ముదిగొండలో అప్పుడు నివాళులు..ఇప్పుడు నిందలా?
భూసేకరణ చట్టం చర్చ సందర్భంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సిపిఎంపై దాడి చేయడం ఒకటైతే ముదిగొండ గురించి ఆరోపణలు చేయడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయంలో ఆయన నాతో స్వయంగా వాదించి వుండటమే అందుకు కారణం. భూముల స్వాధీనం పేరిట మెదక్ జిల్లాలో ఒకప్పుడు టిఆర్‌ఎస్ ఉద్యమం చేపట్టింది. దానిపై టివి9లో చర్చ జరుగుతుంటే కెసిఆర్ ఫోన్‌లో వచ్చారు. నిజానికి ఆనాటి వాతావరణంలో భూమి సమస్యకు మించి ప్రాంతీయ ఉద్రిక్తతలే అధికంగా వున్నాయి. మీరు భూ పోరాట యోధులు ..వామపక్ష వాదులు .. భూసమస్యపై ఉద్యమాన్ని బలపర్చాలని ఆయన అన్నారు. ప్రాంతాలతో నిమిత్తం లేకుండా అన్నిచోట్ల ఆక్రమణలను భూస్వాములను ఎదుర్కోవాలని నేనన్నాను. గతంలో సిపిఎం సిపిఐ దీనిపై ఉద్యమం చేసినపుడు మీరు వైఎస్ ప్రభుత్వంలో వున్నారు అప్పుడే ముదిగొండలో కాల్పులు కూడా జరిగా
యి.అని గుర్తుచేశాను.( ఆ ఘటనకు కొంచెం ముందే టిఆర్‌స్ ప్రభుత్వం నుంచి బయిటకు వచ్చింది.రాజకీయ కోణంలోనే యథాలాపంగా అన్నాను) దీనిపై కెసిఆర్‌కు కొంచెం కోపం వచ్చింది.’మీరు సీనియర్ జర్నలిస్టులు. మేము ప్రభుత్వంలో వున్నామా? ముదిగొండకు ముందుగా వెళ్లి నివాళులర్పించింది నేనే’ అని ఆయన వ్యాఖ్యానించారు. అది నిజమే గాని అప్పటి వరకూ వున్నది ప్రస్తావించానని నేనన్నాను గాని వాదన ఆగలేదు. అలాటి కెసిఆర్ ఇప్పుడు మల్లన్నసాగర్ కుట్ర అనడం, ఎలాగైనా కాల్పులు జరిపించాలని రెచ్చగొట్టారని చెబుతూ గతంలో ముదిగొండలో కూడా ఇలాగే చేశారని చెప్పడం చూసినప్పుడు ఇదంతా నాకు మదిలో మెదిలింది. (అప్పుడే ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా రామోజీరావు భూములపైనా మాట్లాడారు. ఇప్పుడా ఫుటేజీ వుందో లేదో తెలియదు.వున్నా బయిటకు వచ్చే అవకాశం మాత్రం లేదని తెలుసు.). అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న చంద్రబాబు నాయుడు కూడా కాల్పులలో మరణించిన వారి మృతదేహాలకు జోహారులర్పించారు. ప్రభుత్వాధికారంలోకి వచ్చినంత మాత్రాన ప్రజా ఉద్యమాలను చులకన చేయడం నిందలు వేయడం ప్రజానాయకులకు తగనిపని అని చెప్పకతప్పదు