అసత్యాలతో అమిత్ మిషన్?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు చోట్ల తాము బ్రహ్మాండంగా దూసుకుపోతామని బిజెపి జాతీయ నాయకులు, రెండు రాష్ట్రాల నేతలు కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. దీనికే మిషన్ 7 స్టేట్స్‌గా నామకరణం చేశారు. దేశంలో పాలకపార్టీగా వారు అలా కోరుకునే హక్కు ఉంటుంది. కానీ అందుకోసం అవాస్తవ ప్రచారాలను అందులోనూ అంకెలను చెప్పడమే ఆశ్చర్యం కల్గిస్తుంది. గొప్ప వ్యూహ నిపుణుడుగా పేరున్న ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా ఈ అవాస్తవ ప్రక్రియకు ఆధ్వర్యం వహించడం హాస్యాస్పదం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అధికారికంగానే నిరాకరించారు. అంతకుమించిన ప్యాకేజీ ఇస్తామన్నది కూడా బూటకంగా మారింది. హళ్లికి హళ్లికి.. సున్నకు సున్న చేసిన కేంద్రం ఇతర ఆర్థిక నిధుల మంజూరులో కూడా మొండిచేయి చూపింది. రెవెన్యూ లోటు 16 వేల కోట్లుగా లెక్క కట్టి అందులో రైతు రుణమాఫీతో సంబంధం లేదని కోత కోసింది. రెండు దఫాలుగా 2,803 కోట్లు మాత్రం ఇచ్చి సరిపెట్టింది. ఇక వెనుకబడిన జిల్లాలకు నిధులు కూడా 350 కోట్ల దగ్గర ఆగిపోయాయి. రాజధానికి ఇప్పటికి ఇచ్చిన 1050 వందల కోట్లతో సరిపెట్టింది. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 16వేల కోట్లు అంచనా కాగా, 845 కోట్లు మాత్రమే ఇప్పటికి వచ్చాయి. ఇంకా కొన్ని మధ్యంతర దశలో ఉన్నాయని చెబుతున్నారు. కానీ మరోవైపున బిజెపి నాయకులు మాత్రం రోడ్లు, విద్యాసంస్థలు వగైరాలన్నీ కలిపి లక్షా 90వేల కోట్ల కేటాయింపులు చూపుతున్నారు. ఇవి ఇంకా నిర్మాణ దశలో ఉన్నా నిధులు నామమాత్రంగా విడుదలైన లెక్కలు మాత్రం గుప్పిస్తున్నారు. రైల్వే జోన్‌కు కూడా ఎగనామం పెట్టెట్టు కనిపిస్తుంది.
తెలంగాణ విషయంలో కథ ఇంతకన్నా భిన్నం కాదు. రెండేండ్లలో తమకు 90వేల కోట్లు ఇచ్చినట్లు అమిత్ షా నల్గొండ సభలో చేసిన ప్రకటనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇందులో మూడో వంతు 36వేల కోట్లు మాత్రమే వచ్చినట్లు వివరాలతో సహా వెల్లడించింది. 2014-15 సంవత్సరంలో సీఎస్ఎస్ (సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్) కింద రూ.5,028 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.8,189 కోట్లు, ఎన్డీఆర్ఎఫ్ ద్వారా రూ.19 కోట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రూ.2,110 కోట్లు.. ఇలా మొత్తం రూ.15,346 కోట్లు కేంద్రం నుండి వచ్చాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 2015-16లో సీఎస్ఎస్ కింద రూ. 6,047కోట్లు, కేంద్ర పన్నుల్లో కింద రూ.12,351 కోట్లు, ఎన్డీఆర్ఎఫ్ ద్వారా రూ.468 కోట్లు, ఫైనాన్స్ కమిషనర్ ద్వారా రూ. 1,078 కోట్లు.. మొత్తం 19,944 కోట్లు వచ్చాయని ఆయన వివరించారు. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే నిధులు ఇచ్చి ఏదో ప్రత్యేక ప్రేమ చూపినట్లు చెప్పుకోవడాన్ని ఏపి, తెలంగాణ ఉభయరాష్ట్రాలు తోసిపుచ్చుతున్నాయి. బిజెపి నేతలు తమ కేంద్ర నాయకులు ఇచ్చిన లెక్కలు వల్లెవేయడం తప్ప ఇందుకు గట్టి సమాధానం ఇవ్వగల స్థితిలో ఉండడం లేదు. చర్చను రాజకీయం వైపు మరల్చి ఏదో వివాద వ్యాఖ్యలతో సరిపెట్టేస్తున్నారు.
హర్యానాలో వలె అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్నా తమ నిజమైన బలమేంటో బిజెపికి తెలుసు. అందుకే తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదన్నది యధార్థం. అలాంటప్పుడు ఇవ్వని నిధులు ఇబ్బడిముబ్బడిగా చిత్రించి విమర్శలు కొనితెచ్చుకోవడం విజ్ఞతేనా..?
