చంద్రబాబూ, దేవుడూ, ఆదాయం.. పాప పుణ్యాలూ

babu tpt
విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆ మాటలు ఏ కమ్యూనిస్టు నాయకుడో అంటే మరింత రభస జరిగివుండేదనుకోండి.. ఆ సంగతి అలా వుంచితే పాపాలు పెరిగితే దేవుణ్ని దర్శించుకోవడం, ముడుపులు చెల్లించుకోవడం ఎక్కువవుతుందనేది ముఖ్యమంత్రి మనోగతం. ఎక్కువ పాపాలు చేసే వారు ఎక్కువగా మొక్కుకుంటుంటారని ఆయన అన్నది బహుశా ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకుని కావచ్చు. అందుకే గుడికే కాదు, చర్చిలకు మసీదులకు కూడా పోతుంటారని జోడించారు. బహుశా నవ్విద్దామని ఆయనఅన్న మాటలు మేమంతా పాపులమా అనుకునేలా భక్తులను గాయపరుస్తాయి గనక వివాదమైంది. అందుకే ఆ వెంటనే లిక్కర్‌షాపుల ఆదాయం పెరక్కపోవడానికి అయ్యప్ప మాల వేసుకోవడం కారణంగా చెప్పారు.పాప పుణ్యాల మీమాంస ఎలా వున్నా చంద్రబాబు ప్రధానంగా ఇక్కడ ఆదాయం పెంచడం గురించే కేంద్రీకరించారు. ఆయన ఈ ధోరణిలో మాట్లాడుతూ వుంటారు కూడా. ఏడాది కిందట ఎడిటర్లతో జరిగిన సమావేశం భోజన విరామంలో నేను ఈ మధ్య మీకు భక్తి విశ్వాసాలు పెరిగాయా అని అడిగితే మీరే చెప్పాలి అన్నారు. తర్వాత ఆ అంశాన్ని మళ్లీ కొనసాగిస్తూ ఏదో ఒక ఉపశమనం కోసం దైవచింతన యోగాసనాల వంటివి చేయాలని అన్నారు. డిగ్దీ వాసుదేవ్‌తో ఆయన నృత్యం చేస్తున్న చిత్రం కూడా విడుదల చేశారు. ఆ సమయంలోనే ఆయన కాస్త ఆగి తను మొదటి సారి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు దేవాలయాల ఆదాయం పెరగడానికి చాలా కృషి చేశానని, తిరుపతిలోనూ చాcmofficeలా మార్పులు తెచ్చానని అన్నారు. శ్రీకాళహస్తి ప్రధానంగా తన హయాంలోనే అభివృద్ది చెంది మరో ముఖ్యకేంద్రంగా మారిందన్నారు.
మన సమాజంలో దేవాలయాలు కూడా మార్కెట్‌ విస్తరణకు తోడ్పడతాయి. ఒక ఆలయం వుంటే దాని చుట్టూ నివాసాలు, దుకాణాలు, ఉపాధి, యాత్రీకులు ఇలా ఆర్థిక కార్యక్రమాలు పెరుగుతాయంటూ ఆర్థిక సిద్ధాంతం చెప్పారు. మంగళగిరి నరసింహస్వామి ఆలయం ఆదాయం కూడా పలానా స్థాయికి చేరే అవకాశం వుందని అందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదంతా పిచ్చాపాటిగా జరిగింది . మా సహచర సంపాదకులు చాలా మంది పట్టించుకోలేదు గాని ఆంధ్రజ్యోతి మాత్రం వివరంగానే ఇచ్చింది.

దేవాలయాలు వాటి ఆదాయ వ్యయాలు, ఆస్తిపాస్తుల నిర్వహణ ప్రభుత్వ బాధ్యతే. విశ్వాసాలు ఎవరికి వారివి. చంద్రబాబుకు భక్తి విశ్వాసాలు పెరిగినప్పటికీ దేవస్థానాల ఆదాయం పెంచాలన్న కోణం ఫ్రధానంగా కనిపిస్తుంటుంది. కలెక్టర్ల సమావేశంలోనూ అదే మాట్లాడారనుకోవచ్చు. తప్పులు చేసిన వారు ముడుపులు కట్టి బయిటపడేయమని కోరడం తెలిసిందే. గాలి జనార్థనరెడ్డి వజ్ర కిరీటం చేయించి దేవుడికే శఠగోపం పెట్టారని నేను సరదాగా అంటుండేవాణ్ని. అయితే ముఖ్యమంత్రి హౌదాలో మాట్లాడేప్పుడు అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకోవలసిందే. రెండవ రోజు సర్దుకోవడానికి ప్రయత్నించారు గాని తన వ్యాఖ్యలు తప్పుగా చిత్రించారంటూ మరో చర్చకు తెరలేపారు. ఇటీవలి కాలంలో ఆదమరుపుగానో అనుకోకుండానో ముఖ్యమంత్రి అనేక ‘సత్యాలు’ చెప్పి తర్వాత నాలుక కర్చుకుంటున్నారు. దిద్దుకోవడం తప్పులేదు గాని దానికి బాధ్యత మరెవరిపైనో నెట్టడం అవసరం లేని పని.ఎందుకంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఇంగ్లీషు పత్రికలతో సహా అన్ని మీడియా సంస్థలూ నివేదించాయి. కాస్త అటూ ఇటూ తేడాలుండొచ్చు గాని అన్నది నిజం. దిద్దుబాటు ప్రయత్నం నిజం. ఆధ్మాత్మికత నిజం.ఆదాయం నిజం. పాప పుణ్యాలు వారి వారికి సంబంధించిన విషయాలు. ప్రజా జీవితంలో తప్పొప్పులకు సంబంధించి ప్రజలే దేవుళ్లుగా వుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *