మారిన ప్లాన్లు-ఉడుకుతున్న వూళ్లు
అమరావతిలో భూ సేకరణకు సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే విడుదల చేసిన నోటిఫికేషన్ వూళ్లకూ ఇళ్లకూ కూడా ఎసరు పెట్టడం తీవ్ర నిరసనకు దారి తీస్తున్నట్టు సమాచారం. బలవంతంగా ఒక్క ఎకరా కూడా తీసుకోబోమని వూళ్లకూ ఇళ్లకూ గ్రామ కంఠాలకూ ముప్పులేదని చెప్పిన ప్రభుత్వం మాట తప్పుతున్న తీరుకు ఈ నోటిఫికేషన్ నిదర్శనంగా వుంది. అబ్బురాజుపాలెం, బోరుపాలెం,ఐనవోలు,కృష్ణాయపాలెం గ్రామాల్లో సమీకరణకు ఇవ్వని భూములే గాక రోడ్డకు అడ్డం పేరిట గ్రామ కంఠాలు గొడ్లపాకలు బారన్లు, ఇండ్లు కూడా ఈ సేకరణ జాబితాలో ప్రకటించినట్టు ప్రజాశక్తి వివరంగా కథనం ఇచ్చింది. దీంతోపాటే ఆ గ్రామాలలో పర్యటించి ప్రజల భావోద్వేగాలు స్పందనలు పేర్కొంది. క్రిడా భూములనే గాక గ్రామాలనే స్వాధీనం చేసుకోవడం పట్ల వారిలో ఆగ్రహావేదనలు వ్యక్తం అవుతున్నాయి.ఐనవోలులో 43 ఇళ్లను తొలగించేస్తున్నారట. అర్టీలియర్ రోడ్డు గ్రామం మధ్యగా వెళుతుంది గనక తప్పక తీసుకోవలసిందేనని అధికారుల వాదనగా వుంది.గతంలో ఇళ్లను తీసుకోబోమన్న మంత్రి నారాయణ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేశారని సర్పంచి జ్ఞానానందం ప్రశ్నిస్తున్నారు. అప్పుడు చూపిన ప్లాను వేరు ఇప్పుడు చెబుతున్నది వేరు అని వారంటున్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకగా ఎండ్రిన్ ఇస్తే తాగి ప్రాణత్యాగం చేస్తామని మేరి ఆవేదనవ్యక్తం చేశారంటే పరిస్థితి తెలుస్తుంది. అప్పుడు పొలాలు ఇళ్లు స్థలాలు ఏవైనా తీసుకోవచ్చని ఆమె అన్నారు. పొలాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు కూడా పోలీసులు వచ్చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
మొదట పొలాలు ఇవ్వడమే తప్పనికూడా చాలా మంది వ్యాఖ్యానించడం పెరుగుతున్న నిరసనకు అద్దం పడుతుంది. అబ్బురాజువారిపాలెంలో దాదాపు పది ఎకరాలు, ఐనవోలులో 13 ఎకరాలు, బోరుపాలెంలో 34 ఎకరాలు, కృష్ణాయపాలెంలో 29 ఎకరాలు సేకరిస్తామని చెబుతున్నా ఇవన్నీ ఇళ్లనూ గ్రామ కంఠాలను ఆక్రమించేవిగా వుండటం గమనార్హమంటున్నారు. అధికారులు వస్తే కొట్టిపంపిస్తామని కూడా కొందరు ఆవేశం వ్యక్తం చేశారట. మరికొంతమంది కోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ముందముందు ఇంకా నిడమర్రు,నవులూరు,బేతపూడి గ్రామాలలోనూ ఇళ్లను తొలగించే అవకాశం వున్నట్టు చెబుతున్నారు.