ఎన్నెన్నో పాఠాల ఏడాది!
2016 వ సంవత్సరం మొదటివారం నేను వారణాసిలో వున్నాను. అప్పుడే రోహిత్ వేముల మరణం మహారణంగా మారుతున్న స్థితి. అంతకు ముందే వున్న విద్వేష వాతావరణం విశ్వవిద్యాలయాల్లోకి విస్తరించడం ఎంతైనా ఆందోళన ఆగ్రహం కలిగించిన పరిస్థితి. దానిపై మానవీయ స్పందన కన్నా ఎదురుదాడితోనే కేంద్ర పాలకులు హెచ్‌సియు నిర్వాహకులు వివాదం పెంచుతుంటే అప్పటి కేంద్రమంత్రి సృతి ఇరానీ కూడా తన వంతు ఆజ్యం పోశారు. ఈలోగానే జెఎన్‌యులో జాతివ్యతిరేక నినాదాలిచ్చారంటూ మరో వివాదం రగిలింది. ఆ క్రమంలో విద్యార్థి సంఘ అద్యక్షుడైన కన్నయ్యకుమార్ తదితరులను అరెస్టు చేయడం, ఆ నిరసనలు దేశమంతా విస్తరించడం ఒక కొత్త సంచలనం. ప్రతివారి దేశభక్తికి మరెవరో ఆమోదపత్రాలు అందించాలనే ధోరణి ప్రబలింది. మరోవైపున గోరక్షణ పేరిట మానవ హత్యలు. దేశంలో రాజకీయ చర్చ కాస్తా కృత్రిమ వివాదాలు మత జాతి తగాదాల మయంగామార్చివేయబడింది. ఈ వూపులో బీహార్ ఎన్నికల ఓటమి మోడీ నాయకత్వానికి పెద్ద ఎదురు దెబ్బగా మారింది. తర్వాత కాశ్మీర్‌లో పిడిపితో కలసి అధికారానికి వచ్చినా తక్కిన దేశంలోని విద్యార్థి అశాంతి అక్కడికీ దిగుమతి కావడంతో పరిస్థితి క్షీణించడం మొదలుపెట్టింది. తర్వాత కాలంలో ఇది కర్ఫ్యూలకూ ఆ పైన ఉగ్రవాద చర్యలకూ దారి తీసింది. ఇలాటి దశలోనైనా వివాదాలను పక్కనపెట్టే బడులు కేంద్రం పార్లమెంటు సాక్షిగా వాటిని పెంచే వ్యూహమే అనుసరించింది. అప్పట్లో సృతి ఇరానీని గొప్పగా నెత్తికెత్తుకున్న వారే తర్వాత హఠాత్తుగా ఆ శాఖ నుంచి తప్పించారు. తర్వాత ఈ విద్యాసంస్థలన్నిటా వామపక్ష ప్రగతిశీల సంఘాలే విజయాలు సాధించాయి. అయినా ఇప్పుడు జెఎన్‌యులో సస్పెన్షన్లతో ఏడాదిని ముగిస్తున్నారు ఏలికలు. మొత్తంపైన స్వచ్చ భారత్ కక్ష భారత్‌గా పరివర్తన చెందిన ఈ ఏడాది దేశచరిత్రకు కొత్త హెచ్చరికలు చేసిందనే చెప్పాలి. అమెరికాలోనూ ట్రంప్ దొరగారు విజయం సాధించిన తర్వాత దీని ప్రభావం మనకు మరింత అవగతమవడమే గాక భారతీయులను ఎక్కడ వెనక్కు పంపేస్తారో అని బిక్చుబిక్కుమంటూ చూడవలసిన దురవస్థ. ఆ అమెరికాతో అంటకాగితేనే అపార ప్రయోజనాలు ఒనగూడుతాయనే అవాస్తవ ప్రచారాలతో అటే మొగ్గుతున్న అధికార వ్యవస్థ అనర్థక విధానాల కొనసాగింపు.
రాజకీయంగా మన ప్రజాస్వామ్యం పునాదులు పార్టీల వ్యవస్థలు ఎంత దుర్బలమైనవో కూడా ఈ ఏడాది కళ్లకు కట్టింది. ప్రాంతీయ పార్టీలు వాటి ప్రభుత్వాలు ఏక పక్ష ఏకవ్యక్తి పోకడలకు ఆలవాలమైనాయి. ఈ క్రమంలో ఎవరు అధికారం చేజిక్కించుకుంటే వారే సర్వం శాసించే వికృత పరిస్థితి. తనే కేసులూ శిక్షలను అధిగమించి అధికారం మళ్లీ గెలుచుకున్న జయలలిత అస్వస్తత నుంచి ఆఖరి క్షణాల వరకూ అంతా నిగూఢంగానే నడిచిపోయింది. ఇప్పుడు మెరీనా బీచ్‌లో శాశ్వత విశ్రాంతి తీసుకుంటున్న ఆమె మృతదేహాన్ని తీసి పరీక్షించాలా అని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమే ప్రశ్నిస్తుంటే మరోవైపున ఆమె నెచ్చెలి శశికళ అన్నాడిఎంకె పగ్గాలు చేపట్టి అధికార పీఠంపైనా కన్నేసి వుంచారు. ఇక దేశానికే పెద్దదైన ఉత్తర ప్రదేశ్‌లోనైతే తంద్రీ కొడుకుల మధ్య బాబాయి/తమ్ముడు ప్రవేశించడం రాజకీయాలనే మార్చివేసేంత ప్రభావం చూపిస్తున్నది. ఇప్పుడు పెద్దాయన ములాయం సింగ్ తమ ఎస్‌పి పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుంటే ముఖ్యమంత్రి అఖిలేష్ స్థానమేమిటో తెలియకుండా పోయింది. అక్కడ గెలిస్తే తప్ప దేశం మిగలదని బిజెపి ఈ ఇద్దరి మధ్యన తనకే అవకాశమని మాయావతి పోటీ పడుతున్నారు.. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్న కేంద్రం దాని ఉనికినే హాస్యాస్పదంగా మార్చేసింది. రాస్ట్రాల ఆదాయాలపై విపరీత ప్రభావం చూపే జిఎస్‌టి బిల్లును కేంద్రం ఎలాగో ఆమోదింపచేసుకున్నా సమస్యలు వెంటాడుతూనే వున్నాయి.ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన నీటి ఆయోగ్ ప్రతిపాదనలు కేంద్రం పోకడలు అసలు రాష్ట్రాల అధికారాలనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేకహౌదా నిధుల విడుదలతో సహా అన్నిటినీ తిరస్కరించిన కేంద్రం ఏదో ప్యాకేజీ ప్రహసనం నడిపిస్తుంటే అదే ప్రసాదమని తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం హౌరెత్తిస్తున్నారు. తెలంగాణ విషయంలోనూ పెద్ద స్పందన చూపించకపోయినా ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం మోడీని మంచి చేసుకోవడానికే పాకులాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రతిపక్షాల ఉనికిని సహించలేని ఏకపక్ష ధోరణి, కుటుంబ సభ్యులే చక్రధారులనే పోకడ స్తిరపడిపోయాయి. కేంద్రం నుంచి సాధించుకోవాలనే గత వారసత్వం పోయి రాజకీయ ఆర్థిక లావాదేవీలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రజా ఉద్యమాలపై దాడి, వామపక్షాలపై అసహనం వీటి ఉమ్మడి లక్షణంగా మార్చుకుంటున్నారు. నూట ముప్పయేళ్ల కాంగ్రెస్ రాహుల్ ఎప్పుడు రాటుదేలతాడా అని చూస్తుంటే బిజెపి వాళ్లనే దోషులుగా చూపుతూ తన ఘోరాలు కప్పిపుచ్చుకుంటున్నది. ఈ మధ్యలో మమతా బెనర్జీ , అరవింద్ కేజ్రీవాల్ నితిష్ కుమార్ వంటి వారు తమ తమ ఆశల్లోతాము మునిగితేలుతున్నారు.
కమ్యూనిస్టుల విషయంలోనూ అనేక ఆటుపోట్టు. పశ్చిమ బెంగాల్‌లో రెండోసారి ఘోర పరాజయం సిపిఎంకు వామపక్షాలకు పెద్ద దెబ్బ కాగా కేరళలో బలమైన ఎల్‌డిఎప్ ప్రభుత్వ పునరాగమనం ఒక విజయం. ప్రజా పునాదిని విస్తరించుకుంటూ కాలానుగుణమైన కర్తవ్యాలతో ముందుకుపోవాలని కమ్యూనిస్టులు తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యమాభిమానుల్లో సానుకూల స్పందన.దానికి తగినట్టే దేశంలో మతతత్వ వివాదాలు అప్రజాస్వామిక పోకడలు పెరగడంతో వామపక్ష లౌకిక శక్తులవైపు చూడవలసిన స్థితి.హెచ్‌సియు జెఎన్‌యులతో మొదలైన అలజడి లాల్ నీల్ కలయికగా రూపొందుతున్న విలక్షణ పరిణామం. తెలుగు రాష్ట్రాల్లోనూే శ్రుతిమించుతున్న మార్కెట్ మత్తులూ , వాస్తు విన్యాసాలు సాధుసంతుల ప్రాబల్యాలు భక్తులైన వారు కూడా భరించలేని వాస్తవ దృశ్యం. ప్రజలపై ముఖ్యంగా శ్రమజీవులు రైతులు మహిళలపై అణగారిన తరగతులపై రకరకాల దాడులు పెరుగుతుంటే ఉనికి కోసం పోరాడాల్సిన అనివార్యత. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశ విదేశీ కార్పొరేటీశ్వరులు హమ్ జియో తుమ్ మరో అన్నట్టు చెలరేగిపోతూంటే సగటు మనుషులు సమస్యల సుడిగుండంలో ఉక్కిరి బిక్కిరవుతున్న దశ. చితికిపోతున్న వ్యవసాయం కోలుకునే సూచనలు లేకపోగా చేతి వృత్తులూ రోజు వారి కార్మికుల జీవితాలు మరింత దిగజారిన దృశ్యం. ఉద్యోగులు ఉద్యోగ భద్రత హుళక్కిగా మారుస్తూ కాంట్రాక్టులు ఔట్‌సోర్సింగులే నిత్యకృత్యమవుతున్న అభద్ర భారతం. అందరూ ఆశ్రయించే న్యాయవ్యవస్థ విషయంలోనూ దుందుడుకు పోకడలు రచ్చకెక్కిన వైపరీత్యం. నిఘాసంస్థల నుంచి కళా సాంసృతిక కేంద్రాల వరకూ అన్నిటినీ అధికారపక్షాలే గుప్పిటచిక్కించుకుంటున్న వైనం.
ఏడాది ఆఖరున ఏకపక్షంగా ప్రధాని ప్రకటించిన నోట్లరద్దు ప్రహసనం దీనంతటికీ పరాకాష్ట. ఎక్కడా ఎలాటి సూచనైనా లేకుండా కోట్లమంది జీవితాలను అతలాకుతలం చేసిన అరాచక నిర్ణయం. ఎన్నికల్లో చెప్పినట్టు ఒకో ఖాతాకు పదిహేను లక్షలు వేయకపోయినా వున్న సొమ్ములు కూడా ఉపయోగించుకోకుండా చేసిన ఈ నిర్ణయం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఎరుగని అఘాయిత్యం. ఎటిఎంలలోనూ బ్యాంకుల ముంగిట పడిగాపులు పడలేక వందలమంది మరణిస్తుంటే సామాన్యులు సంతోషిస్తున్నారని ప్రకటించడం ఒక మాయని మచ్చ. దేశందాటిన లేదా దేశంలోనే మూల్గుతున్న అపార సంపదలను అంటుకోకుండా అమాయకులైన ప్రజలను సమిధలుగా చేసిన ఈ నోట్ల యజ్ఞంలో అరవై సార్లు అస్తవ్యస్త వుత్తర్వులిచ్చిన సర్కాకు వచ్చే ఏడాదిలోనూ మరిన్ని చాటుదెబ్బలు తీయడానికి పొంచి వుంది తస్మాత్ జాగ్రత్త అనేది కరిగిపోతున్న ఏడాది మనకు నేర్పిన అతి పెద్ద పాఠం. నేర్చుకుందాం. ప్రజాస్వామ్య లౌకిక విలువలనూ ప్రజల కనీస మనుగడనైనా కాపాడుకుందాం. అలాటి సమరశీల సన్నద్ధతతో 2017లో ప్రవేశిద్దాం. వ్యర్థ నినాదాలు వదలి అర్థవంతమైన ఆచరణకు అడుగులేద్దాం. . క్రీడా సాంసృతిక సాంకేతిక రంగాలలో మన వాళ్లుసాధించిన విజయాలను కూడా అభినందిస్తూ మరింత ముందంజవేయాలని ఆకాంక్షిద్దాం. ఎందుకంటే కాలం ఒక సవాలైతే కాలమే ఒక జవాబు.
గమనం, ఎడిట్‌పేజి,ఆంధ్రజ్యోతి,30.1.16