అమరావతిలో ‘సమీకరణ’ నుంచి ‘సమాప్తం’ దిశగా గ్రామాలు
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాలను మటుమాయం చేసే సరికొత్త ప్రణాళిక ముసాయిదాను క్రిడా(సిఆర్‌డిఎ) సిద్ధం చేసినట్టు వస్తున్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దీనిపై సవివర కథనాన్ని ప్రజాశక్తి గురువారం ప్రచురించింది. సీడ్ క్యాపిటల్ పరిధిలోని ఉద్దండ్రాయుని పాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం,మందడం, తుళ్లూరు,శాఖమూరు,ఐనవోలు,నీరుకొండ, రాయపూడి కృష్ణాయపాలెం, బేతపూడి నిడమర్రు గ్రామాలు సగానికి సగం అదృశ్యమవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక సీడ్ యాక్సెస్ రోడ్ కోసం ఉండవల్లి,పెనుమాక,తాడేపల్లి మునిసిపాలిటీల పరిధిలోని పంట భూములూ స్వాధీనం చేసుకునే దిశగా ఆలోచనలు నడుస్తున్నాయట. గతంలో కృష్ణాయపాలెం రైతులు దీనిపై అభ్యంతరం చెబితే ప్లాను మార్చాలని ఆదేశించినట్టు చెప్పారు గాని నిజంగా మార్చింది లేదు. రాజధానిలో 3600 ఇళ్లను తొలగిస్తారని గతంలో అంచనాలు వచ్చాయి.సింగపూర్ రూపొందించిన మాష్టర్ ప్లాన్ ప్రకారం సీడ్‌బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో గ్రామాలను తీసేసే కుట్ర గతంలోనే బహిర్గతమైంది. ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాస కాలనీలలో ప్రత్యామ్నాయం చూపిస్తామని గతంలో చెప్పినా ఆ సూచనలు లేవు. దళితరైతుల ప్లాట్ల కేటాయింపు మరో వివాదంగా మారనుంది.
గ్రామాలను మాయం చేయకుండానే రాజధాని ప్లాను వుంటుందని గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు ఎవరూ విశ్వసించడం లేదు.పైగా సమీకరణ సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అనేకం అమలు కావలసివుండగా కొత్త అంశాలు తెరపైకి తేవడం ఆందోళన పెంచుతున్నది.