దేవుడు ఆర్ఎస్ఎస్లో చేరాడా?
మతాన్ని రాజకీయాలను కలగాపులగం చేయడం ఒక జాడ్యం. ఒకసారి మొదలైతే దానికి ముగింపు ఉండదు. 1990లో తన రామ రథయాత్రతో బిజెపి అగ్రనేత ఎల్కే. అద్వానీ ఈ ప్రక్రియను పరాకాష్టకు తీసుకెళ్లారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ సంఫ్‌ుపరివార్, విహెచ్పి, భజరంగ్‌దళ్ వంటి సంస్థలన్ని తోడు నిలిచాయి. ఆ సమయంలో ఆయన రథంపై చిత్రించిన శ్రీరాముడి చిత్రం గుర్తు చేసుకోండి. బాణం ఎక్కుపెట్టి తీక్షణంగా చూస్తున్న అలాంటి రాముడి బొమ్మ తరతరాలుగా పూజించే హిందువుల ఇళ్లల్లో ఎక్కడైనా కనిపించిందా! అభయహస్తంతో సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతుడైన రాముడి ఫోటోనే ప్రతిచోట ఉండేది. నాకు బాగా తెలిసిన మేరకు అయోధ్యకాండ తర్వాతే ఈ యుద్ధ రాముడి చిత్రం వ్యాప్తిలోకి వచ్చింది. రామున్ని రాజకీయ చదరంగంలో వాడుకోవడం అప్పుడే మొదలైంది. ఇది నిజానికి రామభక్తులకు సవాల్ వంటిది. అయితే బిజెపి మాత్రం రామున్ని తమ రాజకీయ సోపానంగా ఉపయోగించుకోవడం జరిగిపోయింది. మళ్లీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల కోసం అయోధ్య కవాతు సమీకరణ పున:ప్రారంభిస్తున్నారు.
గుజరాత్‌లోని సూరత్‌లో స్వామి నారాయణ విగ్రహానికి అక్షరాల ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేయడం ఈ కోవలో మరో కొత్త అధ్యాయం. ఖాకీ నిక్కరు, తెల్లచొక్కా, నల్ల బూట్లు తగిలించిన స్వామి నారాయణ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ కావడం ఉద్దేశ్యపూర్వకమే. మతం, దేవుడు, ఆర్ఎస్ఎస్ వ్యూహంలో భాగమనే సంకేతం ఇవ్వడానికే ఇంత పనిచేశారు. మరెవరైనా పవిత్ర విగ్రహాలకు ఇలా చేసి ఉంటే సంఫ్‌ుపరివార్ దేశమంతా గగ్గోలు రేపేది. వివాదాలు, విద్వేషాలు రగిలేవి. ఇప్పుడు మాత్రం ఏదో పొరపాటు అయినట్టు సర్దుబాట్లు చేస్తున్నారు. ఎవరో భక్తులు కానుకగా ఇచ్చిన దుస్తులు వేశామని పూజారి విశ్వప్రకాశ్జీ చెప్పడం వింతగా ఉంది. ఎవరు ఏ దుస్తులు ఇచ్చిన ఒకసారి వేస్తామని ఆయన చెప్పే మాటలు నమ్మశక్యంకానివి. దేవుళ్లకు ఒక రాజకీయ సంస్థ దుస్తులు వేసే ఆచారం ఉంటే మిగిలిన పార్టీలు, సంస్థలు తమ తరహాలో – కాంగ్రెస్ టోపీ, ఎర్ర దుస్తులు, విదేశీ కోట్లు ఇస్తే కూడా ఇలా ధరింపజేసేవారు కారా?. ఎదురులేని గుజరాత్లో ఏదైనా చెల్లుతుందనే ధోరణి తప్ప ఇది మరొకటి కాదు. గతంలో బీజేపీలో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చిక శంకర్‌సింగ్ వాఘేలా దీనిపై తీవ్రంగానే స్పందిస్తూ రేపుమీరు బిజెపి అవతారం వేయిస్తారు. నిజంగా ఇది దురదృష్టకరం అని ఖండించారు. మోడిత్వం ముదిరే కొద్ది ఇలాంటివి మరెన్ని చూడాలో!.
