ముద్రగడ దీక్ష 2 పై ఎవరి లెక్కలు వారివే!

01mudragada-pag_01_2720274e
ఎట్టకేలకు కాపునాయకుడు ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు అత్యవసర ఆహార చికిత్సకు అంగీకరించడం శుభపరిణామం. ఇందుకు ఆయననూ సంప్రదింపులు జరిపిన వారిని కూడా అభినందించాలి. అయితే ఈ మలిదీక్ష సందర్భంగా కుదిరిన అవగాహననైనా ప్రజలతో పంచుకోవడం మంచిది. రేపు మళ్లీ ఎవరు దాన్ని ఉల్లంఘించారో లేక పాటించారో తెలుసుకోవడానికి అవకాశముంటుంది. లేకపోతే మళ్లీ ఇరుపక్షాలూ చెరో రకంగా చెబుతుంటే గండరగోళం ఏర్పడుతుంది. రిజర్వేషన్ల వరకూ పార్లమెంటు తప్ప శాసనసభ చేస్తేచాలదు. పైగా న్యాయస్థానాలూ వుంటాయి. ఇప్పటికే గుజరాత్‌లో పటేళ్లు, రాజస్థాన్‌లో గుజ్జార్లు, హర్యానాలో జాట్లు, రకరకాలుగా రిజర్వేషన్‌ వివాదాలు నడుస్తున్నాయి.
తక్షణంగా చూస్తే అరెస్టులు కేసులపై ఏం చేస్తారన్నది ముఖ్యంగా వుంటుంది. నిజంగా విధ్వంసానికి కారణమైన వారుంటే తప్పకచర్య తీసుకోవలసిందేగాని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కాని ఆపేరుతో ప్రభుత్వంచాలామందిని వేధించిందనేది ఆరోపణ. అనవసరంగా అనేకమందిపై పోలీసులను పంపి లేనిపోని ప్రాధాన్యత కల్పించిందని గోదావరి జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధి ఒకరన్నారు.
ఈ ఉదంతం వల్ల కాపు నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని కట్టడి చేయగలిగారనే భావం వారిలోకనిపిస్తుంది. వైసీపీ కూడా రాజకీయంగా ఇది తమకు అనుకూలమైన పరిణామంగా లెక్కవేసుకుంటున్నది. ఇక తెలుగుదేశం నేతలైతే కాపులలో తమపట్ల వచ్చిన సద్భావాన్ని పోగొట్టుకోకుండా సంక్షోభం నుంచి బయిటపడ్దామనే ఉపశమనం కనిపిస్తున్నది.
కొంతమంది యువ నాయకులైతే పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవితో సహా కాపు నాయకులు చాలామంది తమవైపే వచ్చేస్తారన్నట్టు మాట్లాడుతున్నారు.తెలుగు రాష్ట్రాలలో ఎన్నడూ లేనట్టు ఒక కులానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులంతా బహిరంగంగా ఒకే వేదికపైకి వచ్చే పరిస్థితి ప్రభుత్వమే కల్పించందనేది పరిశీలకుల విమర్శగా వుంది. ఈ విధంగా కుల విభజనలు రాజకీయాలలో చొరబడితే ముందుముందు మనం కూడా తమిళనాడు కేరళ లేదా బీహార్‌ యుపిల వలె తయారవుతామని వారు హెచ్చరిస్తున్నారు.బిజెపి కూడా ఈ విషయంలో తన ముద్ర వేయాలనుకుంటున్నది. సంప్రదింపులలోనూ ఆ పార్టీ నేత ఒక ముఖ్యపాత్ర వహించారు.
ఏమైనా ఈ ఎపిసోడ్‌ అప్పుడే ముగిసిపోయినట్టు భావిస్తే తొందరపాటే. ప్రభుత్వ తదుపరి చర్యలు పోలీసుల అడుగులు ముద్రగడ వ్యూహాలు, ఆయనను బలపర్చేవారి ఆలోచనలు అన్నీ ముందు ముందు మరింత స్పష్టంగా బయిటకు రావాలి. ఇప్పటికైతే జరిగింది మంచిది. ముద్రగడ త్వరగా కోలుకోవాలనే ప్రతివారూ కోరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *