మారిన మోడీ మాట.. మళ్లీ పేదల పాట!
నోట్లరద్దు లక్ష్యాలపై ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ మాట మార్చారు. పేదలకు అవసరమైన పథకాల కోసమే ఈ చర్య తీసుకున్నట్టు తాజాగా బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రవచించారు. ఈ మేరకు జాతీయ కార్యవర్గం ఒక తీర్మానం కూడా ఆమోదించింది. మొన్న ముగింపు ప్రసంగంలోనూ మోడీ పథకాలను ప్రకటించారు తప్ప నల్లడబ్బు ఎంత పట్టుకున్నదీ చెప్పలేకపోయారు. మొదట నల్లడబ్బు పట్టివేత, అవినీతి నిరోధం,నకిలీ నోట్టు, టెర్రరిజం అడ్డుకోవడం లక్ష్యాలన్నారు. తర్వాత నగదు రహితం. తర్వాత పథకాల మోత. ఇప్పుడు గరీబు గీతం. ద్రవ్యోల్బణం నిరోధించడం కూడా ముందు ముందు ఈ జాబితాలో చేరనుంది. లక్ష్యంలోనూ అమలులోనూ అయోమయానికి అరాచకానికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? ఇకపోతే పేదల పల్లవి కూడా కొత్తదా?
పాలకపార్టీ సమావేశంలోనైనా నోట్ల వేటుకుబలైన వారిని స్మరించుకోకపోగా ప్రజలు ఉత్సాహంగా సమర్థించినట్టు మరోసారి మాట్లాడ్డం క్రూర పరిహాసమే.తప్పనిసరై భరించడాన్ని పెద్ద సాహసంగా సమర్థనగా చెప్పుకోవడం తగని పని. పోనీ అలాగే అనుకున్నా దాని అంతిమ ఫలితం చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వం పడింది. రాష్ట్రపతి మాజీ ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్వయంగాఈ నిర్ణయం వల్ల పేదల బాధల గురించి ప్రస్తావించడం గమనించదగ్గది.అభివృద్ధి మందగిస్తుందని ఆయన హెచ్చరించగా కేంద్ర గణాంకాల శాఖ(సిఎస్‌వో) వృద్ధి రేటు 7.6 శాతం నుంచి 7.1 శాతానికి పడిపోనుందని చెప్పింది.
చివరగా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను తీసుకున్న ప్రక్రియను వెల్లడదదించేందుకు రిజర్వుబ్యాంకు నిరాకరించింది. కనీసం నిర్ణయం ఫలితాలను కూడా స్పష్టంగా చెప్పకుండా కాలయాపన చేస్తున్నది. అత్యున్నత ఆర్థిక నియంత్రణా సంస్థ పరిస్థితే ఇలా వుంటే అభాగ్య భారతీయులు మాత్రం అర్జంటుగా హైటెక్ అయిపోవాలట. డిజిటైజేషన్ క్యాష్‌లెస్ కావాలట. వినడానికే విడ్డూరంగా లేదూ?