అమ్మ మృతి అనుమానాస్పదమే.. మళ్లీ పోస్టుమార్టం?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలను మద్రాసు హైకోర్టు ధృవపరచింది. 75 రోజులు ఆస్పత్రిలో వున్న ఆమె ఆరోగ్య స్థితిపై నిజానిజాలు వెల్లడించి సందేహాలు నివృత్తి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయని వ్యాఖ్యానించింది. ఇన్ని రోజుల్లోనూ ఒక్కసారి కూడా ఆమె ఫోటో చూపించకపోవడాన్ని తప్పు పట్టింది. ఎఐడిఎంకె ప్రాథమిక సభ్యుడైన పిఎస్టాలిన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై న్యాయమూర్తులు వైద్యనాథన్,పార్తీపన్‌లు విచారణ జరిపారు. ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఇచ్చిన వివరణలతో వారు సంతృప్తిచెందలేదు. కేంద్ర ప్రతినిధులు వచ్చి ఆమెను సందర్శించినా ఆరోగ్య వివరాలు బయిటపెట్టలేదని కోర్టు విమర్శించింది.జయలలిత మృతదేహానికి మరోమారు పోస్టుమార్టం జరపడం అవసరమవుతుందేమోనని వైద్యనాథన్ అన్నారు. జయ మృతదేహాన్ని మెరీనా బీచ్‌లో ఖననం చేసిన సంగతి తెలిసిందే. అంటే బయిటకు తీసి పరీక్షించేందుకు అవకాశం వుందన్నమాట. అయితే ఈ కేసును విచారించిన సెలవుల ప్రత్యేక కోర్టు తర్వాత దీన్ని తగు ధర్మాసనానికి కేటాయించవలసిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది.
శశికళ ఎన్నిక
మరోవైపున జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్ ఎఐడిఎంకె ప్రధాన కార్యదర్శిగా ఆమె స్థానంలో ఎన్నికయ్యారు. ఆమె పరోక్షంలో ఆ పార్టీ సమితి ఆమెను ఎన్నుకున్నారు. నిబంధనల ప్రకారం ఆమెకు పూర్తి సభ్యత్వం రావడానికి సమయం పడుతుంది గనక అప్పటినుంచే ఈనియమాకం అమలుకు వస్తుంది. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చిన్నమ్మ(శశికళ) ఎన్నికను ప్రకటించడంతో వారిద్దరి మధ్య విభేదాల కథనాలకు సమాధానం లభించినట్టయింది. అసలు పన్నీరును 2001లో మొదటిసారి ఎంపిక చేసిందే శశికళ అని కనుక ఆయన ఆమెను వ్యతిరేకించే అవకాశం లేదని కొందరు అన్నారు. అయినా శశి ముఖ్యమంత్రి బాధ్యతలకోసం కూడా ఆశపడతారా లేక పన్నీరు సెల్వం తన చేతికింద మనిషే గనక ప్రస్తుతానికి కొనసాగిస్తారా అన్నది వేచిచూడవలసిన విషయమే.ఈ మొత్తం పరిణామాల వెనక కేంద్ర బిజెపి అదృశ్య హస్తం వుందని కూడా పరిశీలకులు చెబుతున్నారు.