చెన్నై తిరుపతి అవినీతి ఎక్స్‌ప్రెస్?
నోట్లరద్దు నల్లడబ్బు దాడుల ఘట్టం మొదలైనాక ఎక్కువ ప్రచారం పొందిన సందర్భాలు రెండు- ఒకటి టిటిడి సభ్యుడైన శేఖరరెడ్డి ఇంట్లో వందల కోట్ల పట్టివేత. తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి పిఎస్‌రామమోహనరావుపై దాడితో భారీ అవినీతి బహిర్గతం. ఈ రెండింటికంటే ముందు చిత్తూరు తెలుగుదేశం ఎంఎల్‌ఎ డికెసత్యప్రభ ఇంటిపై భారీ ఐటి దాడి జరిగింది గాని ఏమీ బయిటకు రాలేదు. సత్యప్రభ దివంగత ఎంపి వాణిజ్యవేత్త డికెఆదికేశవులు నాయుడు భార్య. ఆయన తమ్ముడి కుమారుడు బదిరీ నారాయణ తెలుగుదేశం జిల్లా ఉపాద్యక్షుడుగా వున్నారు. ఈయన పిఎస్ రామ్మోహనరావు కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. అంలే ఇక్కడ ఆర్థిక రాజకీయ బంధాలు పెనెవేసుకుపోయిన పరిస్థితి. ఈ రెండు చోట్ల దాడులు ఏకకాలంలో జరగడం, అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వంత జిల్లా కావడం కూడా రాజకీయ ప్రాధాన్యత పెంచుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా దీనిపై ప్రచురించిన కథనం టిడిపి వర్గాల దృష్టికి వచ్చింది. అయితే దానిపై పెద్దగా స్పందించవద్దనే నిర్ణయానికి వచ్చారు. అందుకు బదులుగా నోట్ల సరఫరాకు సంబంధించిన కథనంపై టిడిపి ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ తీవ్రంగా స్పందించడం, ఎడిటర్ కింగ్ షుక్ నాగ్‌పైన, వార్త రాసిన కృష్ణ ప్రసాద్‌పైన వ్యాఖ్యలు చేయడం గమనించదగ్గది. ఈ సరఫరాలో తేడాను నిన్న మనం చెప్పుకున్నాం. హైదరాబాద్ నగరం వున్నందువల్ల ఎక్కువ వచ్చివుండొచ్చని విజయకుమార్ రాశారు. అంతకు ముందు ఎపికి ఎక్కువ సరఫరా జరిగిందని విమర్శలు వినిపించాయి. ఏమైనా అవినీతి హైవేను వదిలేసి సరఫరాల సైడ్ వేపై చర్చ వల్ల ప్రయోజనం లేదు. ఇన్ని వివాదాలు దాడులతో సంబంధం వున్నవారు తమ పార్టీలో ప్రజా ప్రతినిధులుగా సంస్థాగత నాయకులుగా వుండటం టిడిపికి నిస్సందేహంగా ఒక కళంకమే.

