‘ప్రత్యేక’ నాటకంలో నూతనాంకం

modi vnkyya11
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాపై టిడిపి బిజెపి నడిపిస్తున్న రాజకీయ ప్రహసనం ఈ రోజు నూతనాంకంలో ప్రవేశించింది. విజయవాడలో ఎపి బిజెపి కోర్‌ కమిటీకి హాజరైన జాతీయ నేత సిద్ధార్థసింగ్‌ అన్ని విధాల ఆదుకుంటామని హామీలు కురిపించారు. అంతేగాక తెలుగుదేశం నేతలు తమపై దాడి చేయడం తగదని హితవు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హౌదా అడిగారా లేదా అంటే జవాబు మీకే తెలుసని దాటేశారు. సరిగ్గా ఈ రోజునే టిడిపి ఎంఎల్‌సి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే తెలుగుదేశంకూ పడుతుందని ధ్వజమెత్తారు. ఈ విషయమై ఉభయ పార్టీల పిల్లిమొగ్గలు చాలా సార్లు చెప్పుకున్నవే. ప్రజల్లో అసంతృప్తి దృష్ట్యా ఇరు పార్టీలు ఒకరినొకరు మరోసారి తిట్టుకుంటున్నాయి తప్ప ఉభయ వాదనల్లోనూ వాస్తవం లేదు. ప్రత్యేక హౌదా రాదని మానసికంగా సిద్ధం చేసే ప్రక్రియ మొదలుపెట్టిందే వెంకయ్య నాయుడు. అదేమీ సంజీవని కాదని సన్నాయి నొక్కులు నొక్కింది చంద్రబాబు. అమరావతికి వచ్చిన ప్రధానిని ే ప్రత్యేక హౌదా అడక్కుండా పంపించడంబహిరంగంగాన అందరూ చూశారు. ఏమైనా ఇవ్వాలని అడిగిందీ, ఇస్తామని ప్రణాళికలో చెప్పిందీ ఇప్పుడు ప్రధాని పదవి నిర్వహిస్తున్నది బిజెపి గనక వారు మాట మార్చడం విశ్వాస ఘాతుకమే. ఇక రకరకాలుగా మాట్లాడుతూ హౌదా కన్నా ప్యాకేజీ మేలని సంజీవని కాదని వారికి పరోక్షంగా వూతమిచ్చింది తెలుగుదేశం. విజయవాడలో వెంకయ్య వాక్కులతో మొదలై పార్లమెంటు సాక్షిగా ప్రకటించేవరకూ నడిచింది. అయితే మళ్లీ ఈ నెల 17న మోడీతో చంద్రబాబు సమావేశమంటున్నారు. దానికి ముందు ఆర్థిక శాఖ కార్యదర్శి పి.వి.రమేష్‌ నాయకత్వంలో బృందంవెళ్లి చర్చలు చేస్తుందంటున్నారు. ఈ తతంగమంతా జరిపించి ఏవో మంచి మాటలతో భారీ సహాయం ఇవ్వబోతున్నట్టు మరోసారి ప్రకటించి సర్దుకుంటారు. అంతకన్నా ఒరిగేది వుండదు. వచ్చేదీ వుండదు. 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ దేశమంతటికీ తప్పఎపికి
మాత్రమే కాదు.పార్లమెంటులో హామీనిచ్చి విభజన చట్టంలో లేదని తప్పించుకోవడం రాజ్యాంగ బద్దమూ కాదు. రెవెన్యూ లోటు కింద ఇచ్చింది కేవలం ఆరున్నర వేల కోట్లు మాత్రమేనని కూడా ఢిల్లీ పెద్దలు గుర్తించాలి మరి!దీన్ని నెమ్మదిగా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చే కుత్సితం కూడా ఇందులోదాగివున్నట్టు కనిపిస్తుంది. గతంలోనే చెప్పుకున్నట్టు వున్న ప్రత్యేక హౌదా ఎత్తివేతపై ఈశాన్య రాష్ట్రాలు పోరాడుతుంటే కొత్తగా అడగాలని ఒరిస్సా బీహార్‌ వంటివి సిద్ధమవుతుంటే హామీ నిలబెట్టుకోమని అడిగేందుకు తెలుగుదేశంకు ఇంత జంకెందుకు? అందుకోసం అందరినీ కలుపుకోవడానికి అభ్యంతర మెందుకు?బిజెపి అంతగా ఈసడిస్తున్నా వెంటబడాల్సిన అగగ్యమేమిటి? అలాగే నిజంగా చంద్రబాబు కపటనాటకం ఆడుతున్నాడనుకుంటే ఆ విషయం చెప్పడానికి బిజెపికి ఆటంకమేమిటి? సిద్ధార్థ సింగ్‌ కూడా చంద్రబాబు చాలా గౌరవనీయ నాయకుడని చెప్పడంలో మర్మం తెలుస్తూనే వుంది. 17వ తేదీ తర్వాత ఈ ఉభయ పార్టీలూ మరోసారి ఎపి ప్రజల చెవిలో పూలు పెడతాయన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *