కేసులు స్టేల రాజకీయ యుద్ధం!

ఆంధ్ర ప్రదేశ్‌లో టిడిపి వైసిపిల మధ్య అలాగే వాటిని బలపర్చే మీడియా సంస్థల మధ్య లీగల్‌ యుద్ధం నిరంతరం నడుస్తూనే వుంది.అవతలి వారికి వ్యతిరేకంగా ఏదైనా తాత్కాలిక ఉత్తర్వు రాగానే ఇవతలివారు పండుగ చేసుకున్నంత హడావుడి చేస్తారు. అదే తమపై వస్తే గప్‌చిప్‌ మంత్రం పాటించడమో లేక ప్రభావాన్ని తగ్గించి చెప్పడమో జరుగుతుంది. అలాగే కేసులపై స్టేలు వస్తే లేక వ్యతిరేక తీర్పులు వస్తే మిన్నకుండి పోతారు. ఒకరు తగ్గినప్పుడు ఒకరు రెచ్చిపోతారు. ఉదాహరణకు ఓటుకు నోటు కేసులో ఎంఎల్‌ఎ ఆర్కే పిటిషన్‌పై సిబిఐ న్యాయస్థానం కొంత అనుకూలంగా ఆదేశాలిచ్చినా దాంతోనే చంద్రబాబుపై ఏవో చర్యలు తీసుకుంటారని ఎవరూ అనుకోలేదు. కాని వైసీపీ నేతలు అలాగే ప్రచారాలు సాగించారు. తర్వాత దానిపై హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.చంద్రబాబు కోర్టులను మేనేజిచేస్తున్నారని ఆరోపించారు. మరోవైపున జగన్‌ ఆస్తుల స్వాధీనం విషయంలో ఇడి ట్రిబ్యునల్‌ ఉత్తర్వులకు ఒక పత్రిక అత్యధిక ప్రచారమిచ్చింది. సాక్షి పెద్దగా ఇవ్వలేదు. తర్వాత దాన్ని సోమవారం హైకోర్టు నిలిపేసింది. ఈ ఆదేశానికి మాత్రం పెద్ద ప్రచారం లభించలేదు. ఆఖరుకు సాక్షి కూడా ఆచితూచి ఇచ్చే పరిస్థితి. తర్వాత బుధవారం వచ్చే సరికి స్పష్టంగా అన్ని సంస్థలకూ సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి రాజా ఇలాంగో ఖచ్చితమైన నిలుపుదల ఉత్తర్వులిచ్చారు.మామూలుగా కింది సంస్థ ఆదేశాలను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ముందు సవాలు చేయడానికి 45 రోజులు సమయం వున్నా ఆదరాబాదరాగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్టు జగన్‌ సంస్థల న్యాయవాదులు ఆరోపించారు.దాంతో 45 రోజుల తర్వాత ఆ ట్రిబ్యునల్‌ ఏదైనా తేల్చిచెప్పే వరకు స్వాధీనం చేసుకోవద్దని జస్టిస్‌ ఇలాంగో ఉత్తర్వులిచ్చారు.అయితే 45 రోజుల తర్వాత ఇదే పునరావృతం కావచ్చు, కాకపోవచ్చు. కాబట్టి అప్పుడే జగన్‌ బృందం అతిగా సంతోషించాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం కూడా దీనిపై పెద్దగా స్పందించేందుకు తొందరపడటం లేదు. ఏమైనా స్టేలు మధ్యంతర ఉత్తర్వులు కింది కోర్టుల ఆదేశాలు తీర్పులపై అతిగా రభస చేయడం అవసరం లేని పనే. ఎందుకంటే ఇదో కొనసాగే ప్రక్రియ.పైగా ఎవరికి వ్యతిరేకంగా వచ్చినా ఒకేలా వుండాలి తప్ప మేమైతే రైటు వారైతే మోసం అన్నట్టు మాట్లాడ్డం కుదరదు.మీడియా సంస్థలూ ఈ విషయంలో సమతుల్యత పాటించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *