అబ్బను దెబ్బ తీసిన అబ్బాయి!
సమాజ్ వాది పార్టీ ఎన్నికల చిహ్నం సైకిల్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గానికి దక్కడం ఆ రాష్ట్రానికే గాక దేశ రాజకీయాలకూ ఒక ముఖ్య పరిణామం. మెజార్టి ఎంఎల్‌ఎలు ఆయన వెనకే వున్నారు గనకే ఎన్నికల సంఘం(ఇసి) ఈ నిర్ణయం చేసింది. అంటే రేపటి ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి నిర్ణయాలకే విలువ పెరుగుతుంది. అధికారంలో వున్నవారికే అధిక మద్దతు వుంటుందని తెలిసికూడా పార్టీ పెద్ద ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ మరీ చివరి వరకూ లాగారు. ఎప్పటికప్పుడు ఏదో పరిష్కారమవుతున్నట్టు కనిపించినా మళ్లీ మొదటికి చేరుతూ వచ్చింది. ఈ క్రమంలో అఖిలేష్ ఎస్‌పి అద్యక్షుడుగా తనను తాను ప్రకటించుకోవడం ములాయంకు శరాఘాతం. అయితే అదే సమయంలో ఆయన చుట్టూ వున్న నిన్నటి నాయకుల మాట ప్రకారం వెళ్లడం మొదటికే మోసమని అఖిలేష్ గట్గిగా భావించారు గనకే అసలు లొంగలేదు. ఇప్పుడు ఆయనకు సైకిల్ గుర్తు రావడంతో ములాయం పోటీ పార్టీ నాయకుడుగా మిగిలాడు. ఒకప్పుడు పార్టీని చీలిపోనివ్వనని చెప్పిన ఆయన తనే దాన్ని పాటించకపోవడం విచిత్రం! అసలు ములాయం బిజెపి పట్ల మెతకవైఖరితో వున్నారు గనకే ఇదంతా చేశారని ఒక బలమైన అభిప్రాయం వుంది. కాంగ్రెస్ ఆర్జేడీ వంటిపార్టీలతో సర్దుబాట్లకు ఆయన విముఖం.ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా ఈ పరిణామంతో అఖిలేష్‌కు ఎదురు లేకుండా పోతుంది. అయితే తాను కుమారుడిపై పోటీ చేస్తానని ములాయం బెదిరించడం వాస్తవమవుతుందో లేదో చూడాలి. అదే జరిగితే అఖిలేష్ స్వతంత్రంగా వున్నారన్న మాట ఇంకా పెరుగుతుంది. అది ఈ సారి స్వంతంగా విడిగా పోటీ చేశాడనే భావన తీసుకొస్తుంది. బిజెపి కి పెద్ద అవకాశాలు లేకున్నా బిఎస్‌పి పెద్దపార్టీగా వస్తుందనే అంచనాలు ఎక్కువగా వున్న నేపథ్యంలో ఇది ఆయనకు కొంతవరకు మంచిదే అవుతుందంటున్నారు. రకరకాల ఓట్ల చీలికల మధ్య ఇతర పార్టీల మద్దతుతో అఖిలేష్ యువనాయకత్వం, నూతనత్వం వంటి నినాదాలను ముందుకు తేవచ్చు. పార్టీని ప్రక్షాళన చేశాను గనక తనను ఎన్నుకోవాలని కోరొచ్చు. ఇదంతా ఆయనకు మేలే అన్నది అంతర్గత అంచనా. అయితే ఈ రాజకీయ సమీకరణాలు ఇంకా ఎలా మారతాయో చూడాలి. ఏది ఏమైనా అధికారంలో వున్న పార్టీ నేతలైన తండ్రీ కొడుకులు ఈ స్థాయిలో వివాదపడటం ఇదే మొదటిసారి కావచ్చునేమో!