బిల్లు దారుణం-భాష మరీ దారుణం- అరెస్టులు ఇంకా..ఇంకా..
భూ సేకరణకు సంబంధించి తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లుపై తొలి వ్యాఖ్యానం నిన్ననే చేశాను. ఆ సందర్భంగానే ముదిగొండపై నిందారోపణలనూ ప్రస్తావించాను. అయితే తర్వాత చూస్తే ఈ వ్యవహారం మరింత దారుణంగా వుంది. మొదటిదేమంటే ఈ బిల్లును ఏ నిబంధనల కింద ఏ రూపంలో తెచ్చారనేది పూర్తి గందరగోళంగా బాధ్యతా రహితంగా నడిచింది.2013 చట్టంలోని 107,108 నిబంధనల కింద రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అవసరమైన సవరణలు చేసుకోవడానికి అవకాశం వుంది. లేదంటే రాజ్యాంగంలో 254 అధికరణం కేంద్రచట్టాల వర్తింపులో మార్పులు చేసుకోవడానికి వీలుకల్పిస్తుంది. అయితే ఇందులో ఏ పద్ధతిని అనుసరించానేదానిపై మొదట చెప్పింది మధ్యలో సమర్థించుకున్నది చివరకు ముగించింది అన్నీ రకరకాలుగా వున్నాయి. ఇది సాంకేతిక సమస్య మాత్రమేనని తప్పించుకోవడం కూడా కుదిరేపని కాదు. ఎందుకంటే భూ సేకరణ గ
త రెండేళ్లుగా నలుగుతున్న సమస్యే. అయినా ప్రభుత్వం అధ్యయనం చేయలేదంటే అంతకన్నా ఆక్షేపణీయం వుండదు. ముఖ్యమంత్రి కెసిఆర్ తన శైలిలో మాట్లాడి ఆమోదం పొంది వుండొచ్చు గాని రాజ్యాంగ రీత్యా మాత్రం ఇది సవ్యంగా జరగలేదు. సభా వ్యవహారాలు నీటి పారుదల శాఖ కూడా చూసే హరీష్ రావు వాదనలు మరింత గజిబిజిగా వున్నాయి.అంతిమంగా దీనిపై మాట్టాడేందుకు ప్రతిపక్షాలకు సమయం ఇవ్వలేదు గనక కాంగ్రెస్ టిడిపి సిపిఎం సభను బహిష్కరించాయి.సభలో వున్న బిజెపి నేత కిషన్‌రెడ్డి ఏవో సన్నాయి నొక్కులతో సరిపెట్టారే తప్ప నిరసలలో గొంతు కలిపింది లేదు. నోట్లరద్దుపై మోడీకి కెసిఆర్ మద్దతునివ్వడం, భూ సేకరణబిల్లు కూడా ప్రధాని సూచనపైనే చేశామని చెప్పడంతో బిజెపి నోటికి తాళం పడింది.పైగా విధానపరంగా వారికి దీంతో పెద్ద తేడా లేదు కూడా.1880ల నాటి బ్రిటిష్ చట్టం తప్ప ఈ దేశంలో మరో భూసేకరణ చట్టం లేదని తెలుసుకుంటే 2013 లో పోరాడి సాధించుకున్న చట్టం విలువ తెలుస్తుంది. అయితే పోరాటాలంటేనే గిట్టనివారికి ఇవన్నీ పట్టవు.
రెండో విషయం సిపిఎంవారు పోలీసుల చేతుల్లో సూదులు గుచ్చుతారని బాధపెట్టి కాల్పుల వరకూ తీసుకెళ్తారని ముఖ్యమంత్రి ముదిగొండ కాల్పులనూ అంగన్‌వాడీల ఆందోళనలను ఉదహరించడం మరింత దారుణం. వీటిపై నిన్ననే చెప్పుకున్నాము. వాస్తవానికి ఆ దౌర్జన్యంపై ఆగ్రహం ఉపయోగించుకుని ఆయన తనదైన స్వంత రాజకీయ వ్యవస్థ ఏర్పర్చుకున్నారు. ఇప్పుడు కొట్టిన కాల్చిన పోలీసులను ప్రభుత్వాలనూ వదలిపెట్టి సిపిఎం వారు సూదులు దబ్బనాలు గుచ్చుతారని చెప్పడం ఆక్రోశాన్నే వెల్లడిస్తుంది.
చివరగా కమ్యూన్ణిస్టులు కాంగ్రెస్ మాట అటుంచి ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనపై విరుచుకుపడటం కెసిఆర్ మార్కు రాజకీయానికి సంకేతం. దీనిపై కోదండరాం మౌనదీక్ష ప్రారంభించాల్సివచ్చింది. తెలంగాణ ఏర్పడిన రెండేళ్లలోనే అప్పటి జెఎసి చైర్మన్ కూడా భరించలేని పరిస్థితులు ఏర్పడ్డం ఆందోళనకరం.