టిమ్ కుక్ రాకలో రహస్యం
అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ఎంతగొప్పవైనా సరే తమ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తాయి. ఆ క్రమంలో మనకూ ఉపాధి, సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం, ఆర్థిక సామర్థ్యం పెరుగుతాయి గనక ఆహ్వానిస్తాము. ఆదరిస్తాము. అయితే సరళీకరణ యుగంలో ఇదే ఒక మంత్రంగా మారిపోయి అవసరానికి మించిన ఆర్భాటం జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు తనే హైదరాబాదును అభివృద్ధి చేశానంటే ఆక్షేపించే టిఆర్ఎస్ నాయకులు తాము కూడా ఆ మూసలోనే ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా కెటిఆర్ చొరవలు హర్షణీయమే గాని అతిశయోక్తులు ఆకర్షణీయ ప్రచారాలు పరిశీలనార్హాలు. ఇటీవల యాపిల్ సిఇవో టిమ్ కుక్ రాకకు ముందు ఇచ్చిన హైప్, సో కాల్డ్ సస్పెన్స్ ఈ కోవకు చెందినవే. అమెరికా బయిట అతి పెద్ద కేంద్రం హైదరాబాదులోనే స్థాపిస్తున్నట్టు ప్రచారం జరిగింది. నిజంగానే ఒక పెద్ద కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. 4000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కాని అసలు కీలకమైన కేంద్రం బెంగుళూరులో స్థాపించనున్నట్టు యాపిల్ ప్రకటించింది. అసలు టిమ్ కుక్ రాకలో పరమార్థం వేరే వుంది. సెకండ్ హాండ్ ఐ ఫోన్లు అమ్ముకోవడానికి ఒక కేంద్రం స్థాపించుకోవడానికి ఆయన అనుమతి కోరుతున్నారు. గతంలో యుపిఎ ఇప్పుడు ఎన్‌డిఎ కూడా అందుకు అంగీకరించలేదు. అయినా ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పైగా సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడ్‌లో ఎఫ్‌డిఐలకు సంబంధించిన షరతులను సడలించాలని కూడా కోరుతున్నారు. ఆ షరతుల ప్రకారం 30 శాతం స్థానిక పెట్టుబడి వుండాలి. తమ సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఆ విధమైన భాగస్వామ్యం కుదరదు గనక 100 శాతం అనుమతి ఇవ్వాలని వెంటపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం నియమించిన ప్యానల్ అనుకూలంగా సిఫార్సు చేసింది. యాపిల్‌ది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ గనక మినహాయింపునివ్వొచ్చన్నది. అయితే దీనికి వ్యక్తిగతంగా తాను విముఖంగా వున్నానంటూనే వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదన పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. నెమ్మదిగి సడలింపు జరుగుతుందనే సూచన ఇందులో వుంది. అంటే 30 శాతం కూడా దేశీయ వాటా లేకుండా వారు ఏం ఎలా చేస్తారో చూడకుండా తలుపులు తెరవడానికి సిద్ధమై పోతున్నారు. విదేశీ పెట్టుబడులు రావలసిందే గాని వాటివల్ల మనం కూడా నేర్చుకునే పరిస్థితి లేకపోతే ఇంకెందుకు? మన మార్కెట్‌ను ధారాదత్తం చేయడానికా? వారి సెకండ్ హ్యాండ్ ఫోన్లు ఎక్కువ ధరకు కొనడానికా?యాపిల్ సిఇవో వెళ్లకముందే మైక్రోసాఫ్ట్ సిఇవో దిగిపోయారు. వీరంతా వాణిజ్య వేత్తలే గాని దేవదూతలు కారని మనం గుర్తించడం అవసరం. మనకూ గొప్ప ప్రతిభావంతులున్నారు. నిలదొక్కుకోవడానికి పోరాడుతున్నారు.ప్రభుత్వాలు వారికి చేయూత నిస్తే చాలా మంచిది.స్టార్టప్ ఇండియా అంటూనే నడక మరోవైపున వుంటే ఉపయోగం లేదు! ఇదంతా జరిగేదాన్ని తగ్గించడానికి కాదు గాని అతిశయోక్తులు వద్దని చెప్పడానికి. దేశీయ ప్రయోజనాలు పరిజ్ఞానం పెంచుకోవాలని కోరడానికి.