ములాయం చర్య ఆత్మహత్యా సదృశం
కుమారుడు, యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను ఆరేళ్లపాటు సమాజ్‌వాది పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటించడం ఆత్మహత్యాసదృశం. భారత రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ కలహాలు కొత్త గాకున్నా ఈ విధంగా కుమారుడినే తొలగించడం జరిగివుండదు. ప్రధాని నరేంద్రమోడీ మరో సారి ఎన్నిక కావడానికి ప్రాణావసరంగా వున్న యుపి ఎన్నికల దృశ్యం గజిబిజికావడానికి తద్వారా బిజెపికి దోహదం చేయడానికి ములాయం చర్య ఉపయోగపడుతుంది. అయితే అంతమాత్రాన బిజెపి గెలుస్తుందని చెప్పడానికి లేదు. మాయావతి బిఎస్‌పి కే అత్యధిక విజయవావకాశాలున్నాయని పరిశీలకులు మీడియా విశ్లేషకులు చెబుతున్నారు. ఎస్‌పి ఓట్ల చీలిక ఆ అవకాశాలు ఇంకా పెంచొచ్చు. తండ్రి ఏకపక్షంగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాకు పోటీగా తనూ ఒక జాబితా ప్రకటించడం
ద్వారా అఖిలేష్ బహిరంగంగానే తిరుగుబాటు చేశారు. ఎస్‌పికి గతంలో వున్న చెడ్డపేరును చెరిపేసి యువతనూ మధ్యతరగతిని ఆకర్షించేందుకు అఖిలేష్ గట్టి ప్రయత్నం చేశారని ఒక అభిప్రాయం. యాదవ్ బిజి ముస్లిం ఓట్లతో పాటు ఇతరులనూ ఆకట్టుకోకపోతే భవిష్యత్తులో కష్టమని ముఖ్యమంత్రి భావించారు. ఒక మేరకు ఆయన ప్రయత్నాలు ఫలించాయి కూడా. అయితే ఈ క్రమంలో తన కుడిభుజాల వంటివారిని అఖిలేష్ పక్కనపెట్టారని అలిగిన ములాయం తమ్ముడు శివరాజ్‌యాదవ్‌నూ,గతంలో వెళ్లగొట్టిన అమర్‌సింగ్ వంటివారిని తిరిగి తీసుకొచ్చారు.వూడగొట్టిన నాగటిదుంపల వంటి వీరివల్ల ప్రయోజనం లేదనేది అఖిలేష్ వాదన. ఈ తర్జనభర్జనలు బహిరంగ యుద్దంగా మారతాయని ఎవరూ అనుకోలేదు. వచ్చినా సద్దుమణుగుతాయనే అనుకున్నారు. కాని జరిగింది అందుకు భిన్నం. ఇదంతా వారి నాటకమేనని అనేవారూ వున్నారు.కర్ణాటకలో దేవగౌడ కుమారస్వామి విభేదించినట్టు ప్రకటించినా కలిసే కొనసాగారని వారు గుర్తు చేస్తున్నారు.అయితే బహిరంగంగా బహిష్కరణలు జరిగాక సర్దుకున్నా విశ్వసనీయత వుండదు. ఏతావాతా ఇది బిఎస్‌పి బిజెపిలలో ఎవరికి మేలు చేస్తుందో చూడాలి.
రాజకీయ జీవితం చివరి దశలో తన వారసత్వాన్ని ఇంతగా భ్రష్టుపట్టించుకున్నవారు ములాయం తప్ప మరెవరూ లేరు. గతంలోనూ జాతీయంగా వాజ్‌పేయి మొదటి ప్రభుత్వ పతనం సమయంలోనూ, మన్మోహన్‌సింగ్ ప్రభుత్వ అణుఒప్పందం సందర్భంలోనూ ప్లేటు ఫిరాయించిన ములాయం అవకాశవాదానికి పేరు మోశారు. ఇప్పుడు కూడా ఆయన బిజెపి పట్ల మెతకవైఖరితో ఇవన్నీ చేస్తున్నారనే భావన వుంది. ఇప్పుడు ఆయనకు వున్న అవకాశాలు కూడా చాలా పరిమితం కాగా వాటిని తన చేతులారా తానే పాడుచేసుకున్నట్టు అర్థమవుతుంది.