కార్మికుని మృతి,వెలగపూడి ఉద్రిక్తత

05VJPG4-CAPITAL_2801240fvelaga111
వెలగపూడిలో ఆఘమేఘాల మీద సాగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో ఈ రోజు దేవేందర్‌ అనే కార్మికుడు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం విషాదకరం. ప్రమాదాలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయనేది నిజమే అయినా ప్రభుత్వ అధికార పీఠం నిర్మాణంలో అందునా అంతర్జాతీయ ప్రతిష్ట పొందిన సంస్థ ఆధ్వర్యంలో ఇలాటి ఘటనలు జరిగేపరిస్థితి రాకూడదు. పైగా గతంలోనూ ఇలాగే మరో కార్మికుడు మరణించినట్టు కార్మిక సంఘాల నాయకులు చెబుతున్న ది మరింత తీవ్రమైన విషయం. దీనిపై లోతైన విచారణ జరిపి పనివత్తిడి, పని పరిస్థితులు మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.వాటిని ప్రకటించడం కూడా చాలా అవసరం. ఎల్‌ అండ్‌ టి కార్మికులతో రోజుకు పది గంటలు పనిచేయిస్తున్నట్టు 243 నుంచి 293 వరకూ మాత్రమే వేతనం ఇస్తున్నట్టు కార్మికులు చెబుతున్నారు.హైటెక్‌ రాజ్యంలో అందునా మండువేసవిలో ఇంత వత్తిడి పనిని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా సాధారణ వేతనమే. అయితే అది కూడా ఎప్పటికప్పుడు ఇవ్వకుండా పెండింగులో పెడుతున్నట్టు ఫిర్యాదులున్నాయి. కార్మికుడు మృతి చెందిన ఘటనపై ఆందోళన చేస్తున్నందుకు వామపక్ష నేతలను అరెస్టు చేయడం అక్కడ పోలీసులను ప్రయోగించడం మరింత అభ్యంతరకరంగా వుంది. ఇలాటి విషాద ఘటన జరిగినప్పుడు సంయమనం ప్రదర్శించి తక్షణ సహాయం కోసం ముందుకు రావాలి గాని అనచివేత అసహనం పనికిరావు. రానురాను హడావుడి ఇంకా పెరుగుతుంది గనక కార్మికుల భద్రతకు కట్టుదిట్టాలు సాధ్యమైనంత ఉదారంగా వేతనాలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.రేపు ఇక్కడ ఇబ్బడిముబ్బడిగా జరిగే వాణిజ్య నిర్మాణాలలో న్యాయం జరగాలంటే ప్రభుత్వం వైపునుంచే పొరబాట్లు నిర్లక్ష్యాలు వుండకుండా చూసుకోవాలి.అప్పుడే రాజధాని సజావుగా సకాలంలో పూర్తవుతుంది. లేదంటే సంఘర్షణలు అనివార్యమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *