రోహిత్‌పై మరణానంతర కులకుట్ర పూర్తి?
భరత మాత ముద్దుబిడ్డ- ఇది దేశమంతా రగిలిపోతున్నప్పుడు రోహిత్ వేముల గురించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివర్ణన. పూర్వాశ్రమంలో ప్రచారక్ గనక ఎప్పుడు ఏమనాలో ఆయనకు బాగా తెలుసు. ముద్దుబిడ్డ అనడం తప్ప ఆ బిడ్డను కన్న తల్లిని గౌరవించింది లేదు, తనకు అన్యాయం చేసిన వారిని తెలుసుకునే ప్రయత్నమూ జరగలేదు. పైగా ఆయన కులం గురించి మరణానంతర కుట్రలు జరిపి రోహిత్ దళితుడు కాదనే కథనాలు గుప్పించారు. ఆ పైన జెఎన్‌యు కన్హయ్య కుమార్ వగైరా వగైరా జరిగిపోయాయి. ఏడాది గడిచాక ఇప్పుడు రోహిత్‌పై కుట్ర పరాకాష్టకు చేరింది. తను దళితుదు కాదంటూ గుంటూరు కలెక్టర్‌తో మరో నివేదిక తెప్పించారట. అంటే సామాజిక న్యాయం కోసం పోరాడిన వారంతా తప్పు చేసినట్టు నిరూపించదలచారు. తమను వడ్డెర ఉద్యోగిని ఒకావిడ పెంచి పనిచేయించుకుని వడ్డెర కులస్తునికి ఇచ్చి చేయడం వల్ల ఆ ముద్ర వచ్చిందే గాని తాము దళితులమని తల్లి రాధిక చెప్పిన మాటలకు విలువే లేకుండా పోయింది.కులాంతర వివాహాలలో తల్లితండ్రి ఎవరి కులమైనా పిల్లలు తీసుకోవచ్చు. ఇక్కడ రోహిత్‌కు దళిత మూలాలు గుర్తిస్తే అప్పుడు హెచ్‌సియు విసి విసిఅప్పారావు, ఆయనకు సహకరించిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ,వూరికే చెలరేగిన మరో మంత్రి సృతి ఇరానీ వంటివారంతా దోషులవుతారు.వారిని కాపాడాలంటే ఆ అభాగ్య కుటుంబాన్ని అపరాధిని చేయాలి.2016 జూన్‌లో జాతీయ ఎస్‌సిఎస్‌టి కమిషన్‌కు రోహిత్ దళితుడేనని లేఖ రాసినా మరోసారి సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఈ ఒత్తిళ్ల మధ్యన గుంటూరు కలెక్టర్ కార్యాలయం కొత్త నివేదికరాయడంలో ఆశ్చర్యం ఏముంది? ఇప్పుడు జాయింట్ కలెక్టర్ మంగా వెంకటేశ్వరరావు తండ్రి కులాన్ని బట్టి తహసీల్దాఱ్ ఇచ్చిన నివేదిక ప్రకారం రోహిత్ దలితుడు కాదని లేలుస్తున్నట్టు ప్రజాశక్తి కథనం ప్రచురించింది. ఇదే సమయంలో విసి అప్పారావుకు తిరుపతి సైన్స్ కాంగ్రెస్‌లో సత్కారాలు చేయించారు. అయితే దళిత సంఘాలూ ప్రజా సంస్థలూ వామపక్షాలూ మాత్రం జనవరి17న రోహిత్ వర్ధంతిని దళిత హక్కుల దినంగా జరపాలని నిర్ణయించాయి. ఈ పోరాటం కోనసాగుతుంటుందన్నమాట.