మోడీ ఫీడ్‌బ్యాక్- బాడ్ అటాక్
నోట్లరద్దుపై ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాలు(ఫీడ్‌బ్యాక్) తెప్పించుకోవడం వల్లనే ప్రభుత్వం అనేక సార్లు నిర్ణయాలు మార్చుకోవలసి వచ్చిందని ప్రధాని మోడీ సమర్థించుకోవడం హాస్యాస్పదంగా వుంది. ఎందుకంటే నోట్లకొరత వల్ల పడుతున్న కష్టాలే అతిపెద్ద ఫీడ్‌బ్యాక్. దానికి స్పందించి వుంటే తప్పు సవరించుకుని పేదలు చిన్న వ్యాపారులు కష్టాల పాలవుకుండా చర్యలు తీసుకుని వుండేవారు. కాని వాస్తవంలో జరిగింది అందుకు విరుద్ధం. అంతకంతకూ ఆంక్షలు పరిమితులు పెరిగాయి. ఇప్పుడైతే డిసెంబర్30 తర్వాత కూడా అంటే 2017లోనూ ఆంక్షలు కొనసాగుతాయని ఆర్‌బిఐ ఆర్థిక శాఖ స్పష్టం చేశాయి. మరోవైపున బడా బాబుల గురించి సహస్ర కోటీశ్వరుల గురించి కేంద్రం సూటిగా ఒక్క మాటైనా అన్నది లేదు.ఎక్కువమందిని పన్ను పరిధిలోకి తేవాలని ప్రధాని అంటుంటే పన్ను రేట్లు తగ్గించాల్సిన అవసరముందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వువాచ. అంటే బాగా పైనున్న వారిపై భారీగా పన్నులు వేసే బదులు అత్యధికంగా వున్న కింది తరగతి వారినిఎక్కువగా పన్నుల్లోకి లాగుతారన్నమాట. ఇదో తిరోగమన వ్యవహారమే.
మోడీ నిర్ణయం తర్వాత ఆంధ్ర ప్రదేశ్ నుంచి మధ్య ప్రదేశ్ వరకూ అనేక చోట్ల రైతులు తమ పంటలకు ధరరాక రోడ్టపై పారేస్తున్నతీరును హిందూస్తాన్ టైమ్స్ ప్రత్యేక కథనంగా ఇచ్చింది. ఈ సమస్య గతంలోనూ వున్నా నోట్లరద్దు తర్వాత వ్యాపారుల ఆటలు బాగా పెరిగాయి. రైతులను దెబ్బతీసిన ప్రభుత్వం ధరలు తగ్గిపోతున్నట్టు ప్రచారం మొదలు పెట్టింది. కాని వాస్తవంలో దళారులు టోకు కొనుగోలుదారులు నష్టపోతున్నది లేదు. చిన్న వ్యాపారులు చితికిపోతున్నారని అనేక నివేదికలు వస్తున్నాయి. అయితేనేం ఇది గొప్పతనమే అంటున్నారు! ఏం చేస్తాం?