ఆర్‌బిఐలో 66 వేల కోట్ల నోట్ల అదృశ్యం

నల్లడబ్బును అరికట్టే పేరిట తీసుకున్న అనర్థక నిర్ణయం ఆఖరి ఘట్టంలో వున్నాం. ముగిసిపోతున్న 2016 ఆఖరి రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయమై మాట్లాడతారట. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో గాని ముందు సామాన్యుల బ్యాంక్‌ విత్‌డ్రాలపై విధించిన ఆంక్షలు ఎత్తివేయడం, ఎటిఎంలలోనూ బ్యాంకుల్లోనూ నగదు సరఫరా పెంచడం తక్షణం జరగాల్సి వుంది. ఈ చర్యతో విపరీతంగా నష్టపోయిన వ్యవసాయ రంగానికి చిన్న వ్యాపార పారిశ్రామిక వేత్తలకూ ఏదైనా ఉపశమనం కలిగించాలి. రేషన్‌ షాపుల్లో సరఫరాలు పెంచడమే గాక ఆధార్‌ చిక్కుముళ్లు తొలగించాలి.డిజిటల్‌ మంత్రజపం చేస్తున్నారు గనక ఆ లావాదేవీలపై అదనపు సుంకాలు తొలగించాలి. ఈ తతంగం వల్ల పట్టుకున్న నల్లధనం ఎంత వుందో లెక్కలతో సహా ప్రకటించాలి. అలాగే దీనివల్ల కలిగిన ఆర్థిక నష్టం ఎంతో, కోల్పోయిన ఉత్పత్తి ఉద్యోగాల పరిణామం ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలి.
ఇవన్నీ గాక ప్రభుత్వం చెప్పవలసిన సంజాయిషీ వొకటుంది. ఈ కాలంలో తను ముద్రించి సరఫరా చేసినట్టు రిజర్వుబ్యాంకు చెబుతున్న మొత్తానికి వాస్తవంగా వచ్చిన దానికి చాలా తేడా కనిపిస్తుంది. తేదీల వారిగా ఆర్‌బిఐ విడుదల చేసిన ప్రకటనలు ఇచ్చిన నోట్లలెక్కల ప్రకారం 5.93 లక్షల కోట్ల కొత్త నోట్లు విడుదలైనాయి.కాని వాస్తవంగా బ్యాంకులకు చేరిన, బట్వాడా అయిన నగదు లెక్కల మొత్తం అధికారికంగా 5.27 కోట్లు మాత్రమే వుంది. అంటే అక్షరాలా 66 వేల కోట్ల మేరకు సొమ్ము మిస్సింగ్‌ అన్నమాట. ఇదెలా జరిగింది? ముద్రించిన నోట్ల లెక్క ఎక్కువ చెప్పారా? లేక కొత్త నోట్లను ఎటైనా దారి మళ్లించారా? రేపు ప్రధాని ప్రకటనలో ఈ అంశానికి కూడా సమాధానం ఇవ్వకపోతే ఏదో మతలబు వున్నట్టే అనుమానించాలి. అలాగే అవినీతిపై నిరంతర విమర్శలు చేస్తూ యుపిఎ హయాంలోని అనేక కుంభకోణాలపై చార్జిషీట్టు దాఖలు చేసిన ఈ ప్రభుత్వం తమ పార్టీ వారిపై వచ్చిన వ్యాపాం కుంభకోణం, స్వయంగాప్రధానిపై వచ్చిన సహారా ఆదిత్యబిర్లా డైరీల ఆరోపణలపై విచారణకు సిద్ధపడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *