ప్రచార పర్వంలో ఇద్దరు చంద్రులు
ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖరరావులు ఇటీవల పూర్తిగా ప్రచారంపై కేంద్రీకరించడం ఆ పార్టీల వారే విపరీతంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు లేకున్నా ఏదో విధంగా ప్రభుత్వాల పట్ల సానుకూలత పెంచుకోవడం, అంతా బాగుందనే వాతావరణం సృష్టించడం లక్ష్యంగా వారి ప్రతి అడుగూ వుంటున్నది. ఈ క్రమంలో ప్రతిపక్షాలను వీలైనంత వరకూ కట్టడి చేయడం నోరెత్తకుండా ఎదురు దాడి చేయడం అస్త్రంగా చేసుకుంటున్నారు. ఇందుకోసం కేంద్రాన్ని కూడా మంచి చేసుకోవడం ప్రధానమని భావిస్తున్నారు. జిఎష్టి,నోట్లరద్దు నేపథ్యం, ప్రధాని మోడీ కేంద్రీకృత ఏకపక్ష పోకడల రీత్యా ఎదురుతిరగడం కంటే అనుకూలతే లాభదాయకమని వారు అనుకుంటున్నారనేది స్పష్టం.
తెలంగాణ శాసనసభను ఉదారంగా పొడగించినట్టు కనిపించినా వాస్తవంలో అన్ని అంశాలనూ లఘు చర్చలుగా మార్చి చివరకు పాలక పక్ష సభ్యులతో పొడగించుకోవడం, ప్రతిపక్షాలకు సమయం వెసులుబాటు లేకుండా చేయడం, చివరకు కెసిఆర్ శైలి ధర్మోపన్యాసం ఒక పరిపాటిగా మారింది. సానుకూల ప్రతిపక్ష నేత వుండటం కూడా ప్రభుత్వానికి కలసి వచ్చిన అంశం. భూసేకరణ చట్టమో సవరణో తెలియనంత అయోమయాన్ని కూడా అధికార పక్షం అధిగమించగలిగింది. అదే సమయంలో హైకోర్టు 123 జీవో కింద సేకరణ చెల్లదని ప్రకటించినా స్పందన లేకపోయింది. చెప్పాలంటే అంతా అధినేత కనుసన్నల్లో జరిగిపోతున్నది.అన్నీ చర్చించినట్టే వుంటుంది గాని అంతస్సారం మాత్రం అనుకూల ప్రచారమే.
ఇక ఆంధ్ర ప్రదేశ్లోనైతే గతంలోనే చెప్పుకున్నట్టుగా ప్రత్యేక హౌదా పోయి ప్రత్యేక ప్యాకేజీ పోయి పోలవరంకు అత్యంత పాక్షిక కేటాయింపులనే మహత్తర విజయంగా చిత్రిస్తున్నారు.మరో వంక ఆ పోలవరం కన్నా పురుషోత్తమ పట్నం ఎత్తిపోతలను ముందుకు తెచ్చి కాంట్రాక్టర్లకు పని కల్పించుతున్నారు. పైకి చూస్తే ఇది ఉత్తరాంధ్ర ప్రజలను సంతృప్తిపర్చే ప్రయత్నం అనిపిస్తున్నా అంతకన్నా ఆర్థిక కారణాలే అధిక ప్రభావం చూపిస్తున్నాయి. అమరావతిలో భూసేకరణకు సంబంధించి గ్రామాలనూ ఇళ్లనూ కూడా తీసేసుకుంటూ మరోవైపున విదేశీ యాత్రలు పున:ప్రారంభిస్తున్నారు. విస్త్రతంగా పర్యటిస్తూ పథకాలపైనా మోత మోగిస్తున్నారు. వామపక్షాల నాయకులనూ కార్యకర్తలనూ అరెస్టులు చేస్తూ వైసీపీ ఎంఎల్ఎలను కూడా మాట్లాడకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఇదంతా చూస్గుంటే ఎన్నికల ప్రచారం ముందే మొదలైనట్టు వుందని రాజకీయ వర్గాలు అంలున్నాయి. నిజానికి సర్వేలలో అభిప్రాయ సేకరణలో అంత అనుకూలత లేనందుకే హడావుడి పెంచారని మరో మాట వినిపిస్తుంది. ఉన్నతాధికారులు మాత్రం ప్రచారమే ప్రధానమై పనులు చేసుకోవడానికి సమయం చాలడం లేదని వాపోతున్నారు.