యుపిఎ మహారాణి సోనియా గాంధీ- ఇండియన్ ఎక్స్‌ప్రెస్
ప్రధాని నరేంద్ర మోడీ చక్రవర్తిగా మారారంటూ ఫ్రంట్‌లైన్ జనవరి 5- 20 సంచికలో ఇచ్చిన కథనం గురించి చెప్పుకున్నాం. ఇక మరో దినపత్రిక న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జనవరి 8న యుపిఎ సూపర్ క్వీన్ సోనియాగాంధీ అంటూ పతాకశీర్షికన కథనం ప్రచురించింది.యతీశ్ యాదవ్ రాశారు. యుపిఎ హయాంలో ప్రధానమైన నిర్ణయాలన్నీ సోనియా గాంధీ అద్యక్షతన గల జాతీయ సలహామండలి(ఎన్‌ఎసి-నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్)కు వెళ్లేవనీ ఆమె నుంచిఉత్తరాలు వచ్చేవనీ ఈ కథనం సారాంశం. అంతేగాక ఆ కాలంలో ఏం జరిగిందో తెలియడానికి వీలుగా అన్ని విభాగాలూ అప్పటి విషయాలపై నివేదికలివ్వాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందట. కాంగ్రెస్ అద్యక్షురాలుగా యుపిఎ చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీకి వివరాలు తెలియజేయడంలో పెద్ద రాజ్యాంగ సమస్యలేమీ వుండవు. అవి అధికారికంగా ఉత్తర్వుల రూపంలో పంపితేనే సమస్య. మామూలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేముందు పాలకపక్షం చర్చించడం పరిపాటి. ఆ మాటకొస్తే మోడీతో సహా ఆయన మంత్రివర్గ సభ్యులందరూ ఆరెస్సెస్ పర్యవేక్షక కమిటీ ముందు హాజరై నివేదికలివ్వడం దేశమంతటికీ తెలుసు. ఈ తతంగం వాజ్‌పేయి హయాంలోనూ మరో విధంగా జరిగేది. సాంసృతిక సంస్థగా చెప్పుకునే ఆరెస్సెస్‌కు పాలనతో ఏం సంబంధమో బిజెపి నేతలెప్పుడూ చెప్పరు.
యుపిఎను అధికారికంగా ఏర్పాటు చేయడమే గాక లోక్‌సభలో ఆమెకు ప్రత్యేక స్థానం కూడా ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. అనధికార జోక్యాలు ఉత్తర్వులు లేదా అవినీతి వ్యవహారాలు వుంటే బయిటపెట్టవచ్చు గాని వూరికే ఎన్‌సిఎను సంప్రదించడమే నేరమైనట్టు చెప్పడం చెల్లుబాటు కాదు. ఇంతకూ ఈ జోక్యానికి ఉదాహరణలుగా యతీశ్ యాదవ్ పొందుపర్చిన సందర్భాల సాధారణ సూచనలే వున్నాయి. ఒకదాంట్లోనైతే((11018/1/2012) ఆమె ప్రభుత్వ సంస్థల సమర్థత ప్రతిపత్తి పెంచడం పేరుతో వూరికే మూత వేయడం గాక పటిష్టపర్చడంపైనా దృష్టిపెట్టాలని సూచించినట్టు వుంది. ఇప్పటి విసయాలపైనుంచి దృష్టి మరల్చడం కోసం గతానికి సంబంధించిన ఆరోపణల చుట్టూనే తిప్పాలనే ఎత్తుగడలో భాగంగానే మోడీ ప్రభుత్వం అప్పటి పరిస్థితిపై నివేదిక కోరినట్టు కనిపిస్తుంది. అయితే వాజ్‌పేjయి హయాంలోనూ ఇప్పుడూ జరుగుతున్న తతంగాలపైన కూడా అలాగే వివరాలు బయిటపెట్టడం బాగుంటుంది కదా.