దిలీప్ కుమార్, ఏఎన్నార్- ఒకే అనుభవం!
దిలీప్ కుమార్, ఏఎన్నార్ ఇద్దరికీ ట్రాజెడీ కింగ్స్ అని పేరు. దిలీప్ అఖిలభారత ంలో మొదటిసూపర్ స్టార్ అయితే అక్కినేని తెలుగు సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు నిలిచిన మరో మూలస్తంభం. ఈ ఇద్దరికి విమానంలో ఒకే విధమైన అనుభవం కలగడం ఆసక్తికరం. దిలీప్ ఒకసారి విమానంలో వెళుతున్నారట. విమానంలోకి ప్రవేశించగానే చాలామంది తనను గుర్తించడం గమనించడం చూశారు. తర్వాత వెళ్లి తన సీట్లో కూచున్నారు. పక్కన ఎవరో పెద్ద మనిషి వున్నాడు. ఆయన మాత్రం దిలీప్‌ను పట్టించుకోలేదు. పలకరించే ప్రయత్నం చేయలేదు. కాఫీ వచ్చినప్పుడు సహాయం చేస్తే థాంక్స్ చెప్పి వూరుకున్నారు. ఆగలేక దిలీప్ కుమార్ మీరు సినిమాలు చూస్తుంటారా అని అడిగారు. చాలా తక్కువ అని ముక్తసరిగా సమాధానమిచ్చాడా పెద్దమనిషి. నేను సినిమాల్లో పనిచేస్తాను అని దిలీప్ చెబితే ఏం చేస్తారు అని ప్రశ్నించాడు. నటిస్తాను అన్న జవాబుకు బ్రహ్మాండం అని స్పందించి మళ్లీ తన ఆలోచనల్లో వుండిపోయారు. సరే విమానం దిగిపోయేప్పుడు ఆగలేక వెళ్లి కరచాలనం చేశారు. నా పేరు దిలీప్ కుమార్ అని చెప్పారు. నా పేరు జెఆర్‌డి టాటా అన్నారు అవతలి పెద్ద మనిషి. ఈ కథ చెప్పిన దిలీప్ కుమార్ ఎప్పుడైనా లోకంలో మనకంటే గొప్పవారుంటారని కనుక మనం నమ్రతగా వుండటం మంచిదని ముక్తాయించారు. వినయంగా వుండటంలో అదనంగా పొయ్యేదేమీ లేదని అంటారు.
ఇలాటి కథే నేను ఒక సభలో అక్కినేని నాగేశ్వరరావు దగ్గర విన్నాను. ఆ సభలో వయోవృద్ధ నాయకుడు ఆచార్య రంగా కూడా పాల్గొన్నారు.అక్కినేని చెప్పిందేమంటే- ఒకసారి ఆయన విమానం ఎక్కారు. ఆయనకు రంగా తెలుసు. ఎంతసేపటికీ మాట్లాడించకపోవడంతో తనే పలకరించారు. రంగా గారూ నేను నాగేశ్వరరావునండి అన్నారు. ఆహా అంటూ ఏదో ఆలోచనలోపడిపోయారు. నేను అక్కినేని నాగేశ్వరరావునండీ అని మరోసారి చెప్పారు.అప్పటికైనా గుర్తిస్తారని. ఆహా ఏంచేస్తుంటావ్? అని రంగా గారు అడిగేసరికి ఆశ్చర్యపోయారు. అప్పటికే ఆయన పేరు పొందిన హీరో. సరే తర్వాత కాలంలో రంగాతో ఆయనకు బాగా పరిచయం ఏర్పడిందనుకోండి..అది వేరే విషయం.
ప్రసిద్ధ సంపాదకుడు నార్లవెంకటేశ్వరరావు గారింటికి ఒక బంధువైన ఒక పెద్దాయన వచ్చారట. ఇల్లు అదీ చూశాక ఇంతకూ నీ ఉద్యోగమేమిటి అని అడిగారట.అప్పటికి కొన్ని దశాబ్దాలుగా పత్రికలో పైనే ఎడిటర్ అని తన పేరు వేసుకున్న నార్ల ఈ ప్రశ్నకు తనే జవాబు చెప్పుకోక తప్పలేదు.
అదీ సంగతి!

