మోడీ నాయకత్వానికి మూడో దెబ్బ

modi,amit

నరేంద్ర మోడీ నాయకత్వాన కేంద్రంలో ఏర్పడిన బిజెపి ఎన్‌డిఎ ప్రభుత్వం ఇప్పటికి రాజకీయంగా రెండు రకాల ుదెబ్బలు తిన్నది. అసహనం, విద్వేషపూరిత పోకడలపై తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది. ఢిల్లీ, బీహార్‌ వంటి చోట్ల ఘోర పరాజయాలు చవిచూసింది. అరుణాచల్‌ తర్వాత ఉత్తరాఖండ్‌లో ఘోరంగా ఓడిపోయి ఇప్పుడు మూడో తరహా దెబ్బ తిన్నది.

యాభై మంది ఎంఎల్‌ఎలున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ శాసనసభలో బిజెపి బలం 11 మాత్రమే. అయినా ి కాంగ్రెస్‌ను చీల్చి ఫిరాయింపుదార్ల ప్రభుత్వం ఏర్పాటు చేయించేందుకు బిజెపి పాచికలు విసిరింది. కొలికోపాల్‌ నాయకత్వంలో 14 మంది ఎంఎల్‌ఎలు తిరుగుబాటు చేసి నాబాం తుకి మంత్రి వర్గానికి మద్దతు ఉపసంహరించినట్టు. గవర్నర్‌ రాజ్‌కోవాకు తెలియజేశారు. ఇలాటి సందర్భాలలో జరగాల్సింది శాసనసభలో బలపరీక్ష మాత్రమేనని ఎస్‌ఆర్‌బొమ్మై కేసులో సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొన్నది. అరుణాచల్‌లో కూడా ముఖ్యమంత్రి బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈలోగా స్పీకర్‌ 14 మంది తిరుగుబాటు ఎంఎల్‌ఎలను అనర్హులుగా ప్రకటించారు. వారంతా గౌహతి హైకోర్టుకు వెళ్లిస్టే తెచ్చుకున్నారు. మరోవైపున కేంద్రం రాష్ట్రపతి పాలన విధించి స్వార్థ రాజకీయానికి తెర తీసింది. ఈ వివాదాస్పద పరిస్థితుల మధ్యనే ఫిబ్రవరి 19న రాష్ట్రపతి పాలన తొలగించడం, 20న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయడం జరిగిపోయింది.ఇది అన్యాయమనీ, రాష్ట్రపతి పాలన ఎత్తివేసేట్టయితే తన ప్రభుత్వం పునరుద్దరణ జరుగుతుందనీ ముఖ్యమంత్రి నాబాం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు మొదట అక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అయితే రాష్ట్రంలో రాజ్యాంగ శూన్యత అనుమతించలేమని కేంద్రం వాదించి రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు అనుమతి కోరింది.కాంగ్రెస్‌ మరోసారి కోర్టును ఆశ్రయించినా జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని ఆపడానికి అది నిరాకరించింది. ముందు మాకు బలపరీక్ష జరపాలనే వాదనను కూడా ఒప్పుకోలేదు. ఆ విధంగా కొలికోపాల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు 21 మంది చీలిక దార్లతో పాటు 11 మంది బిజెపి ఎంఎల్‌ఎల మద్దతు కూడా లభించిందంటున్నారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు మొత్తం పరిస్థితిని సమీక్షించాక తగు తీర్పునిస్తామని చెప్పింది. రేపు రాష్ట్రపతి పాలనపై తుది తీర్పు వ్యతిరేకంగా వస్తే తుకి ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తారా? గౌహతి హైకోర్టు గనక ఫిరాయింపుదార్లపై అనర్హత వేటు చెల్లుతుందని తీర్పు చెబితే అప్పుడు కూడా కోలకోపాల్‌ ప్రభుత్వాన్ని తొలగిస్తారా? ఇలాటి ప్రశ్నలు చాలా వున్నాయి. . సున్నితమైన ఒక రాష్ట్రంలో ప్రాణాంతక ప్రయోగం జరుగుతున్నది. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కానివ్వండి.. అంతా అయ్యాక మేము చెప్పాల్సింది చెబుతాము’ అని ధర్మాసనం పేర్కొనడం కితాబేమీ కాదు.
కేంద్రం ప్రత్యక్ష హస్తం
ఈ కేసు ఇలా నడుస్తుండగానే ఉత్తరాఖండ్‌ రాజకీయ భాగోతం మొదలు పెట్టారు. 2000లో ఆ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాజకీయ స్థిరత్వం ఎండమావిగానే వుంది. ప్రస్తుతం హరీష్‌ రావత్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి 70 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 36 మంది బలం వుండేది. బిజెపికి 27 మంది వున్నారు. మరో ఆరుగురితో కూడిన పిడిఎఫ్‌లో ఇద్దరు బిఎస్‌పి, ఒక్కరు క్రాంతిదళ్‌, ముగ్గురు ఇండిపెండెంట్లు వున్నారు. కాంగ్రెస్‌నుంచి 9 మందిని బిజెపి ఆకర్షించడంతో రావత్‌ ప్రభుత్వం మెజార్టి కోల్పోయిందంటూ గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే బొమ్మై కేసు తీర్పు ప్రకారం మెజార్టి తేలవలసింది సభలో తప్ప రాజ్‌భవన్‌లో కాదు. ఆ విధంగా ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌, బిజెపితో కలసిన ఫిరాయింపు దార్లు తమ తమ ఎత్తుగడలను కొనసాగిస్తూ వచ్చారు. అనుకున్న ప్రకారం ప్రభుత్వాన్ని పడగొట్టలేకపోయిన బిజెపి, ఫిరాయింపుదార్ల కూటమి బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నట్టు ప్రహసనం నడిపించారు. అయితే స్పీకర్‌ ఆ సంగతి పట్టించుకోకుండా ఆమోదం పొందినట్టు ప్రకటించేశారు. ఆ దశలో కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ ఆమోదం పొందకపోవడంతో రాజ్యాంగ సంక్షోభం నెలకొందని వ్యాఖ్యలు చేశారు.తిరుగుబాటు ఎంఎల్‌ఎలు గవర్నర్‌ కెకెపాల్‌ను కలసి ప్రభుత్వాన్ని తొలగించాలని కోరారు. ఈ దశలో ఆయన మార్చి 28న బలపరీక్ష జరగాలని నిర్దేశించారు. దానికి ముందురోజే స్పీకర్‌ 9 మంది తిరుగుబాటు ఎంఎల్‌ఎలను అనర్హులుగా ప్రకటించేశారు. వారు కోర్టును ఆశ్రయించడం, కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడం జరిగిపోయాయి. ఉత్తరాఖండ్‌ కూడా చాలా చిన్న వెనకబడిన రాష్ట్రం. వచ్చే ఏడాది ఎలాగూ అక్కడ ఎన్నికలు జరగాల్సి వుంది. ఇలాటి సమయంలో ఇంత రాజకీయ సంక్షోభం సంఘర్షణ సృష్టించడంపై దేశమే ఆశ్చర్యపోయింది.కాని బిజెపి మాత్రం ఆ రాష్ట్రం దృష్టితోనే గాక ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలను కూడా గమనంలో వుంచుకుని ఏకపక్ష చర్యలకు పాల్పడి విమర్శలు మూటకట్టుకుంది. పైగా అప్పటికే ఫిరాయించిన ఎంఎల్‌ఎలను తిరిగి తనవైపు తిప్పుకోవడానికి రావత్‌ ప్రలోభాలు చూపించారని స్ట్రింగ్‌ ఆపరేషన్‌ విజువల్స్‌ విడుదల చేసి ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించింది.

పారని పాచికలు
ఇలా చూస్తే జరిగినవన్నీ నాటకీయ పరిణామాలే. మొదట నైనిటాల్‌ హైకోర్టు కేంద్రం రాజకీయ జోక్యాన్ని విమర్శించి రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని ఆదేశించింది. హరీష్‌ రావత్‌ పదవీ బాధ్యతల్లో ప్రవేశించి క్యాబినెట్‌ జరిపి నిర్ణయాలు కూడా చేశారు. మరుసటి రోజున సుప్రీం కోర్టు మళ్లీ యథాతధ స్థితిని పునరుద్ధరించాలని నిర్దేశించడంతో రాష్ట్రపతి పాలన తిరిగివచ్చింది.హైకోర్టు తీర్పుతో కంగుతిన్న బిజెపి నేతలు తమకు అనుకూలంగా వున్నట్టే భావించారు. అయితే అదే సమయంలో సుప్రీం కోర్టు ఫిరాయింపుదార్లకు సంబంధించిన విచారణ హైకోర్టుకు వదలిపెట్టింది. ఈ లోగా రాష్ట్రపతిపాలన ఎత్తివేసి (అరుణాచల్‌లో వలె) ప్రమాణస్వీకారాలు చేయించవద్దని హెచ్చరించింది. తర్వాత విచారణ క్రమంలో కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలే చేసింది. 9వ తేదీన హైకోర్టు అనర్హతపై తీర్పు నిస్తుంది గనక మే 10న బలపరీక్ష జరగాలని ఆదేశించింది. ఈ పరీక్షలో అనర్హత వేటుపడిన ఎంఎల్‌ఎలు ఓటు చేయడానికి లేదనీ, తమ పర్యవేక్షణలోనే ఓటింగు జరగాలని కూడా నూతన పద్ధతులు అమలు చేసింది. ఈ లోగా హైకోర్టు అనర్హత వేటు చెల్లుతుందని తీర్పునిచ్చింది. అనుకున్న ప్రకారమే జరిగిన ఓటింగులో రావత్‌కు అనుకూలంగా 33 ఓట్లు రాగా బిజెపికి 27 దగ్గరే ఆగిపోయింది. పిడిఎప్‌సభ్యులు ఆరుగురు ఆయనను బలపర్చడం, కొత్తగా బిజెపివైపు ఎవరూ వెళ్లకపోవడం పరిస్థితిని తలకిందులు చేసింది. మంగళవారమే బిజెపి రాష్ట్ర శాఖ ఓటమి అంగీకరించగా బుధవారం సుప్రీం కోర్టు అధికారికంగా ధృవీకరిస్తూ రావత్‌ను ముఖ్యమంత్రిగా పునరుద్ధరించాలని ఆదేశించింది.

అందరికీ పాఠమే!
ఈ మొత్తం పరిణామ క్రమంలో గమనించాల్సిన అంశాలు భవిష్యత్తుకు పాఠాలుగా మిగిలిపోవలసిన అంశాలు మూడున్నాయి: మొదటిది- కేంద్రంలో కాంగ్రెస్‌ రాష్ట్రపతిపాలనను దుర్వినియోగం చేసిందనీ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసిందనీ ఆరోపించిన బిజెపి తాను అంతకన్నా అధ్వాన్నంగా వ్యవహరించడం రెండోది- తనకు కనీస బలం లేకున్నా ఇతర పార్టీలలో చీలిక తీసుకురావడం ద్వారా చిన్న చిన్న రాష్ట్రాలలో కూడా రాజకీయ హైన్యానికి పాల్పడ్డం, మూడు- 10 వ షెడ్యూలులోని ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్లు నిర్ణయం తీసుకుని పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించవలసిన అవసరం. 2003లో తీసుకొచ్చిన 91 వ రాజ్యాంగ సవరణ ప్రకారం చట్టసభలోనిఒక రాజకీయ పార్టీ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది విలీనం కోసం తీర్మానం చేస్తే తప్ప మరే ఇతర విధాలైన ఫిరాయింపులు కూడా చెల్లవు. (పార్టీ అంటే శాసనసభా పార్టీ తప్ప బయిట వుండే పార్టీ కాదు. ఎందుకంటే ఎన్నికల సంఘం గుర్తింపు వంటివన్నీ ఓట్లు సీట్ల ఆధారంగానే వుంటాయి.) ఆంధ్ర ప్రదేశ్‌ తెలంగాణ లలో భారీ ఎత్తున ఫిరాయింపులు జరిగిన నేపథ్యంలో యుపి అరుణాచల్‌ పరిణామాలు ఒక కనువిప్పు కావాలి. తెలంగాణలోనైతే తెలుగుదేశం,వైసీపీ ఫిరాయింపుదార్లపై మొదట చర్య తీసుకోకుండా ఉపేక్షించిన స్పీకర్‌ అలాటి వారి సంఖ్య బాగా పెరిగాక విలీనం కింద గుర్తించారు. అప్పటివరకూ కావాలనే ఉపేక్షించారు. కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించిన వారి విషయంలో ఇప్పుడు అదే ఉదాసీనత చూపిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ వైసీపీనుంచి ఫిరాయించిన వారిపై చర్య తీసుకోవడం లేదు. కనుక కేంద్ర బిజెపికి గుణపాఠంగానే గాక ఎపి తెలంగాణ సభల నిర్వహణపై అభిశంసనగానూ ఈ పరిణామాలు నిల్చిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *