ఖైదీ 150.. ఓకె.. చిరు ఈజ్ బ్యాకే!
ఖైదీ నెంబర్ 150 చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించడం, చిరంజీవిని తిరిగి మెగాస్టార్‌గా పున: ప్రతిప్టించడం ఖాయమే. ఆయన ,ఆ కుటుంబం ప్రధానంగా తీసుకున్న ఆ రెండు లక్ష్యాలు నెరవేరతాయి. కార్పొరేట్ల భజన చేస్తున్న కాలంలో వారి లాభర్జనా దాహాన్ని అందుకోసం మానవీయతనే బలిపెట్టడాన్ని చెప్పడం ఈ చిత్రం ప్రత్యేకత. తెలుగులో ఇంత సూటిగా కార్పొరేట్లను విమర్శించిన సందర్భాలు తక్కువ. వాటికి గ్లాబర్ పులిమినవే ఎక్కువ.పొలాలకు నీళ్లు ఎక్కువ అవసరం కాని నీళ్లున్న చోటే ఫ్యాక్టరీలు పెట్టాలనే ఆలోచన వ్యవసాయానికి దాన్ని నమ్ముకున్న రైతులకు పల్లెలకు ప్రాణం మీదకు తెస్తుందనేది కథాంశం. తమ వూరి రైతుల భూములను మోసపూరితంగా దౌర్జన్యంగా కబళిస్తున్న కార్పొరేట్‌సంస్థపై పోరాడే శంకర్ స్థానంలో -ద్విపాత్రాభినయ ఫార్ములాలో- చోటా నేరస్తుడైన కత్తి శీను రావడం వల్ల కలిగిన పరిణామాలే ఈ చిత్ర సారాంశం.మొదట డబ్బు కోసం వచ్చిన శీను శంకర్ చేసే పోరాటం గురించి తెలుసుకుని దాన్ని కొనసాగిస్తాడు. మీడియా కూడా మామూలుగా ఇలాటి సమస్యలకూ పోరాటాలకూ ప్రచారం ఇవ్వదు గనక దాన్ని ఆకర్షించడానికి ఆత్మాహుతులూ అనూహ్య సాహసాలు చేస్తారు. పట్టణాలు పల్లెలను పట్టించుకోవాలని కూడా సందేశమిస్తారు. చివరకు మీడియా న్యాయవ్యవస్థ కూడా బలపరుస్తాయి. అదీ కథ. బాస్ ఈజ్ బ్యాక్ అన్న మాటకే తగినట్టే చిరంజీవి అప్పుడు సినిమాల నుంచి ఏ దశలో విరమించుకున్నాడో అంతకంంటే ఒకింత హుషారుగా ఎనర్జటిక్‌గా చేశారు. అప్పియరన్స్‌లో గాని డాన్సులు ఫైట్లలో గాని ఏమీ తేడా కనిపించలే
దు.డాన్సుల చూస్తున్నప్పుడు మాత్రం చిరు అంటే చిరే అనుకోకుండా వుండలేం. అదో విచిత్రం. చివరలో రైతుల గురించి చెప్పిన సుదీర్ఘ డైలాగులు బాగుంటాయి. ఇవి గాక తన హీరాయిజానికి వర్తించేలా చెప్పిన పంచ్‌లు కూడా పేలతాయి. దాదాపు దశాబ్ది కాలం నటించనంతమాత్రాన చిరంజీవి డాన్సులు ఫైట్లు పంచ్‌లు కామెడీలు మాయమై పోతాయన్న సందేహం ప్రేక్షకులకు లేదు. వాటిని నిరూపించుకోవడానికి ఆయన అంత శ్రమపడాల్సిన అవసరమూ లేదు. కాని మొత్తం ఆయన చుట్టూ వున్న వ్యవస్థ మొత్తం ఆ వైపే దృష్టిపెట్టినట్టు కనిపిస్తుంది. మొదటిరోజు హాలులో చూస్తే డాన్సుల కన్నా.్త ఆయన మంచి డైలాగులు చెప్పినప్పుడే ఎక్కువ స్పందన కనిపించింది. మిగిలిన ఎవరిని గురించి చెప్పడానికేమీ లేదు. కాజల్ మూడు పాటలు మూడు సీన్లకే పరిమితం. కాని వారి రొమాన్సును పాటలకే పరిమితం చేశారు గాని అమ్ముడూ కుమ్ముడూ పాటతో అనవసరమైన విమర్శలకు అవకాశమిచ్చారు. ఇంత భారీ ప్రచారంతో తీసిన చోట సమవుజ్జీ అయిన విలన్ లేకపోవడం పెద్ద లోపం. ఇది మెగా సినిమాలు చాలా వాటిలో వుండే సమస్యే. దీటైన విలన్ వుంటే హీరోకు యాడ్ అవుతుంది. అప్పటికే ఒక భాషలో అత్యంత సంచలనం కలిగించిన సమకాలీన సమస్యాత్మక చిత్రాన్ని ఆ స్థాయిలో పునర్నిర్మించారా అఒటే చెప్పడం కష్టం. ఈ వేగయుగంలో పదేళ్లలో ఎన్నెన్నో నూతన ధోరణులు వచ్చేస్తాయని ఆయన మాస్ ఫార్ములా సృష్టికర్తలు గమనంలో పెట్టుకున్నారా అనే సందేహం కలుగుతుంది. కత్తిలో వున్నవి చాలవనుకుంటే మరిి కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించివుండొచ్చు గాని రెంటికీ ఒకే పీట వేయాలనుకోవడం వల్ల పట్టుసడలిపోయింది. చిత్ట్రం చిరంజీవి కేంద్రమై పోవడంతో సమస్య, లేదా తమిళంలో ప్రధానంగా చూపించిన మలుపులు ఇక్కడ తేలిపోయాయి. చిత్రంలో పొందిక, వేగం తగు మోతాదులో లేకుండా పోయాయి. తెలుగులో కొత్తగా ప్రవేశపెట్టిన బ్రహ్మానందం రోటీన్ పాత్ర పాత వారికి ఫర్వాలేదనిపించినా ఇప్పుడు అవుటాఫ్ డేట్. అలీ అమ్మాయి వేషం కూడా. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిరంజీవి వినాయక్‌ను అదేపనిగా పొగిడారు గాని రైతులకూ వారి తిరుగుబాటు చర్యలకూ సంబంధించిన సన్నివేశాలు శక్తివంతంగా లేకపోవడంతో చివరకు రావలసిన సంతృప్తి రాదు.లగేరహే మున్నాభాయిలో గాంధీగిరి వెనక్కుపోయి చిరుగిరి మిగిలినట్టే ఇక్కడా జరిగింది.ఆ వృద్ధాశ్రమం సీన్లు ఆ చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అది ఆయనకు ప్లస్ కావచ్చు గాని సినిమాకు మైనస్సే. నీరు నీరు నీరు రైతు కంటనీరు పాట రాగం భావం మాత్రమే గాక థీమ్ మ్యూజిక్‌గా వాడుకోవడం బాగుంది. . చిరంజీవి తిరిగిరావాలనుకున్నప్పుడు సామాజిక సందేశం కన్నా హాస్య ఫ్రధానంగా వుండాలనే కోరుకుని ఆ దిశలో చాలా కసరత్తు చేశారు. వందల కథలు విన్నారు.అయితే చివరకు ఏదో విధంగా రైతుల సమస్యను కార్పొరేట్టపై పోరాటాన్ని తీసుకోవడం మంచి విషయమే. ఇరవై ఏళ్ల కిందటే హిట్లర్ మాష్టర్ వంటి చిత్రాలు తీసిన చిరు ఇప్పుడు కుర్ర వేషాలు వేయకపోతే తనను చూడరని అనుకోవనసరం లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ చిత్రం విడుదలకు ముందు జరిగిన రాజకీయ సామాజిక చర్చలు ఇక్కడ ప్రస్తావించడం లేదు.అలాగే ఫక్తు కమర్షియల్ అని ప్రకటించుకున్న తర్వాత వేరే కొలబద్దలకు ఆస్కారం కూడా లేదు. అంతమాత్రాన మాటిమాటికీ మాస్ మాస్ అంటూ వారి అభిరుచిని తక్కువ చేయడం మంచిది కాదు.