బెంగాల్ కేరళ ద్విముఖ సంకేతాలు

మమతా బెనర్జీ నిర్బంధకాండ, శారదా నుంచి నారద వరకూ నడిచిన భాగోతాలు మరింత దారుణమైనవి. అయినా ఆమె మరోసారి గెలుపు సాధించడానికీ ప్రజాదరణేగాక కేంద్ర బిజెపి సహకారం తోడైంది. కమ్యూనిస్టు వ్యతిరేకతతో కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు కూడా ఆమెకే ఓటు వేసినట్టు కనిపిస్తుంది. ప్రజానుకూల విధానాలతో 34 ఏళ్లపాటు అవిచ్చిన్నంగా పాలించి ప్రపంచ రికార్డు స్థాపించిన వామపక్ష ప్రభుత్వంపై చివరి దశలో పొరబాట్ల కారణంగా తలెత్తిన ప్రజాగ్రహం, అసంతృప్తి ఇంకా పూర్తిగా తొలగిపోలేదని కూడా ఫలితాలు స్పష్టం చేశాయి. అప్పటి పరిపాలనా కాలంలో ప్రజలతో సంబంధాలు దెబ్బతినడం, ఇప్పుడు ప్రభుత్వ నిర్బంధం తృణమూల్ హత్యాకాండ కారణంగా ప్రజల్లోకి వెళ్లి పనిచేసే పరిస్థితిలేకపోవడం వంటివన్నీ వామపక్షాలను దెబ్బతీశాయి. దీనిపై లోతైన సమీక్ష జరపనున్నట్టు సిపిఎం ప్రకటించింది. ఏమైనా అంత దీర్ఘకాలం పాలించి వివిధ రకాల ఎన్నికల్లో కొన్ని డజన్ల సార్లు గెలుపొందిన వామపక్ష ఫ్రంట్ గత కొన్నేళ్లలో ఓడిపోతున్నది గనక దాని మనుగడే వుండదన్నట్టు చిత్రించడం విజ్ఞతకాదు. తెలుగుదేశం, కాంగ్రెస్ వంటిపార్టీలే వరుస ఓటముల తర్వాత కూడా బతికిబట్టకట్టినప్పుడు సిద్ధాంత బలం కార్యకర్తల సైన్యం ఆత్మ విమర్శ ఆయుధం వున్న సిపిఎం వంటి పార్టీ దీంతోనే కూలిపోతుందని ఆశించడం అవివేకం. సవాళ్లు తీవ్రమైనవే అయినా సమీక్షానంతరం సానుకూల సమరశీల కార్యాచరణతో దాన్ని అధిగమించేందుకు కమ్యూనిస్టు ఉద్యమం తప్పక కృషి చేస్తుంది. ఈ దారుణ పరాజయం పక్కనే – కారుచీకట్లో కాంతిరేఖలా కేరళలో అఖండ విజయం అసాధారణ ఆధిక్యత చూడకపోతే అది పాక్షికత్వమవుతుంది. ఈ ఫలితాల తర్వాత సిపిఎంలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం వచ్చేస్తుందని కొన్ని మీడియా సంస్థలు రాస్తున్నాయి. నిష్కర్షగా చర్చించుకోవచ్చు గాని నిరుత్సాహాన్ని నిస్రృహగా మార్చుకుని నీరసపడటం సిపిఎం వంటి పార్టీ కార్యకర్తలకు తెలియనిపని. జయాపజయాలతో నిమిత్తం లేకుండా కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ మతతత్వ రాజకీయాలను వినాశకర ఆర్థిక విధానాలను అవినీతి వ్యవహారాలను అరికట్టడంలోనే భవిష్యత్తు దాగివుంటుంది. ఆ కృషిలో వామపక్షాలు ముందే వుంటాయి. త్రిపుర కేరళ ప్రభుత్వాలు తమ వంతు పాత్ర పోషించాలనే ప్రజాస్వామిక వాదులు కోరుకుంటారు.