గూగుల్‌ సెంటర్‌ ‘క్రెడిట్‌ వార్‌’ – తెలకపల్లి రవి

ఆర్థిక క్రెడిట్‌ మొత్తం అదానీ ఖాతాకే జమ


పది రోజుల కిందట విశాఖపట్టణంలో గూగుల్‌ ఎ.ఐ డేటా సెంటర్‌ ప్రకటన, సంతకాలు జరిగినప్పటి నుంచి ఎ.పి లోనే అదో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరో విధంగా చూస్తే దేశంలో ప్రపంచంలో కూడా ఎ.ఐ డేటా సెంటర్ల గురించి, వాటి ప్రభావం గురించి విస్తారమైన చర్చ జరుగుతున్నది. ఇక ఎ.పి లో షరామామూలుగా టిడిపి, వైసిపి ల మధ్య డేటా సెంటర్‌ సాధన ఘనత ఎవరిదన్న రభస సాగుతున్నది. దీన్ని స్థాపించడం నిజంగా అసాధారణ స్థాయిలో చెప్పుకోదగిన విజయమా లేక రుద్దబడిరదా అనేది మరో చర్చ. దీనివల్ల లాభం ఎంత? ముఖ్యంగా కొత్తగా వచ్చే ఉద్యోగాలెన్ని? అనేదానిపైనా రకరకాల వాదనలు. అసలు ఇది ఎవరిదన్న ప్రశ్న కూడా ముందుకొచ్చింది. వీటికి సమాధానాలు తెలుసుకోవడం అవసరమే గాక అనివార్యం కూడా వాస్తవంగా గత ఆరేడేళ్లలో వాస్తవంగా జరిగిందేమిటో ఇప్పుడు జరుగుతున్నదేమిటో నిర్దిష్టంగా చూద్దాం.
క్రెడిట్‌ వార్‌
గూగుల్‌ ఎ.ఐ డేటా సెంటర్‌ ఘనమైందా కాదా అనేది తర్వాత. అసలు ఎవరు తెచ్చారు? చంద్రబాబు నాయుడు హయాంలో 2019 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, అదానీ గ్రూపునకూ మధ్య అవగాహన కుదిరింది. 70 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ రాబోతున్నట్టు జనవరి 9న దీనిపై చంద్రబాబు ట్వీట్‌ చేశారు. తదుపరి ఎన్నికల్లో ఓడిపోయారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో కరోనా ముగింపు దశలో అదానీ గ్రూపు మళ్లీ చర్చలు మొదలుపెట్టింది. అదానీ తాడేపల్లిలో జగన్‌ అధికార నివాసంలో చర్చలు జరిపి వెళ్లారు. 2023 మే 23న అదానీ డేటా సెంటర్‌ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ‘అదానీ బిగిన్స్‌ వర్క్‌’ అని ఇంగ్లీషు వాణిజ్య పత్రికలు కూడా వార్తలు ప్రచురించాయి. ఆ రోజున శంకుస్థాపనకు అదానీ రాలేదు. ఆయన కుమారులైన జీతూ, గౌతం అదానీలు హాజరైనారు. 21,844 కోట్ల పెట్టుబడితో సెంటర్‌ వస్తుందని 1800 మందికి ప్రత్యక్షంగా 32,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించి ఇందుకోసం 60.29 ఎకరాలు కేటాయించారు. చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందంలో కొన్ని అంశాలను తాము మార్పు చేయించామన్నారు. జగన్‌ 2024లో ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2024 డిసెంబర్‌ 5న గూగుల్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి దానిపై ఐ.టి మంత్రి లోకేశ్‌ తరచూ చెబుతూ వచ్చారు. హైదరాబాద్‌కు గూగుల్‌ రావడానికి ఇంతకాలం పడితే ఎ.పి కి ఏడాదిలోనే వచ్చేసిందన్నారు. చంద్రబాబు మైక్రోసాఫ్ట్‌ తెస్తే, లోకేశ్‌ బాబు గూగుల్‌ తెచ్చాడన్నారు. అక్టోబర్‌ 15న ఢల్లీిలో ‘భారత ఎ.ఐ శక్తి సమిట్‌’ పేరిట జరిగిన ఈవెంట్‌లో సంతకాలు ప్రకటించారు. ఈ మొత్తం సందడిలో ఎక్కడా అదానీ పేరు వినిపించలేదు. కేంద్ర రాష్ట్ర నేతల సమక్షంలో జరిగిన ఒప్పందంలోనూ అదానీ కనిపించలేదు. కానీ గూగుల్‌ క్లౌడ్‌ సిఇవో గా వున్న థామస్‌ కురియన్‌ అదానీని ముందు కలిశారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నందుకు గర్వంగా వుందని అదానీ ట్వీట్‌ చేశారు. ప్రపంచ కుబేరుల జాబితాలు ప్రకటించే ‘ఫోర్బ్స్‌’ పత్రిక అదానీ గూగుల్‌తో కలసి దీన్ని స్థాపిస్తున్నట్టు వార్త ఇచ్చింది. ‘రాయిటర్స్‌’ కూడా అదే పేర్కొంది. మరి ప్రధాని మోడీగానీ చంద్రబాబు, లోకేశ్‌లు గానీ ఈ హడావుడిలో అదానీ పేరు ఎందుకు పక్కన పెట్టినట్టు? ఆఖరుకు సర్కారును బలపర్చే మీడియా కథనాల్లోనూ ఎక్కడా ఆ పేరే రాలేదే? ఇక్కడ తామే తెచ్చామని వాదించిన వైసిపి వారు కూడా అదానీ పేరు తీసుకురాలేదు. ఈ చర్చ వచ్చాకనే చిన్న వివరణతో సరిపెట్టడానికి ప్రయత్నించారు. అప్పటికీ అదానీ కేవలం కాంట్రాక్టరు మాత్రమేనన్నట్టు కొందరు అధికార ప్రతినిధులు చెప్పుకొచ్చారు. వైసిపి విషయానికి వస్తే ఏకంగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కేవలం అదానీ వల్లనే, ఆయన సింగపూర్‌ వెళ్లి సముద్ర గర్భంలో కేబుళ్లు వేసేందుకు ఏర్పాటు చేసినందువల్లనే ఈ డేటా సెంటర్‌ సాధ్యమైందని కుండబద్దలు కొట్టి మరీ ప్రకటించారు. అదానీకి క్రెడిట్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నలు గుప్పించారు. విషయం ఏమంటే గూగుల్‌ అదానీ ఒప్పందం మోడీ చలవతో కుదిరితే రెండు ప్రాంతీయ పాలక పార్టీలు తలవంచాయన్నమాట. ఇందువల్ల ఆర్థిక క్రెడిట్‌ మొత్తం అదానీ ఖాతాకే జమ అవడం తథ్యం. గంగవరం, కృష్ణపట్టణంతో సహా ప్రతి చోటా అదానీ చొరబాటు చూస్తున్న ప్రజల స్పందనను తగ్గించేందుకే ఏలినవారు గూగుల్‌ ప్రచారానికే పరిమితమయ్యారన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *