ఏప్రిల్‌లో విశాఖలో జరిగిన సిపిఎం జాతీయ మహాసభ కాంగ్రెస్‌ బిజెపిలతో ఎన్నికల పొత్తులు సర్దుబాట్లు వుండరాదనే వైఖరి తీసుకున్న నేపథ్యంలో బెంగాల్‌ కమిటీ కాంగ్రెస్‌తో అవగాహనకు రావడం విమర్శలకు దారితీసింది.దారుణమైన ఎన్నికల ఫలితాల తర్వాత ఈ విమర్శ ఇంకా తీవ్రమైంది కూడా. పొలిట్‌బ్యూరో గతంలోనే ఈ ఒడంబడిక 21ం మహాసభ నిర్దేశానికి అనుగుణంగా లేదని ప్రకటించింది. సహజంగానే సిపిఎం కేంద్ర కమిటీ దాన్ని పునరుద్ఘాటించింది. అదే సమయంలో ఓట్లు వేసిన 2కోట్ల 15 లక్షలమందికి ధన్యవాదాలు తెల్పింది.మళ్లీ వచ్చిన మమతా బెనర్జీ పాలనలో విశృంఖలంగా జరుగుతున్న దాడులను ఐక్యంగా ప్రతిఘటించాలని కోరింది. మరోవైపున పొలిట్‌బ్యూరో పశ్చిమ బెంగాల్‌ కమిటీతో సంప్రదించి జరిగిపోయిన పొరబాటును దిద్దుకోవడానికి తగు చర్యలు తీసుకోవలసి వుంటుందని తెల్పింది. అయితే కొందరు వ్యాఖ్యాతలు బెంగాల్‌ యూనిట్‌ను సుతిమెత్తగా వదలిపెట్టారనీ, నాయకత్వం మెతక వైఖరి ప్రదర్శించిందని పరిపరివిధాల రాశారు. అసలు కాంగ్రెస్‌తో అవగాహనను స్వంతం చేసుకోకపోవడం లోపమని మరికొందరు విమర్శిస్తూ వచ్చారు. ఆయా విమర్శకుల వాదనలెలా వున్నా సిపిఎం కేంద్ర కమిటీ జరిగిన తప్పిదాన్ని గుర్తించడం, పార్టీ ఐక్యతను కాపాడుకుంటూ దాన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవడం అనే విధానాన్ని ప్రకటించింది. ఇప్పటికే జరిగిపోయిన పొరబాటును ఆధారం చేసుకుని భవిష్యత్‌ కార్యాచరణ దెబ్బతినేలా వ్యవహరింఎచడం ఎప్పుడూ ఎక్కడా వాస్తవికత అనిపించుకోదు. అందునా కేంద్ర రాష్ట్రాలలో ప్రతికూల ప్రభుత్వాలు కొలువు తీరి అస్తిత్వాన్నే హుళక్కి చేయాలని చూస్తున్నప్పుడు ఆచితూచి వ్యవహరింఎచడం తప్ప ఆదాటు పోకడలకు ఆస్కారమే వుండదు. రాజకీయ నైశిత్యం వాస్తవిక దృక్పథం కలిస్తేనే సజీవమైన కార్యాచరణకు మార్గమేర్పడుతుంది.
సిపిఎంలో విభేడాలు సంక్షోభాలకు దారితీస్తాయని గతంలోనూ చాలా సార్లు కథలు వచ్చాయి. 1979లో ఆనాటి జనసంఫ్‌ు ప్రాబల్యం పెరిగిన జనతా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినప్పుడు గాని, 1996లో జ్యోతిబాసును ప్రధానిని చేయాలనే ప్రతిపాదన విషయంలో గాని,2008 అణుఒప్పందంపై యుపిఎకు మద్దతు ఉపసంహరించినప్పుడు గాని రకరకాల అభిప్రాయాలు వాదనలు జరిగాయి. వాటి ఆధారంగా సిపిఎం అనైక్యతను లోనవుతుందనే కథనాలు ప్రచారంలో పెట్టారు. కాని ఇంతకాలంలోనూ ఏకీకృత విధానంతో ముందుకు పోవడం, తప్పులు జరిగితే సవరించుకోవడం తప్ప వ్యక్తుల వివాదాలకు అంతర్గత కుమ్ములాటలకు సిపిఎం లోనైన ఉదాహరణ లేదు. ఈ క్లిష్ట సమయంలో లోపాలోపాలను సర్దుబాటు చేసుకుంటూనే ఐక్యతను కాపాడుకోవాలన్న మౌలిక సూత్రం అనుసరించడంలో ఆశ్చర్యం లేదు. కేంద్ర కమిటీ వైఖరి ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్‌తో ఇకపై పొత్తు వుండదా అని విలేకరులు ప్రశ్నించారు. సమీపంలో ఎన్నికలే లేనప్పుడు ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని సీతారాం ఏచూరి జవాబిచ్చారు. తృణమూల్‌ దుర్మార్గాలపై పోరాటంలో కాంగ్రెస్‌ వారిని కలుపుకొని వెళతారా అన్నప్పుడు ప్రతిఘటనకు సంబంధించిన కార్యాచరణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే కేంద్ర కమిటీ సభ్యురాలు జగతి సంగ్వాన్‌ బహిష్కరణకు దారితీసిన పరిస్థితులపై కూడా ఆయన సమగ్రమైన సమాధానమే ఇచ్చారు. ఎజెండాలలో లేని అంశంపై చర్చకు పట్టుపట్టి అడ్డుతగిలిన ఆమె పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నానని ప్రకటించి బయిటకు రావలసిన అవసరమేమిలో అర్థం కాలేదన్నారు. అత్యున్నత స్థాయి కమిటీ సభ్యులైన వారు ఇలా చేసిన తర్వాత క్రమశిక్షణ చర్య అనివార్యమేనని అందరికీ తెలుసు. తర్వాత కూడా ఆమె ఫేస్‌బుక్‌లో తన వాదనతో లేఖ రాయడం చూస్తే ధోరణి మారలేదని అర్థమవుతున్నది. రాజకీయ విధానంపై విమర్శ వుండొచ్చు గాని తానున్న కమిటీలో చర్యకు సంబందించిన కనీస శిక్షణ పాటించలేకపోవడం పెద్ద తప్పు. దాన్ని బహిరంగంగా ప్రకటించడం ఇంకా తప్పు. గతంలో పొలిట్‌బ్యూరో స్థాయిలోనే శిక్షణా చర్యలు తీసుకున్న ఉదాహరణలు దేశమంతా చూసింది. కనుక ఈ రెంటినీ కలగాపులగం చేసే అవకాశం లేదు. ఇష్టానుసారం మాట్టాడి వ్యక్తిగతం అనడం బిజెపిలో చెల్లుతుంది గాని సిపిఎంలో కుదరదు.
ఏది ఏమైనా సిపిఎంలో ఎలాటి రాజకీయ సంక్షోభం రాలేదన్నది నిజం. సమస్యలపై కార్యాచరణకు సిద్ధం కావడం నిజం. జులై 11 నుంచి 17 వరకూ జరిగే ప్రచారోద్యమం సిపిఎంను ఉధృత కార్యాచరణలో పెడుతుందని భావించవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *