రష్యాలో ఓం నమశ్శివాయ.. పాత వీడియోకు ప్రచారం- నేర్చుకోవలసిసన సారం?

రష్యా చర్చిలో ఓం నమశ్శివాయ పాడటం మన సోషల్‌ మీడియాలో వైెరల్‌ అవుతున్నది. ప్రముఖ పత్రికలు కూడా గొప్పగా ఇచ్చేస్తున్నాయి. ఈ విడియో వాస్తవానికి 2016 సెప్టెంబరు నుంచే వుంది. ఇప్పుడెందుకు హఠాత్తుగా ప్రచారంలో పెట్టారో తెలియదు. దీన్ని అతిగా ఇచ్చే వారు ఆ వివరాలు పరిశోధించడం లేదు కూడా.ఈ సమయంలో దానిపై కొన్ని భావాలు పంచుకుంటాను.
నిజానికి సంసృత భాషకు మూలంగా నిలిచిన ప్రాంతాలు రష్యన్‌ జర్మన్‌ దేశాల్లోనూ వున్నాయని పరిశోధనలు చెప్పాయి. ఇది మన ఆర్యావర్త సిద్ధాంతాన్ని బలపర్చే విషయమేమీ కాదు. సరే ఆ మౌలిక విషయాలు అలా వుంచితే శివుడు అనార్య దేవుడని పరిశోధకులు ఎప్పుడో నిర్ధారించారు. అది కూడా ఇప్పుడు నా చర్చ కాదు. వైదిక మతం అన్నది హిందూ పేరు తెచ్చుకోవడానికి చాలా కాలం పట్టింది. ఈ భక్తి విశ్వాసాలలో వినిపించే దండకాలు శ్లోకాలు చాలా లయాత్మక గుణం కలిగివుంటాయి. కాబట్టి సంగీత ప్రియులు వాటిని పాడటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇదే మొదటి సారి కాదు. కాని చారిత్రికంగా చూసినప్పుడు భారత దేశం బౌద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది తప్ప హిందూ మతం అన్నది పెద్దగా ఇతర చోట్లకు పోలేదు. దక్షిణ, ఆగేయాసియా దేశాల్లో కనిపించే హిందూ దేవాలయాలు ఒకప్పటి రాజ్యాల సరిహద్దుల ప్రకారం చేస్తే విస్తరణ కిందకు రావు. ఇస్లాం క్రైస్తవం ఆలస్యంగా మొదలైనా దేశ దేశాలకు వ్యాపించడానికి వాటి సామ్రాజ్యవాద పాలన కూడా తోడైంది. ఆ రెండు మతాలు యుద్ధాలు చేసుకున్నాయి చేసుకుంటున్నాయి కూడా. అత్యధిక జనాభా చైనాలో ఒక్క మతమంటూ లేకపోగా భారత దేశంలో అనేక మతాలుండటం వల్ల ఆ పరిస్థితి రాలేదు. సామరస్యం అధికంగానూ సంఘర్షణ పరిమితంగానూ ఈ మతాలిక్కడ నిలిచిపోయాయి. ఈ వైవిధ్య భరిత సంసృతిని అర్థం చేసుకోకుండా ఒకే దేశం ఒకే ప్రజ ఒకే మతం అన్నట్టు ఎవరు ప్రవర్తించినా . తాత్కాలిక ఆవేశాలు రావచ్చునేమో గాని ప్రజలు మాత్రం ఆమోదించరు ఇతర దేశాల్లో ఓం నమశ్శివాయ పాడారనీ యోగ చేశారని ఆనందించేప్పుడు మన దేశంలో పాతుకు పోయిన వారిని విదేశీయులుగా విజాతీయులుగా చూడటం ఎంత పొరబాటో అర్థం చేసుకోవాలి. నాగరికతల యుద్ధం పేరిట క్రూసేడ్లు జిహాద్‌లు సాగించేవారి కోవలో మనమెప్పుడూ చేరకూడదు. బౌద్ధం నుంచి ఇస్లార వరకూ అన్ని విశ్వాసాలకూ నిలయమైన విశాల భారతావని ప్రత్యేకతను గౌరవిస్తేనే ప్రజాస్వామ్యం ప్రజాజీవిన ప్రశాంతి ప్రవర్ధిల్లుతాయి. ఇది టూవే తప్ప ఒన్‌ వే ఎంతమాత్రం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *