వ్యూహాత్మకంగానే తుని అరెస్టులు?

నాలుగు మాసాల కిందట తీవ్ర సంచలనం కలిగించిన తుని విధ్వంసం ఘటనలో దాదాపు నలభై మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం వెనక రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్ష కారణంగా అప్పుడు నెలకొన్న ఉద్రిక్తత అంతటి విధ్వంసానికి దారితీస్తుందని ఇతరులకు తెలియదు గాని ఇంటలిజెన్స్ వర్గాల దగ్గర సమాచారం వుంది. ఆ మేరకు వారు హెచ్చరికలు కూడా అందచేశారు. అయినా రాజకీయ కారణాల వల్లనో లేక ప్రతిక్రియ ఎక్కువగా వుంటుందనే సంకోచంతోనో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. రైలుబోగీల ధగ్ధం తర్వాత ముఖ్యమంత్రి సహా నాయకులందరూ వైసీపీపై దాడి కేంద్రీకరించారు.మరోవైపున తమలోని కొందరు కాపు నేతలను ఆయన దగ్గరకు పంపించి ఎలాగో దీక్ష విరమింపచేశారు. అప్పటినుంచి తెలుగుదేశం నేతలు కొన్ని పేర్లు చెబుతున్నారు. వారిలో ఒక వైసీపీ నాయకుడు నాకు విమానాశ్రయంలో కనిపించినప్పుడు మాటవరుసకు దీన్ని ప్రస్తావిస్తే ఆగ్రహౌదగ్రులైనారు. ఆ తరుణంలో తన పక్కన తెలుగుదేశం ప్రతినిధి వుండటం ఆసక్తికరం. మొత్తంపైన ఇదంతా పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారం అన్నది వైసీపీ వాదనగా సాగింది.
ఎంతో తీవ్రమైన సంచలనం కలిగించిన ముద్రగడ చప్పున దీక్ష విరమించడమే గాక చంద్రబాబునాయుడుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పడం ఆయన అనుయాయులకూ వైసీపీ నేతలకూ కూడా మింగుడు పడలేదు. బహుశా అది గ్రహించబట్టే ఆయన కూడా కొద్దిరో
జుల్లోనే మళ్లీ ప్రభుత్వంపై తీవ్ర భాషలో విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అందుకు తగినట్టే తెలుగుదేశం నాయకత్వం కూడా సమాధానాలు ఇప్పించింది. చివరకు ముద్రగడ హైదరాబాదు వచ్చి దాసరి నారాయణరావు, చిరంజీవి వంటి వారిని కలసి వెళ్లడం, వారు గట్టిగా మద్దతు తెల్పడంతో తెలుగుదేశం కూడా ఎదురుదాడి పెంచింది. తిరుపతి మహానాడులో ఒకటికి రెండుసార్లు దీనిపై చర్చ తీసుకురావడమే గాక చిరంజీవిని మరీ మరీ ప్రస్తావించడం అందరూ గమనించారు.ఇటీవలి కాలంలో క్రియాశీల రాజకీయాలు తగ్గించి సినిమాలో మునిగితేలుతున్న చిరంజీవిని అంతగా విమర్శించడంలో తెలుగుదేశం దూరదృష్టితోనే వ్యవహరిస్తున్నట్టు అర్థమైంది. ఆయన కూడా కాపు రిజర్వేషన్ల ఆందోళనకు మద్దతు ప్రకటించడం ద్వారా తన సామాజిక పునాదిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఒకవైపున పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు, ఆయన ఆధారంగా బిజెపి ఆశలు వీటి నేపథ్యంలో కాపుల సమస్యను తేలిగ్గా తీసుకోరాదని తెలుగుదేశం నిర్ణయించుకుంది. గట్టి వైఖరి తీసుకోవడం ద్వారా వారిలో కొంత వ్యతిరేకత వచ్చినా తనకున్న నికరమైన బలాన్ని కాపాడుకోవడం, విధ్వంసకాండకు బాధ్యతను మోపడం ద్వారా ఎదురు దాడి చేయడం, దీనంతటినీ వైసీపీపై రాజకీయ దాడికి వాడుకోవడం తెలుగుదేశం వ్యూహం కావచ్చు. దీనిపై ప్రతిపక్షం ఎలా స్పందిస్తుందో చూడాలి. హర్యానాలోనూ జాట్ల రిజర్వేషన్ల కు కోర్టు అవాంతరం వారు ఆందోళనను పున: ప్రారంభించడం చూస్తున్నాం.అయితే గతసారి వచ్చిన స్పందన ఇప్పుడు రాలేదని పరిశీలకుల అభిప్రాయం. కాపుల ఆందోళన ఏ రూపంలో వుంటుందో తెలియదు గాని ముద్రగడ మాత్రం ప్రతిజిల్లాలో కాపుసేన ఏర్పాటు చేయనున్నట్టు ఏలూరులో ప్రకటించి వున్నారు. అరెస్టుల అనంతరం ఆయన శిబిరంకూడా మరింత తీవ్రత పెంచేందుకు ప్రయత్నించవచ్చు. ఏమైనా ఈ క్రమంలో కులాల కుంపట్లు మరోసారి రాజేసే ఎత్తుగడలు మాత్రం హానికరం. ఇప్పటికే విభజనసమస్యల నుంచిబయిటపడని ఆంధ్ర ప్రదేశ్లో వివాదాలు విద్వేషాలు పెరిగితే మరింత నష్టం. ఈ విషయంలో ప్రభుత్వం కాపునేతలు కూడా సంయమనంతో వ్యవహరించాలనే ప్రజలు కోరుకుంటారు.