మరో హడావుడి అస్పష్ట ఆర్డినెన్సు
నోట్లరద్దుపై ఫీట్లలో భాగంగా కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు మరో ఆర్డినెన్సును అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.2017 మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు పదికి పైగా కలిగి వుండటం నేరంగా పరిగణించి జరిమానా జైలుశిక్ష విధిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా అస్పష్టంగా వున్నాయని హిందూ మొదట వ్యాఖ్యానించింది. దాంతోపాటు హిందూస్తాన్ టైమ్స్ కూడా ఈ వార్తను ప్రముఖంగా గాక అన్నిటితో పాటే ఇవ్వడం బట్టి స్పందనను అర్థం చేసుకోవచ్చు. డిసెంబరు 30 వరకూ నోట్లను మార్చుకోవచ్చని తర్వాత మార్చి వరకూ డిపాజిట్ చేసుకోవచ్చని ప్రధాని మొదట చేసిన ప్రకటన కొన్నాళ్ల కిందట సవరించి కేవలం డిపాజిట్ మాత్రమే చేసుకోవచ్చన్నారు. విత్‌డ్రాలపై పరిమితి విధించారు. ఆ నోట్లకు చట్టబద్దమైన విలువ వుండదని మాత్రమే గతంలో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని కలిగివుండటమే నేరమని చెబుతున్నది. డిసెంబరు 30 మార్చి 31 మధ్య తగు ఆధారాలు చూపిస్తేనే నోట్టు మార్చుకోవడం వీలవుతుందట. అది కూడా పరిమితంగానే. అలాగాక భారీగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే సంజాయిషీ ఇచ్చుకోవడమే గాక 5 వేలనుంచి జరిమానా కట్టాలట. ఏది ఏమైనా
చెల్లని డబ్బు కలిగి వుండటం నేరమెందుకు అవుతుందో అర్థం కాదు. ఇంతా చేసి బడా బాబులకూ సహస్ర కోటీశ్వరులకు సంబంధించి ఒక్క కఠిన చర్య కూడా ప్రకటించింది లేదు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాటలు వింటుంటే పన్నుల పరిధి పెంచుతామంటున్నారు గాని పైనున్నవారిపై ఎక్కువ వేస్తామనడం లేదు. అంటే మామూలు మనుషులను కూడా బాది వసూళ్లు పెంచుతారన్నమాట. ఇదే గొప్ప ఘనత అయినట్టు ఒక బడా తెలుగు పత్రికతో సహా పొగిడి పొగిడి పరవశించడం విశేషం. దేశానికి నేను వాచ్‌మన్‌నని మోడీ చెప్పడం బాగానే వుంది గాని దొంగలను వదిలేసి ఇంటివాళ్లను కొట్టడమే దారుణమని నేను ఉదయం టీవీ5లో అన్నమాట చాలామందికి నచ్చింది. ఎటిఎంలు మూసేసి క్యూలు తగ్గాయని చెప్పడం కూడా ఇలాటిదే.