పోల’వరం’ మనకే కాదు- గుజరాత్,మహారాష్ట్రలకూ…
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నాబార్డు ఇచ్చిన 1981 కోట్ల రూపాయల చెక్కును అత్యధిక ప్రచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ, సమాచార మంత్రి వెంకయ్య నాయుడు అందజేశారు. ఇది తన జీవితంలో మరచిపోలేని రోజని చంద్రబాబు ప్రకటించారు. సంతోషమే. ఎందుకంటే ఏదో ఒకటి జరిగింది. అయితే దీన్ని ప్రత్యేక హౌదాకు ప్రత్యామ్నాయం అన్నట్టుగా ప్రచారం చేసుకోవడం అవాస్తవికం. ఎందుకంటే ప్రత్యేకహాదాను ప్రత్యేక ప్యాకేజీ ప్రహసనం కిందకు మార్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి పోలవరం గురించే నొక్కి వక్కాణిస్తున్నారు. దానికి నిధులు రావడమే వరప్రసాదమైనట్టు ప్రచారం చేయవలసిందిగా పార్టీ వారిని పురమాయిస్తున్నారు. మంత్రి దేవినేని ఉమ ఆ పని చేస్తూనే వున్నారు కూడా. అయితే ఇక్కద చెప్పుకోవలసిందేమంటే ఈ వరం మనతో పాటు గుజరాత్ మహారాష్ట్రలకూ లభించింది. ఎపి ప్రభుత్వం నిర్వహించిన ఈ వేడుకలేనే గుజరాత్ మహారాష్ట్రలకు చెందిన 99 ప్రాజెక్టులకు కూడా నాబార్దు నిధులు అందించారు. కాబట్టి ఈ వరంలో ప్రత్కేకత ఏమీ లేదని చెప్పకతప్పదు. నిజానికి గుజరాత్‌కు 18 వేల కోట్లకు పైగా మంజూరు కాగా ఇప్పటికే 12 వేల కోట్లు వివిధ రూపాలలో వినియోగించుకుంది. పైగా ఈ రెండు రాష్ట్రాలూ బిజెపి పాలనలో వున్నవే. రాష్ట్రమంతటికీ ముఖ్యంగా వెనకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర సమస్యలకూ పోలవరంకూ సంబంధం లేదని కూడా గుర్తించాలి.కాబట్టి అంతటికీ వర్తించే ప్రత్యేక హాదాను ఫణం పెట్టి పోలవరం కోసం రుణంగా ఇచ్చిన మొత్తాన్ని అతిగా చూపించడం కుదిరేపని కాదు.