శశికళ చాలదని తేల్చిన ‘హిందూ’
ముఖ్యమంత్రి కావడం ఎప్పుడనేదే సమస్య. లోక్‌సభ ఉపసభాపతి తంబిదురై ప్రత్యేకంగా ప్రకటన చేయడమే అందుకు సంకేతం. గతంలో ముఖ్యమంత్రి పదవికి సంబంధించి వినిపించిన పేర్లలో ఆయనదీ వుంది. మరొకరు ప్రస్తుతం గద్దెపై వున్న ఓ.పన్నీరు సెల్వం. శశికళ పార్టీ నాయకత్వం చేపట్టిన తర్వాత సెల్వంను ముఖ్యమంత్రిగా కూడా ప్రస్తావించడం లేదట.ఆయన పేరు పోస్టర్లలో పార్టీ కోశాధికారిగా మాత్రమే వేస్తున్నారు. శశికళ జయ సమాధిని సందర్శించిన సందర్భంలో విడుదల చేసిన వార్తలోనూ ఆయన ఆ బృందంలో వున్నట్టు పేర్కొనలేదు. పార్టీ నాయకత్వం ప్రభుత్వ సారథ్యం ఒకరి చేతిలో వుంటేనే పనులు జరుగుతాయని తంబ్‌ిదురై విచిత్రమైన తర్కం తీసుకొచ్చారు.సెల్వం కూడా దాన్ని బలపరుస్తున్నారట. ఇంకా అనేక మంది మంత్రులు కూడా శశికళ ను తక్షణం ముఖ్యమంత్రిని చేయాలనే ప్రచారం నడిపిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే తమిళనాడుతో బాగా ముడిపడిన జాతీయ పత్రిక హిందూ శశికళ ఆ పదవికి సరిపోరని బాహాటంగా వ్యాఖ్యానించింది. రాజకీయమైన సంక్లిష్టతలను శశి తట్టుకోలేరని కూడా హిందూ రాసింది. అయితే అంతిమంగా ఆమెను గద్దెపై కూచోబెట్టడం వైపే పరిణామాలు నడుస్తున్నాయి. వారసత్వ రాజకీయాలకు అలవాటైన ఈ దేశంలో అది కూడా లేకుండా కేవలం మరణించిన నేతకు నేస్తం గనకనే ఒకరిని ముఖ్యమంత్రిని చేయడం ఇదే ప్రథమం కావచ్చు. అంతకంతకూ దిగజారుతున్న విలువలకు ఇదో నిదర్శనం. ఎవరు పైనుంటే వారినే కాకాపట్టి పనులు జరిపించుకునే బాపతు ఎంఎల్‌ఎలకు జయలలితకూ శశికళకూ ఆట్టే తేడా వుండదు కదా!