శాతకర్ణి చరిత్ర మిస్సింగ్స్‌..

బాలకృస్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రీకరణ, నటన వంటి విషయాలతో పాటు చారిత్రికమైన అసమత్రలనూ అస్పష్టతలనూ చెప్పుకోవాలి. మొదటిది అసలు శాతవాహనుల చరిత్ర వివరాలు పెద్ద స్పష్టంగా లేవు. శాత వాహన అంటే శత వాహన అనీ, శత హస్త అని అర్థం చెప్పారు గాని వాస్తవానికి అది సప్తవాహన అంటే సూర్యుడనే అర్థంలో పుట్టిందని చరిత్రకారులంటారు. గౌతమీ పుత్రుణ్ని గురించి బాగా తెలిసేది ఆయన తల్లిగారు నాసిక్‌లో వేయించిన బాలశ్రీ శాసనంగురించి. ఆ పేరు చెబితే గౌతమీ పుత్ర అన్నది కుదరదనుకున్నారేమో అసలు పట్టించుకోలేదు. ఆంధ్ర ప్రదేశ్‌ తెలంగాణ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ చిత్రాన్ని ప్రోత్సహించడమే గాక ఒక విధమైన తెలుగుదనం నింపేశారు. అయితే శాతవాహనుల మూలాలపై ఇప్పటికీ రకరకాల కథనాలున్నాయి. మహారాష్ట్ర వారనే వాదనలూ వున్నాయి గాని మొదటి వారు ఆంధ్రులు ఆంధ్ర భృత్యులు అనడంలో సందేహాలు లేవు. అనార్య రాజులుగా బయిలుదేరిన శాతవాహనుల కాలంలోనే బౌద్ధం నుంచి బ్రాహ్మణీకరణ జరిగింది. ఈ అంశాన్ని కృష్‌ చిత్రించలేదు. ఆయన తల్లి వేయించిన శాసనంలో శాతకర్ణిని ఏకపక్ష బ్రాహ్మణుడని పేర్కొంది.ఈ చిత్రంలో బహుభార్యాత్వం బహుభర్త్రత్వం వున్నట్టు సూచించే సంభాషణలు పెట్టారు.శక సంవత్సరం ఈయనతోనే మొదలైందా లేదా అనేది ఒకటైతే ఉగాదిని కూడా ప్రారంభించినట్టు చూపించారు గాని అది ఖచ్చితంగా పొసగదు. పైగా తెలుగు వారి సంవత్సరాది అయిన ఉగాదిని అంత విశాల చక్రవర్తికి అపాదించలేము కూడా . చివరలో అఖండభారతం, మొగలాయీలు ఆంగ్లేయుల దాడులు అంటూ క్రిష్‌ జోడించిన డైలాగు చారిత్రికతతో పోసగదు. ఆధునిక రాజ్యాలు ఏర్పడిన తర్వాత జరిగిన వలస ఆక్రమణలను అంతకు ముందరి యుద్ధాలను ఒకేగాట కట్టలేము. ఆ మాటకొస్తే యవనుల పేరిట గ్రీకుల మిశ్రమ జాతి కూడా దేశంలో వుండిపోయింది.అలెగ్జాండర్‌ తర్వాత వాడైన డిమిట్రస్‌ను శాతకర్ణి హతమాచ్చినట్టు చూపించారు గాని ఆయన తన స్వంత రాజ్యమైన బాక్ట్రియస్‌ వెళ్లి అక్కడే మరణించాడనే వాదన కూడా వుంది.పదే పదే యుద్ధాలు చూపించడానికి బదులు కొంతవరకైనా చరిత్ర క్రమం ఏదో రూపంలో చెబితే ప్రేక్షకులకు సౌకర్యంగా వుండేది. ఇలాటివి మరికొన్ని వున్నాయి గాని ఇప్పుడు సమయం లేదు మిత్రమా; పండుగ తర్వాత మరోసారి మాట్లాడుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *