పోలవరం ‘ ప్రత్యేక ‘పొగడ్తల రహస్యం
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంలో కాంక్రీటు పనులు ప్రారంభించడం సంతోషమే. ఇందుకు గాను 1981 కోట్లు నాబార్డు రుణం మంజూరు చేయించిన కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పడం కూడా సహజమే. అయితే అక్కడితో ఆగక ఆయన ప్రధాని మోడీని శ్రుతిమించిన పొగడ్తలలో ముంచెత్తారు. పోలవరం నిర్మాణంలో మునిగిపోయే ఏడు మండలాలు కలపకపోతే ప్రమాణస్వీకారం చేసినా లాభం లేదని తను ఒత్తిడి తెచ్చానని, వారు ప్రత్యేకంగా కలిపారని వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు దీనిపై ఆందోళనతో వున్న సమయంలో ఈ విధంగా మాట్లాడ్డం అర్థరహితమే గాక అవసరం లేని వ్యవహారం. ఒక విధంగా చెప్పాలంటే రాజధాని అమరావతిని మించి రాష్ట్రమంటే పోలవరమే అన్న భావన కలిగించేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నిస్తున్నది. (కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లిఅరుణ్ కుమార్ పుస్తకంలోనూ ఈ ధోరణి వుంటుంది) ఆ ఒక్క అంశం కోసం ప్రమాణస్వీకారమే మానేస్తానన్నట్టు చెప్పడమంటే మిగతా అంశాలనూ ప్రాంతాలనూ విస్మరించినట్టవుతుందనే సృహ కూడా లోపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కొన్నిజిల్లాల్లో తన ఓట్లనూ సీట్లనూ పదిలపర్చుకోవడమే చంద్రబాబు ప్రాధాన్యతా అనిపిస్తుంది.
ఇంతా చేసి పోలవరంకు ఇవ్వాల్సిన దానిలో కొంతభాగం అది కూడా నాబార్డు రుణంగా ఇచ్చారు. క్రికెట్ మ్యాచ్ ప్రైజ్‌మనీ లేదా లాటరీ టికెట్ తరహాలో తీసుకున్న భారీ చెక్కుపై 2480 కోట్లుగా పేర్కొనడం చాలామంది గమనించారు. మొన్న చెప్పుకున్నట్టు మహారాష్ట్ర గుజరాత్‌ల మొత్తం కూడా కలిపినసంఖ్య ఇది. అదలా వుంచితే 2018 నాటికి ప్రాజెక్టు పూర్తిచేసి 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీటి విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించింది సాధ్యమేనా? 42 వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందని రాష్ట్రం ప్రభుత్వం చెబుతున్న అంచనాను కేంద్రం ఆమోదించలేదు. వారు ఇస్తామన్న 16 వేల కోట్లకు మించి ఇచ్చే సూచనలూ లేవు. అదైనా దశలవారీగా పెట్టిన ఖర్చుల లెక్కలు ఇస్తేనే. పునరావాసానికి దాదాపు 20 వేల కోట్లు కావాలి. ఆ విధంగా చూస్తే హెడ్‌వర్క్స్ వ్యయం మూడో వంతు మాత్రమే. ఇప్పుడున్న నిధులతో క్యాఫర్‌డాం, పాక్షికంగా స్పిల్‌వే పనులు చేశామనిపించుకుని ఎన్నికలకు వెళ్లాలనేది టిడిపి ఆలోచన కావచ్చు. అంటే అరకొరగా తప్ప సమగ్రంగా చేసే అవకాశం లేకున్నా ప్రత్కేక హౌదా/ ప్రత్యేక ప్యాకేజీల నుంచి దృష్టి మరల్చడానికే ఈ ప్రత్యేక పొగడ్డల ప్రహసనం తలపెట్టినట్టు స్పస్టం అవుతుంది. మరోవైపున మాజీ ఐఎఎస్ అధికారి శర్మ వంటివారు ఒక్కసారిగా 16 వేల కోట్ల నుంచి 42 వేల కోట్లకు ఎలా పెరిగిందనీ ప్రశ్నిస్తున్నారు. ఇంతా చేసి కడుతున్న వారు వైఎస్ హయాంలోని కాంట్రాక్టర్లే. ఉపయోగిస్తున్నది అప్పుడు తవ్విన కాలువలే! మిగిలిన తప్పులు ఆరోపణలు ఎన్ని వున్నా ఇందుకోసం గత ప్రభుత్వాలను ప్రస్తావించడానికి టిడిపి సిద్ధంగా లేదు. పైగా మోడీని ఇంతగా పొగుడుతున్న వారు జాతీయ ప్రాజెక్టు హౌదాను చట్టంలో చేర్చిన యుపిఎను కాంగ్రెస్‌ను తీసిపారేస్తున్నారు. ప్రత్యేక హౌదాను చట్టంలో చేర్చకపోవడం గత ప్రభుత్వ తప్పిదమని తిట్టిపోసే వారు చట్టంలో పెట్టిన విషయానికి కూడా తప్పు పట్టడం దేనికి? ఏదో విధంగా బిజెపిని పొగుడుతూ కాంగ్రెస్‌ను విమర్శించడం రాజకీయం తప్ప పాలనా సూత్రం కాదు.కాని కాంగ్రెస్‌నుంచి వచ్చి చేరిన ఎంపిలు కమ్ కాంట్రాక్టర్లు మాత్రం మహారాజులా కొనసాగుతున్నారు.అదే రాజకీయ విచిత్రం.