హరీష్ ఉమా సమావేశం విఫలమేనా?

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, తన్నీరు హరీష్ రావులు ఎట్టకేలకు ఢిల్లీలో సమావేశం కావడం మంచి విషయమే. కేంద్ర మంత్రి ఉమాభారతి సూచనతో వారిని కూచోబెట్టారు తప్ప ఇప్పటి వరకూ ఇలాటిది తటస్థించలేదు. హరీష్ రావు ఒకటికి రెండు సార్లు ఉమాకు లేఖలు రాశారు గాని ఇది మన స్థాయిలో పరిష్కారం కాదని ఆయన స్పష్టంగా చెబుతూ వచ్చారు. ఈరోజు జరిగినచర్చలు కూడా విఫలమైనట్టే కనిపిస్తుంది. వారిలో వారు ఎలాటి అవగాహనకు రాలేదు గనకనే విడివిడిగా మీడియా గోష్టులు పెట్టి పాత ఆరోపణలే పునరుద్ఘాటించారు. నిజంగా ఇది దురదృష్టకరం. గతంలో జరిగిన నీటిపంపిణీని ప్రశ్నిస్తున్న తెలంగాణ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కొత్త ఉత్తర్వులిచ్చేదాకా ప్రస్తుత కృష్నా రివర్ వాటర్ మేనేజిమెంట్ బోర్డుకు పెద్ద పాత్ర వుండటానికి లేదన్న వైఖరితో వుంది. మరి కొత్త ట్రైబ్యునల్ వేయడానికి కేంద్రం అంగకరించేది లేనిదీ తెలియదు. ఒకవేళ జరిగినా చాలా కాలం పడుతుంది. ఈ లోగా రెండు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీకి మార్గం ఏమిటనే ప్రశ్న వుంటుంది. గతంలోని వివాదాలు ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను తవ్వుకుంటూ కూచుంటే ఇద్దరికీ నష్టం తప్ప లాభం శూన్యం. ఎపి ప్రభుత్వం నాగార్జున సాగర్‌ను మాత్రం కెఆర్‌ఎంబి తీసుకోవాలని చెబుతుంటే అన్నీ తీసుకోవాలని మేము అడుగుతున్నామని హరీష్ రావు వాదన సారాంశంగా వుంది. నిజానికి బోర్డు ఇచ్చిన ముసాయిదా ప్రకారం మొత్తం ప్రాజెక్టులన్నీ దాని పరిధిలోకి వస్తాయని ఉమా అంటున్నారు.ముసాయిదాకు అనంగీకారం చెప్పింది కూడా తెలంగాణ ప్రభుత్వమే. భిన్నాభిప్రాయాలు వుండటం సహజమే గాని ప్రస్తుతానికి నీటిపంపిణీ జరగాలంటే ఏదో ఒక కొలబద్ద వుండకతప్పదు. ఒకవేళ కెఆర్‌ఎంబిని గుర్తించడానికి గాని లేక దాని పనివిధానం నచ్చకపోవడం గాని వుంటే తమప్రత్యామ్నాయంఏమిటో చెప్పి ఒప్పించాల్సి వుంటుంది. పక్షపాతం ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం వుండదు. తాము ఎగువున వున్నాము గనక వివాదం వల్ల ఎపికే నష్టం అన్న మాటలు కూడా అవసరం లేనివే. ఇక ఎపి కూడాపట్టిసీమకు సంబంధించి అడుగుతున్న నీటివాటాపై ఏదో ఒక వివరణ ఇచ్చి ఒప్పించాల్సి వుంటుంది. రేపైనా సరే మాట్లాడుకోవడం తప్ప ఇందుకు వేరే పరిష్కారం లేదు. 24వ తేదీ బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలోగా రేపే ఇరు రాష్ట్రాలు అవగాహనకు రాగలిగితే కేంద్రం జోక్యం అవసరం వుండదు. లేకుంటే ఇది మరో కావేరీ వివాదంలా మారే ప్రమాదం వుంటుంది. నాగార్జున సాగర్ శ్రీశైలం భౌగోళిక స్వరూపాన్ని బట్ట్‌ి ఇక్కడ సమస్య మరింత తీవ్రంగానూ వుంటుంది. టిఆర్‌ఎస్ టిడిపి రాజకీయ వివాదంలా గాక రాజ్యాంగ బద్దమైన రాష్ట్రాల సమస్యగా చూసి తక్షణ పరిష్కారానికి రావడం ఉభయ ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర నిపుణులు కూడా ఆ మేరకు వారికి సహకరించి ఒప్పందానికి తీసుకురావాలి. అందులోనూ తీవ్రమైన కరువు నేపథ్యంలో ఈ కయ్యాలు మరింత చేటు.