ఆమె ఫోటోల ప్రచారం అనుచితం

అస్సాంకు చెందిన బిజెపి మహిళా ఎంఎల్ఎ అంగూర్ లతా దేకా ఆధునిక దుస్తుల్లోనూ ఈత దుస్తుల్లోనూ వున్న పోటోలను సోషల్ మీడియా ప్రచారంలో పెట్టడం అనుచితం. ఆమె ప్రముఖ నటి. నాటకరంగంలో బెనజీర్ భుట్టో పాత్ర వేయడం ఆమెకు చాలా పేరు తెచ్చిందట. మూడు నాలుగు చిత్రాలు కూడా బాగా హిట్ అయ్యాయి.కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ సినిమా తారలకు ప్రముఖ స్థానం కల్పించే బిజెపి ఆమెను బటద్రోబా నియోజకవర్గంలో నిలబెడితే ఆరువేల ఓట్ల ఆధిక్యతతో ఎన్నికైనారు.ఆమె సినిమాల్లో ఎలాటి పాత్రలు ధరించినా లేక ఇప్పుడు ఎలాటి దుస్తులు ధరించినా అది ఆమె అభీష్టమే. అందులోనూ తొలి రోజులలో అవకాశాల కోసం తక్కువ రకం పాత్రలు ధరించడం అగ్రనటీనటులు కూడా చేసినపనే. మహిళలపై ఆంక్షలు ఆధిపత్యాలు మత చాందసులు చేసేపని తప్ప మానవత్వం వున్నవారు మార్పు కోరేవారు కాదు. సోషల్ మీడియా మిత్రులు ఈ వాస్తవాన్ని గుర్తిస్తారని ఆశించాలి. పైగా ఇలాటి పనుల వల్ల ,శ్రీరాం సేనముతాలిక్లు లేదా తాలిబాన్లతో సమానమైపోతామని గుర్తించాలి. మహిళలను వారి జీవిత స్వేచ్చను గౌరవించడం మానవత్వంలో సామాజిక సమానత్వంలో మొదటి మెట్టు. సంస్కారంలో భాగం. ఇప్పుడు ఆ ఫోటోలు ఆమెవి కానేకావంటున్నారు. అది మరీ తప్పు. ఒక వేళ ఆమెవే అయినా సరే ఆ ఫోటోలు ఇప్పుడు రాజకీయ వ్యతిరేకత కోసం వాడుకోవడం పొరబాటు.