మత రాజకీయం కూడా అవినీతే :హిందూత్వపై సంచలన తీర్పు

చాలా ఏళ్ల తర్వాత మత రాజకీయాలకు సంబంధించి సుప్రీం కోర్టు ఒక కీలక తీర్పు నిచ్చింది. ఓట్ల కోసం కుల మతాల ప్రచారానికి పాల్పడరాదని తేల్చి చెప్పింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 123(3) నిబంధన చెబుతున్న ప్రకారం ఎవరైననా మతాన్ని లేదా కులాన్ని ఉపయోగించి ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తే అది చెల్లుబాటు కాదని మెజార్టి తీర్పు వెలువరించింది.20 ఏళ్ల కిందట 1995లో హిందూత్వ ఒక జీవన విధానమే గాని మతం కాదని ఇచ్చిన తీర్పును ఈ విధంగా పునస్సమీక్షించి కొత్త నిర్ధారణ వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి ఠాగూర్‌, లావు నాగేశ్వరరావు, లోకూర్‌, బడ్డేలు ఈ తీర్పును వెలువరించారు. కాగా వివి లలిత్‌, ఎకెగోయెల్‌,డివైచంద్రచూడ్‌లు తమ మైనార్టి తీర్పులో దీంతో విభేదించారు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలనే దెబ్బతీస్తుందని ఎవరైనా సరే నిజమైన తమ సమస్యల ఆధారంగా ఓట్లు అడగొచ్చని వారు అభిప్రాయపడ్డారు. కేవలం అభ్యర్థి మాత్రమే గాక వారి తరపున ప్రచారం చేసేవారు, ఓటర్లు ఏజంట్లు ఎవరైనా మతం కులం ప్రాతిపదికగా తీసుకోరాదని మెజార్జి తీర్పు స్పష్టం చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్‌లో అయోధ్య ఆలయ వివాదం, పంజాబ్‌లో స్వర్ణదేవాలయ సమస్య లేవనెత్తాలని చూస్తున్న బిజెపికి అకాలీదళ్‌కు ఇది పెద్ద సమస్యగా మారనుంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఈ తీర్పుపై విమర్శలు ప్రారంభమైనాయి. హిందూత్వ కోణాన్ని పక్కనపెట్టి తెలివిగా దళితులు కులం పేరిట ఓట్లు అడగడం గురించే ఆ వ్యాసాలు ప్రస్తావిస్తున్నాయి. సామాజిక న్యాయం కోసం పోరాడటానికి కుల మతాలను ప్రచారాయుధాలుగా వాడుకోవడానికి మధ్య చాలా తేడా వుంది. రాజకీయ పార్టీలు లౌకిక సూత్రాన్ని అనుసరించాలి గాని మతకుల ప్రచారాలకు పాల్పడరాదని సుప్రీం కోర్టు చెప్పింది ముమ్మాటికి రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా వుంది. మతం పేరిట ఓట్లడగడం కూడా రాజకీయ అవినీతి కిందకే వస్తుందని ఈ తీర్పులో కోర్టు స్పష్టం చేసింది. అయితే రెండు మూడు దశాబ్దాలుగా మత రాజకీయాలకూ మత కలహాలకు పేరు మోసిన బిజెపి వంటిపార్టీలు ఈ తీర్పుపై దాడికి సిద్ధమవుతున్నాయి. ఈ తీర్పువెలువరించిన చీప్‌ జస్టిస్‌ ఠాగూర్‌ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *